అమెరికాలో అగంతక రాజకీయాలు..

ఆర్నెల్లు సావాసం చేస్తే వాళ్లు వీళ్లవుతారన్నది సామెత. అమెరికా పరిణామాలు చూస్తే నిజమేనేమోననిపిస్తోంది. బుధవారం ప్రపంచ ప్రజాస్వామ్య సౌధమని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్ష భవనాన్ని ఓ అగంతక గుంపు ఆక్రమించుకోవటానికి ప్రయత్నించింది. ప్రపంచంలోనే అతి పెద్ద చరిత్ర కలిగిన ప్రజాస్వామిక దేశంగా చెప్పుకుంటున్న అమెరికాలో ఇటువంటి పరిణామం ఊహించరానిది. కనీసం సమీప చరిత్రలో అంటే గత వందేళ్లల్లో ఇటువంటి సంఘటన ఇదే మొదటిది అయి ఉంటుంది. ఈ అగంతకు గుంపు రాజకీయంగా మితవాద భావాలు, కరుడుకట్టిన శ్వేతజాతి పురుషాధిక్యత భావాలు కలిగిన గుంపు కావటం గుర్తించాల్సిన విషయం. ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల్లో సాగించిన ప్రచారం, తర్వాత నాలుగేళ్ల పాటు కొనసాగిస్తూ వచ్చిన ప్రచారంతో ఇటువంటి తిరోగామి భావాలకు సామాజిక హెూదా లభించింది. లండన్ నుండి వెలువడే గార్డియన్ పత్రిక వ్యాఖ్యానించినట్లు అధ్యక్ష భవనంలో అంతకులు లేకపోతే వారికి మద్దతుగా అగంతకుల గుంపు పోగుకావటం సాధ్యం కాదు.

ఈ గుంపు లక్ష్యం ఏమిటి? నవంబరులో జరిగిన ఎన్నికల్లో బైడెన్, కమలా హారిస్ గెలుపును అపహాస్యం చేయటమే. ఓట్ల లెక్కింపు మొదలు గెలుపు ప్రకటన వరకూ ట్రంప్ ఈ ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూనే ఉన్నాడు. చివరకు తాను ఈ ఎన్నికల ప్రక్రియనే అంగీకరించే ప్రసక్తి లేదని బెదిరింపులకు కాల్పడ్డాడు. ఎన్ని పరిమితులున్నా అమెరికా రాజ్యాంగం నిర్దేశించిన విధి విధానాలకు లోబడి ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు వస్తున్నాయి. పాలకులు మారుతున్నారు. ప్రపపంచ ప్రజాస్వామిక అగ్రరాజ్యం అన్న కిరీటాన్ని తగిలించుకుని దేశ దేశాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో అమెరికా కాళ్లూ వేళ్లూ పెడుతోంది. బహుశా అమెరికాలోని మితవాద రాజకీయ భావాలు కలిగిన వారు విదేశాల్లో అమెరికా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న అగంతక రాజకీయాలనుండి ప్రోత్సాహం పొందినట్లు కనిపిస్తోంది. తాజాగా వెనిజులాలో, బొలీవియాలో, చీలిలో ఇతర అనేక లాటిన్ అమెరికా దేశాల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియను దారితప్పించేందుకు అమెరికా ఇటువంటి అగంతక రాజకీయాలకు పాల్పడింది. గత ఏడెనిమిది దశాబ్దాలుగా అమెరికా చరిత్రే ఇది. ఇటువంటి పరిణామాల గురించి వినీ, చూసి, తెలుసుకుని మితవాద రాజకీయ శక్తులు ఇదే వ్యూహాన్ని దేశీయంగా అమలుచేయబూనుకోవటానికి ప్రయత్నించిన ఫలితమే బుధవారం నాడు అధ్యక్ష భవనంపై దాడి అని చెప్పవచ్చు.

ఈ పరిణామాలు గమనిస్తుంటే మోడీ నేతృత్వంలో భారతీయ ప్రజాస్వామ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికాలో జరుగుతున్న పరిణామాల మధ్య ఉన్న పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. దేశానికి నాయకత్వం వహించే బృందాలు, ప్రజాభిప్రాయ వ్యక్తీకరణ పేరుతో అగంతక రాజకీయాలకు పాల్పడే బృందాల మధ్య ఉన్న పోలికను, సారూప్యతను, సామీప్యతను ఈ పరిణామాలు మరోసారి ప్రజల ముందుకు తెస్తున్నాయి. ఏలికగా ఉన్న ట్రంప్ అమెరికా రాజకీయ ఆర్థిక వ్యవస్థపై ఇతరుల ఆధిపత్యం పెరిగిపోతోందని, స్వదేశంలోనే శ్వేతజాతీయులు అల్పసంఖ్యాకులుగా మారిపోతున్నారన్న ప్రచార వ్యూహానికి తెరతీశాడు. గ్రీన్ కార్డు, వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ కోణంలో చూడాలి. అంటే నాలుగువందల ఏళ్లకు పైగా అమెరికా అధ్యక్ష భవనాన్ని శాసించి, ప్రపంచ రాజకీయాలను శాసించిన అమెరికా శ్వేతజాతి పౌరులకు నేడు ప్రమాదం ముంచుకొచ్చిందన్నది ట్రంప్ తరహా రాజకీయ నాయకుల వాదన. భారతదేంలో ఆరెస్సెస్-బిజెపి నాయకుల వాదనలకు దగ్గరగా ఉండటం ఈ సందర్భంగా గమనించాలి.

