బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్…

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(48)కి శనివారం హార్ట్ ఎటాక్ వచ్చింది. కోల్‌కతాలోని తన నివాసంలో ఈరోజు ఉదయం సౌరవ్ గంగూలీ వ్యాయమం చేస్తుండగా అస్వస్థతకి గురై కిందపడిపోయాడు. దాంతో కోల్‌కతాలోని ఉడ్‌లాండ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. సౌరవ్ గంగూలీ ఆరోగ్యపరిస్థితిపై నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నామన్నారు. మరిన్ని పరీక్షలు చేయాలని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. గతంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. కెప్టెన్‌గా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. గంగూలీ హయాంలో భారత జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది. గంగూలీ 113 టెస్ట్, 311 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. వన్డేల్లో 11,363 పరుగులు చేశారు. ఇందులో 22 సెంచరీలు, 72 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఇక టెస్ట్‌ల్లో 7,212 రన్స్ సాధించారు గంగూలీ. ఇందులో 16 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ గంగూలీకి మంచి రికార్డే ఉంది. వన్డేల్లో 100, టెస్టుల్లో 32 వికెట్లను పడగొట్టారు ఈ బెంగాల్ దాదా. 2012 వరకూ ఐపీఎల్‌లోనూ ఆడారు. 2008-10 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్, 2011-12 వరకు పుణె వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *