– రాత పూర్వక సవరణలు పంపిస్తామన్న కేంద్రం
– తదుపరి వ్యూహంపై రైతు సంఘాల నేతలు నేడు భేటీ
– చట్టాలు రద్దు చేయాల్సిందేనని పునరుద్ఘాటన
న్యూఢిల్లీ : రైతు సంఘాల నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం సాయంత్రం జరిపిన చర్చల్లో ఎటూ తేలలేదు. పూసాలోని అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఈ చర్చల్లో ప్రభుత్వం తరపున అమిత్ షా, రైతు సంఘాలు తరపున దర్శన్ పాల్, హన్నన్ మొల్లా, బల్బీర్ సింగ్, రాకేశ్ తికాయిత్, జగ్జిత్ సింగ్, గుర్నాం చాధుని, శివకుమార్ కక్క, రుల్దు సింగ్ మాన్సా, మంజిత్ సింగ్ రారు, బుటా సింగ్ బురుజ్గిల్, హరీందర్ సింగ్ లఖోవాల్, కుల్వంత్ సింగ్ సంధు, భోగ్ సింగ్ మాన్సా తదితరులు పాల్గొన్నారు. అయితే మండి సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. షా ప్రతిపాదన నేపథ్యంలో తదుపరి వ్యూహం ఖరారు చేసేందుకు రైతు సంఘాల నేతలు బుధవారం భేటీ కానున్నారు. షా పంపే ప్రతిపాదనలను బట్టి తమ నిర్ణయం ఆధారపడివుంటుందని ఎఐకెఎస్ నాయకులు హన్నన్ మొల్లా తెలిపారు.
సమాచారం లేకుండా వేదిక మార్చిన షా
రైతు సంఘాల నేతలకు సమాచారం ఇవ్వకుండానే చర్చల వేదికను కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చారు. వాస్తవానికి రాత్రి 7 గంటలకు అమిత్ షా నివాసంలో చర్చలని రైతు సంఘాల నేతలకు సమాచారం ఇచ్చారు. దానిప్రకారం 13 మంది రైతు సంఘాల నేతల్లో అమిత్ షా నివాసానికి వెళ్లారు. వారికి అక్కడ అనుమతి లేదని, సమావేశం ఇక్కడ జరగటం లేదని స్పష్టం చేశారు. దీంతో రైతు సంఘం నేతలు ఎక్కడికి వెళ్లాలో పోలుపోలేదు. దీంతో ఇటు మీడియాలోనూ, అటు రైతు సంఘం నేతల్లోనూ చర్చలు జరిగే వేదిక గురించి గందరగోళం నెలకొంది.
– నేడు రాష్ట్రపతి నీ కలువనున్న ప్రతిపక్ష నేతలు భేటీ
దేశంలో రైతు ఉద్యమం ఉధృతం అవుతున్న నేపథ్యంలో నేడు (బుధవారం) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రతిపక్ష నేతలు కలవనున్నారు. 24 ప్రతి పక్షాల నేతలు రాష్ట్రపతిని కలవాల్సి ఉంది. కానీ కరోనా నిబంధనలు కారణంగా ఐదుగురిని మాత్రమే అనుమతించారు. దీంతో రాహుల్ గాంధీ (కాంగ్రెస్), శరద్ పవర్ (ఎన్సీపి), సీతారామ్ ఏచూరి (సీపీఐ(ఎం)), డి.రాజా (సీపీఐ), టి.ఆర్ బాలు (డీఎంకె) నేతలు కలవనున్నారు
