భావప్రకటనా స్వేచ్ఛ – రాజకీయ హక్కు 

పెట్టుబడులు, వాణిజ్యంపై ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు, అదుపాజ్ఞలు సడలించి పెట్టుబడికి స్వేచ్ఛను ప్రసాదించటమే ప్రపంచీకరణ మూలపునాదుల్లో ఒకటి. మన దేశం కూడా ప్రపంచీకరణ బాట పట్టి మూడు దశాబ్దాలు గడిచి పోయాయి. ఈ మూడు దశాబ్దాల్లో స్వదేశీ, విదేశీ పెట్టుబడులకు వేసిన పగ్గాలు సడలిస్తూ వచ్చాయి ప్రభుత్వాలు. ఈ మూడు దశాబ్దాల్లోనే వ్యక్తిగత స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలకు ప్రభుత్వం కళ్లెం వేస్తోంది. వాణిజ్య స్వేచ్ఛ, పెట్టుబడుల స్వేచ్ఛ యుగళగీతం పాడుతున్న సంస్కరణ సమర్ధకులకు అదే రాజ్యం వాక్‌ స్వాతంత్య్రం, వ్యక్తిగత స్వేచ్ఛలను కబళిస్తున్న తీరు మాత్రం కనిపించటం లేదు. లేదా చూడదల్చుకోవటం లేదు. స్వేచ్ఛ ఇస్తే పెట్టుబడి సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న వాదన నిజమైనప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రం ప్రజల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అంశమే కదా. మరి ఒక వర్గానికి ప్రాణప్రదమైన స్వేచ్ఛ మరో వర్గానికి దక్కకూడదని పాలకవర్గం ఎందుకు భావిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయకపోయినా, తెలుసుకోవటంలో జాప్యం జరిగినా ప్రజలకున్న స్వేచ్ఛ శాశ్వతంగా సంకెళ్లలో బందీ అవటం ఖాయం.
ఈ ప్రమాదాన్ని గుర్తిస్తూ 2006 నోబెల్‌ బహుమతి గ్రహీత ఓరాన్‌ పాముఖ్‌ అన్న మాటలివి. ”దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. దేశంతో పాటు బూర్జువావర్గం అభివృద్ధి చెందుతోంది. ఉద్యోగ స్వామ్యం, సైన్యాధికారులు అభివృద్ధి చెందుతున్నారు. దీంతో పాటే ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవనం సాగించగలిగే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో సంపన్న వర్గం చేతిలోని సంపద పెరుగడంతో పాటే ధిక్కార స్వరాలు కూడా పెరుగుతున్నాయి. దీన్ని నిలువరించలేం” అని హెచ్చరించారు. ఈ వాక్యాలు టర్కీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో చెప్పినవే అయినా నేటి భారతదేశానికి అతికినట్టు సరిపోతాయి.

వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ కవలపిల్లలే. ఒకటి విడిచి మరోటి ఉండలేదు. ఈ రెంటిని కలిపి ఉంచేది రచన. అది పాత్రికేయ రచన కావచ్చు. పుస్తక రచన కావచ్చు. ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి వివిధ దేశాల్లో జాతీయోన్మాదం పెరిగే కొద్దీ రచయితలు, పాత్రికేయుల సృజనాత్మక సామర్ధ్యాలను అదుపులో పెట్టేందుకు లేదా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రాజ్యం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే స్వతంత్ర మీడియా సంస్థలపైనా, వాటి నిర్వాహకులపైనా ప్రత్యక్ష పరోక్ష దాడులకు పాల్పడుతోంది ప్రభుత్వం. ఈ దాడులు ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చాక విపరీతంగా పెరిగాయన్నది ప్రపంచం గుర్తించిన వాస్తవం.
ఈ రకమైన రాజ్యపు ఆంక్షలు 16వ శతాబ్దంలో అచ్చు యంత్రం ఉనికిలోకి రావటంతోనే మొదలయ్యాయి. బ్రిటన్‌ నుంచి అచ్చయ్యే అన్ని పుస్తకాలు ముందుగా ప్రభుత్వం అనమతి పొందాలని బ్రిటిష్‌ పార్లమెంట్‌ 1644లో చట్టం చేయటంతో దానిని ఖండిస్తూ ప్రముఖ ఇంగ్లీషు కవి జార్జి మిల్టన్‌ పెద్ద కరపత్రమే రాశాడు. అమెరికాలో సైతం భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం న్యాయస్థానాల్లో భారీ వివాదాలే చెలరేగాయి. న్యూయార్క్‌ నుంచి వెలువడే ఓ పత్రికలో రాసిన వ్యాసాలు దేశ ద్రోహమని అప్పటి ప్రభుత్వం కోర్టునాశ్రయించింది. చివరకు జాన్‌ పీటర్‌ జెంగర్‌ రాసిన ఈ వ్యాసాలు వాస్తవాల ఆధారంగాగా రాసినవే కాబట్టి దేశద్రోహం ఆరోపణ చెల్లదని న్యూయార్క్‌ న్యాయస్థానం 1733లో కేసు కొట్టేసింది. దీనికి కొనసాగింపుగానే స్వీడన్‌ చట్టసభ 1766లో పత్రికా స్వాతంత్య్రం చట్టాన్ని ఆమోదించింది. ప్రపంచంలో పత్రికా స్వేఛ్చ కు పట్టం కట్టిన తొలి చట్టం ఇదే. ఈ చట్టంలోని స్ఫూర్తే తర్వాతి కాలంలో ఐక్యరాజ్యసమితి ఆమోదిం చిన మానవహక్కుల ప్రకటనలో అంతర్భాగ మైంది.

ఇక భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పరిశీలిస్తే వలస ప్రభుత్వం ప్రతిపాదించిన సెన్సార్‌షిప్‌ చట్టానికి వ్యతిరేకంగానే భగత్‌సింగ్‌ పార్లమెంట్‌లో బాంబులేసి మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాధాన్యత గురించి చెవిటి వారికి కూడా వినిపించే ప్రయత్నం చేశాడు. దురదృష్టవశత్తూ నేడు కోట్లాదిమంది వర్తమాన పరిణామాట పట్ల కళ్లున్నా గుడ్డివారు గానూ, చెవులున్నా చెవిటివారుగానూ వ్యవహరిస్తున్నారు. 1970 దశకంలోనే రమేష్‌ థాపర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మద్రాసు కేసులో అప్పటి ప్రధాన న్యాయమూర్తి పతంజలి శాస్త్రి ”ప్రజాతంత్ర వ్యవస్థకు పత్రికా స్వాతంత్య్రం, అచ్చేసే స్వాతంత్య్రం పునాదిరాయి వంటిది. స్వేచ్ఛాయుతమైన చర్చ లేకుండా ప్రజలను విద్యావంతులను చేయలేం. ప్రజలు చైతన్యవంతులు కాకుండా ప్రజాస్వామిక ప్రభుత్వాలు సక్రమంగా పని చేయలేవు. కాబట్టి ప్రభుత్వాలు చట్టబద్ధంగా పని చేయటానికి పత్రికా స్వేచ్ఛ కీలకం.” అని తీర్పునిస్తూ క్రాస్‌వర్డ్‌ పత్రిక ప్రచురణపై అప్పటి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధం రాజ్యంగ విరుద్ధమని స్పష్టం చేసారు. మరో సందర్భంలో యూనియన్‌ ఆఫ్‌ ఇండియా వర్సెస్‌ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్‌ కేసులో సుప్రీం కోర్టు ”తప్పుడు సమాచారం, కావల్సిన సమాచారం అందకపోవటం, ఉద్దేశ్యపూర్వకంగా నిరాధారమైన ఆరోపణలు గుప్పించటం వంటి పరిణామాలు ప్రజలకు విషయాలు చేరకుండా చేస్తాయి. వాస్తవాల పట్ల అవగాహనలేని ప్రజలు ఉన్న చోట ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే సమాచారం ఇవ్వటానికి, స్వీకరించటానికి, నిర్దిష్ట అభిప్రాయాలు కలిగి ఉండటానికి ఉన్న స్వేచ్ఛే” అని చెప్పింది. మరో కేసులో ప్రజాస్వామ్యం మనుగడకు పత్రికా స్వేచ్ఛ కీలకమైనందున పత్రికా స్వేచ్ఛకు అంతరాయం కలిగించే అన్ని చర్యలు, చట్టాలు రద్దు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