నవంబరులో జరిగిన ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలు అంగీకరించి ఉన్నట్లైతే ఇటువంటి అగంతక రాజకీయాల అవసరం ఉండేది కాదు. భారతదేశంలో సైతం వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అర్హత లేకపోయినా, రాజ్యాంగ ప్రమాణాలు అనుమతించకపోయినా ఆయా రాష్ట్రాల్లో బిజెపి అధికారాన్ని స్వంతం చేసుకున్న తీరు గత ఏడేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాము. ట్రంప్ నాయకత్వంలోని అమెరికా పరిణామాలకు, మోడీ నాయకత్వంలోని భారతదేశ పరిణామాలకు తేడా ఒక్కటే. ఇక్కడ పార్టీ ఫిరాయింపులు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వాలు ఫిరాయింపుదార్లకు భారతదేశంలో అందుబాటులో ఉన్నంత ఎక్కువగా ప్రపంచంలో మర్కెకడా అందుబాటులో లేవు. అమెరికాలో అధికారం ఎవరిదైనా శిఖరాగ్రంలో ఉన్న ఒక్క శాతం అనుభవించే ఫలితాలు, ఫలాలు విషయంలో తేడా ఏమీ ఉండదు కాబట్టి అక్కడ ఈ స్థాయిలో ఫిరాయింపులు మనకు కనిపించటం లేదు.

ఇటువంటి మూకదాడులు ఈ కాలంలో గణనీయంగా పెరిగాయి. యూరోపియన్ దేశాల్లో మొదలైన ఈ దాడులు గత కొంత కాలంగా భారతీయ ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా పరిణమించాయని నెత్తీ నోరు మొత్తుకుంటుంటే సోకాల్డ్ మేధావులు పెడచెవిన పెట్టారు. చివరకు షాహీనా బాగ్ పై తుపాకీ పేల్చిన అగంతకుడు నేడు పెద్దల సమక్షంలో బిజెపిలో చేరాడు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంపై దాడి చేసిన గుంపు, వాళ్లు ఉ పయోగించిన వాట్సప్ నంబర్లు, అందులో చెలరేగిపోయి సాగిన విద్వేష ప్రచారానికి పునాదులు వేసి వ్యూహ రచన చేసిన వాళ్లల్లో ఒక్కడూ అరెస్టు కాలేదు. తాజాగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల శిబిరంలో మద్యం సీసాలతో జొరబడి, రైతాంగాన్ని అప్రతిష్ట పాల్చేయాలని కూడా ప్రయత్నం జరిగింది. ఇటువంటి అగంతక రాజకీయాల లక్ష్యం ఒక్కటే. ప్రజల దృష్టిలో ప్రత్యర్థుల ప్రతిష్టను దెబ్బతీయటం. ఓసారి ఏ కారణంగానైనా ప్రతిష్ట దెబ్బతింటే ప్రజల్లో అనుమానాలు పెరుగుతాయి. చట్టబద్ధంగా ఏర్పాటైన సంస్థలు, వ్యవస్థలపై అటువంటి అనుమానాలు సృష్టించటం ద్వారా ఏకంగా ఈ వ్యవస్థలకు పునాదులైన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజాభీష్టాలను తిరస్కరించటానికి, కుతర్కంతో నోరేసుకుని ఎగబడే వారిదో, భౌతిక దుశ్చర్యలకు పాల్పడేవారిదో ప్రజాభీష్టంగా మార్చటానికి పునాదులు పడతాయి. 1970 దశకం నుండి భారతదేశంలో సంఘపరివారం అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం ఇదే. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని పాశ్చాత్య దేశాల మితవాద శక్తులు అనుసరించబూనుకుంటున్నాయి. ఈ పరిణామలు రానున్న కాలంలో ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తు చేస్తున్నాయి.

కొండూరి వీరయ్య సీనియర్ జర్నలిస్ట్

2 Replies to “అమెరికాలో అగంతక రాజకీయాలు..”

  1. జరుగుతున్న రాజకీయపరిణామాలను మనదేశ రాజకీయవిశ్లేషణ చాలా వివరంగా ఉద్ఘాటించారు.ఈరాజకీయమార్పులను పరిశీలిస్తే రాబోయేకాలం భారతీయసమాజానికి్రమాదం పెనుప్రమాదం పోంచివున్నదనిపిస్తుంది.

  2. Sir
    Your analised current politics clearly and effectively.. Every Indian must realise the “Rear Politics”..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *