ముంబయి : భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను ముంబయి పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. జెడబ్ల్యూ మారియట్ హౌటల్‌లోని పబ్‌లో అర్థ రాత్రి దాటినా పార్టీ చేసుకోవటంతో పోలీసులు తనిఖీ చేశారు. పలు దేశాల్లో కోవిడ్19 రెండో దశ ప్రమాదకరంగా విజృంభిస్తున్న దశలో మహారాష్ట్రలో రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. కరోనా వైరస్ నిబంధనలను ఉల్లంఘించిస్తూ తెల్లవారుజాము వరకు పబ్‌లో గడపిన సురేశ్ రైనా సహా 34 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై సురేశ్ రైనా విడుదల అయ్యాడు. ఈ సంఘటనపై రైనా టీమ్ స్పందించింది. ‘ ఓ ప్రచార షుట్ కోసం సురేశ్ రైనా ముంబయిలో ఉన్నారు. అది రాత్రి వరకు కొనసాగింది, అనంతరం ఓ మిత్రుడు డిన్నర్‌కు ఆహ్వానించాడు. ఢిల్లీకి తిరుగు పయనం అయ్యే క్రమంలో ముందు రైనా అక్కడ గడిపాడు. స్థానిక నిబంధనలు, కర్ఫ్యూ వేళలపై రైనాకు అవగాహన లేదు’ అని ప్రకటనలో తెలిపారు