కానీ నేడు ఈ స్ఫూర్తికి భిన్నమైన నిర్ణయాలు అమలు జరుగుతున్నాయి. 2020లో పత్రికా స్వాతంత్య్రంపై ఆంక్షలు, పాత్రికేయులపై దాడులు చేస్తున్న దేశాల్లో భారతదేశం అగ్ర స్థానంలో ఉంది. తాజాగా హత్రాస్‌ ఘటనను గురించి ప్రత్యక్ష సమాచారం సేకరించటానకి వెళ్లిన మళయాళీ పత్రిక విలేకరి జైలు పాలయ్యాడు. ఎర్రకోటపై జనవరి 26న జరిగిన పరిణామాలను ప్రజల ముందుంచిన స్వతంత్ర మీడియా సంస్థలు ప్రభుత్వం నుంచి దాడులను ఎదుర్కొంటున్నాయి. ఎర్రకోట సమీపంలో ఓ రైతు మరణానికి పోలీసు కాల్పులే కారణమని వార్తలు ప్రసారం చేసినందుకు ”వైర్‌” వెబ్‌ పత్రిక వ్యవస్థాపకుడు సిద్ధార్థ వరదరాజన్‌తో పాటు మరో ఆరుగురిపై కేంద్ర ప్రభుత్వం దేశద్రోహం కేసులు బనాయించింది. రైతు ఉద్యమం గురించిన వార్తలు ప్రత్యక్షంగా ప్రజలకు ప్రసారం చేసిన ”కేరవాన్‌” పత్రికా విలేకరి పునియా జైలు పాలయ్యాడు. ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక చట్ట వ్యతిరేక విధానాలు, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైన కేంద్ర ప్రభుత్వ వ్యహారాలను ప్రజల దృష్టికి తెస్తున్న ”న్యూస్‌ క్లిక్‌”పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు చేసింది. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు వందగంటలకు పైగా వ్యక్తులను గృహనిర్భంధంలో ఉంచటం, వారి నుంచి వివరాలు సేకరించే పేరుతో అనేకరకాల చిత్ర విచిత్ర చర్యలకు పాల్పడటం ఇదే మొదటి సారి.
ఇటువంటి పరిణామాల గురించి ప్రస్తావిస్తూ ఓరాన్‌ పాముఖ్‌ ”జాతీయవాద ఛాందసత్వం తలకెక్కించుకున్న ప్రభుత్వాలు (అది ఆర్థిక జాతీయవాదం కావచ్చు, కాషాయ జాతీయవాదం కావచ్చు) అనివార్యంగా నిరంకుశపూరితమైనవే. అల్పసంఖ్యాకవర్గాల పట్ల విద్వేషాన్ని కుమ్మరించటం వీటికి వెన్నతో పెట్టిన విద్య. సాంస్కృతిక, ఆర్థిక జాతీయవాదుల అణచివేత ప్రయత్నాలకు వ్యతిరేకంగా ధిక్కార స్వరాలు మార్మోగాలి. భిన్న సంస్కృతుల సహజీవనానికి, సాంగత్యానికి పునాదులు వేయాలి. ఈ ఉద్యమంలో రచయితలతో పాటు ప్రజలకు కూడా కీలకమైన బాధ్యత ఉంది. విద్యాధికులైన ప్రజలపై ఈ బాధ్యత మరింతగా ఉంటుంది. వాక్స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలు మానవ హక్కులు. రాజకీయ హక్కులు. ఈ హక్కులు కాపాడుకోవటానికి పదిలపర్చుకోవటానికి రాజకీయ పోరాటమే శరణ్యం” అని తన నోబెల్‌ బహుమతి స్వీకరణ సందర్భంగా చేసిన ఉపన్యాసాన్ని ముగించాడు. నేడు జరుగుతున్నది కేవలం పత్రికా స్వేఛ్చను మాత్రమే కాలరాసే చర్యలుగా భావిస్తే వాటితో ముడిపడి ఉన్న సాధారణ ప్రజల రాజకీయ హక్కులు కూడా అణచివేతకు గురవనున్నాయి.

  • కొండూరి వీరయ్య
    సెల్‌: 9871794037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *