కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి మరోసారి భారీ షాక్ ఇచ్చింది. ఓవైపు పెట్రోల్ ధర వరుసగా పెరుగుతూ రూ. వందకు చేరువగా వెళ్తున్న వేళ సామాన్యుడి నడ్డి విరిచేలా రాయితీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఎల్పీజీ వంటగ్యాసు ధరలను సిలిండర్‌కు రూ. 50 చొప్పున పెంచుతున్నట్లు ఆదివారం ఇండియన్ ఆయిల్ సంస్థ తెలిపింది. ఇవాళ్టి నుంచి పెరిగిన రేట్లు అమలులోకి వస్తాయి. పెరిగిన ధరతో ఇక గ్యాసు సిలిండర్ ధర సోమవారం నుంచి రూ. 769 కానుంది. ప్రాంతాలవారీగా ఈ ధరల్లో తేడాలుంటాయి. పెరిగిన రేట్లతో తెలుగు రాష్ట్రాల్లో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 821.50కు చేరింది. ఇండేన్ గ్యాసు పేరిట దేశంలో అతి పెద్ద ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ రిటైల్‌గా సిలిండర్లు పంపిణీ చేస్తుంది. ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీయేతర రేట్లను నెలవారి ప్రాతిపదికన సమీక్షిస్తుంటారు. ఇది ఇలా ఉండగా… గడిచిన డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకూ ఎల్పీజి సిలిండర్ల రేటు పెరగడం ఇది మూడోసారి. ఇక సామాన్య జనం మళ్ళీ కట్టెల పొయ్యికి మారాల్సిన దుస్థితి దాపురించింది.
