05,2020 12:23PM
హైదరాబాద్ : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రైతులతో కేంద్ర ప్రభుత్వం శనివారం మరోసారి సంప్రదింపులు జరపనుంది. ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరగ్గా.. కేంద్రం చేసిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించంతో అవి కొలిక్కిరాలేదు. దీంతో మరో విడత చర్చలకు కేంద్రం సిద్ధమైంది. అయితే ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని, నూతన చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం దిగిరాకపోతే పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 8వ తేదీన భారత్ బంద్ కూడా చేపట్టాలని రైతన్నలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నేటి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఢిల్లీ శివారుల్లో అన్నదాతల ఆందోళన పదో రోజుకు చేరింది. ఢిల్లీ-నోయిడాను కలిపే చిల్లా సరిహద్దులో వేలాది మంది రైతులు బైఠాయించి నిరసన సాగిస్తున్నారు. నేటి చర్చల్లో సానుకూల ఫలితం రాకపోతే పార్లమెంట్‌ను ముట్టడిస్తాం అని రైతన్నలు కరాఖండీగా చెబుతున్నారు. రైతులు చేస్తున్న ఆందోళనకు దేశవ్యాప్తంగానే గాక, విదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కెనడా ప్రధాని, ఆ దేశ నేతలు అన్నదాతలకు సంఘీభావం తెలపగా.. తాజాగా బ్రిటన్ ఎంపీలు కూడా మద్దతు ప్రకటించారు