తమిళనాడులోని మధురై ప్రాంతంలో నిర్వహించిన జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నిండు ప్రాణాలు కోల్పోయారు. శనివారం అలంకనల్లూర్లో జరిగిన జల్లికట్టు పోటీలకు నవమణి అనే వ్యక్తి అతని స్నేహితుడికి చెందిన ఎద్దును తీసుకొని వచ్చాడు. అయితే ఒక్కసారిగా ఆ ఎద్దు తిరగబడి, నవమణిపై దాడి చేసింది. అతన్ని కొమ్ములతో కుమ్మేసింది.
నవమణికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో తొలుత ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మధురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం నవమణి ప్రాణాలు కోల్పోయాడు.