యుపిఎ ప్రభుత్వం చమురు దిగుమతి కోసం బకాయి 42వేల కోట్లు బిజెపి ప్రభుత్వం చెల్లించిందా ?

వరుసగా పెరుగుతున్న పెట్రోలు డీజిల్ ధరల పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు బిజెపి యదేచ్ఛగా తప్పుడు ప్రచారాన్ని ఆలంబన చేసుకొనే ప్రయత్నం చేసింది. మోడీ వైఫల్యాలు ప్రజలకు అర్ధం అవుతున్నాయన్న వాస్తవం కళ్ళ ముందున్న ప్రతిసారి ఆ వైఫల్యాలకు తాను, తన ప్రభుత్వం కారణం కాదనీ పూర్వపు ప్రభుత్వాలే కారణమనీ కాంగ్రెస్ నెత్తిన గుడ్డ కాల్చి వేయటం బిజెపి ప్రచార వ్యూహంలో కీలక భాగం. అదే వ్యూహాన్ని తాజాగా చమురు ధరలు విషయంలో కూడా ప్రయోగించబూనుకుంది. అందులో భాగంగా రెండు వాదనలు ముందుకు తెచ్చింది. ఈ రెండు వాదనల్లో సత్యాసత్యాలను పరిశీలిద్దాం.

మొదటి వాదన గత యూపీఏ ప్రభుత్వం చమురు కొనుగోళ్లకోసం 43 వేల కోట్లు అప్పు చేసిందని.. ఆ అప్పుని బిజెపి ప్రభుత్వం తీర్చాల్సి రావటంతో ధరలు పెంచాల్సి వస్తుందని భక్తుల ద్వారా ముందుకు వస్తున్న వ్యూహాత్మక వాదన. అంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న చమురు కొనకుండా యుపిఎ ప్రభుత్వం ఎక్కువ ధరకు కొనుగోలు చేయటం వలన ఈ భారం ఇపుడు ప్రజలు మోయాల్సి వస్తోందన్నది ఈ భక్త పుంగవుల వాదన సారాంశం.

ఈ వాదన ఇంతటితో ఆగటం లేదు. చెల్లించాల్సిన ఆ అప్పును తిరిగి చెల్లించినందుకు గర్వపడుతున్నట్టు కూడా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ తప్పుడు ప్రచారం వెనక ఉన్నవాస్తవాలు తెలుసుకోవాలంటే 2011కి వెళ్ళాలి. 2004లో యుపిఎ ప్రభుత్వం అధికారానికి వచ్చాక ఇరాన్ ఇండియా గాస్ పైప్ లైన్ నిర్మాణానికి ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సందర్బంలో పార్లమెంట్ లో జరిగిన చర్చల్లో బిజెపి నాయకుల ఉపన్యాసాలు వెలికి తీస్తే ఇపుడు చేస్తున్న వాదనలు లోగుట్టు అర్ధం చేసుకోవచ్చు. అదలా ఉంచుదాం.

ఈ సందర్బంగా ఆనాటి కొన్ని అంతర్జాతీయ పరిణామాలు గుర్తు చేయాలి. ఇరాక్ పై విజయం సాధించాక అమెరికా ఇరాన్ లోని చమురు వనరులపై కన్నేసింది. దాంతో ఇరాన్ అణ్వస్త్రాలు మానవ వినాశనకారి క్రిమిసంహారక ఆయుధాలు తయారు చేస్తోందన్న ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. దాంతో ఇరాన్ ను ఆర్ధికంగా దిగ్బంధనం చేయాలని సామ్రాజ్యవాద దేశాలు తీర్మానించుకున్నాయి. అంటే ఇరాన్ నుండి చమురు దిగుమతి చేసుకునే దేశాలు భవిష్యత్తులో దిగుమతి చేసుకోరాదన్నది ఆ ఆంక్షల సారాంశం. అంటే అప్పటివరకు భారతదేశానికి చౌకగా అందుతున్న ఇరాన్ చమురు దిగుమతి చేసుకోవాలంటే అమెరికాను ధిక్కరించే ధైర్యం మన పాలకులకు ఉండాలి. ఆ ధైర్యం లేని భారత ప్రభుత్వం ఇరాన్ నుండి రోజు నాలుగు లక్షల బారేళ్ళ చమురు దిగుమతి చేసుకునే మన దేశం దాన్ని లక్ష బారెళ్లకు తగ్గించుకుంది. ఇరాన్ కు చెల్లించాల్సిన రొక్కంలో 55 శాతం టర్కీ ద్వారా మన దేశం చెల్లిస్తూ ఉండేది. మిగిలిన 45 శాతం యూకో బాంక్ ద్వారా మన దేశం ఇరాన్ కు చెల్లిస్తూ ఉండేది. ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షలు 2013 నాటికి మరింత పెరిగాయి. ఫలితంగా ఇరాన్ కు మన దేశం చెల్లించాల్సిన డబ్బులు చెల్లించే మార్గాలను కూడా అమెరికా మూసేసింది. ఫలితంగా ఇరాన్ కు చెల్లించాల్సిన 43 వేల కోట్ల రూపాయలు భారతీయ కంపెనీల ఖాతాల్లో బకాయిగా మిగిలిపోయింది. అంతే తప్ప ఇదేదో యుపిఎ వైఫల్యమో.. బీజేపీ ఘనత వల్ల జరిగిందో కాదు. కానీ ఈ కథ ఇంతటితో ముగింపుకు రాలేదు.

ఇరాన్ కు చెల్లించాల్సిన 43వేల కోట్లు దేశీయ ఆర్ధిక వ్యవస్థలోనే ఖర్చు అయ్యాయి.

ఇరాన్ కి బకాయి ఉన్న కంపెనీలు మాంగళూరు పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (3326.38 కోట్లు), ఎస్సార్ ఆయిల్ ప్రయివేటు కంపెనీ (3326.38 కోట్లు) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(షుమారు 1663.18 కోట్లు) మేర ఉన్నాయి. ఇవి కాక హిందుస్తాన్ పెట్రోలియం కార్పెరేషన్ 64 కోట్లు, హెచ్పిసిఎల్ మిట్టల్ కంపెనీ మరో 200 కోట్లతో పాటు మరికొన్ని ప్రభుత్వ ప్రయివేటు కంపెనీలు ఇరాన్ నుండి చేసుకున్న దిగుమతులకు గాను అమెరికా ఆంక్షల కారణంగా చెల్లిపులు బకాయి పడ్డాయి. అమెరికా ఆంక్షలు 2015 జులై 14 వరకు కొనసాగాయి. తర్వాత ఇరాన్ తో వ్యాపారంపై కొన్ని షరతులను అమెరికా సడలించింది. దాంతో మనం చెల్లించాల్సిన అప్పు చెల్లించకుండానే ఆ ఐదేళ్ల పాటు రోజుకి లక్ష బారెళ్ల చమురు దిగుమతి చేసుకుంటూ వచ్చాము.

ప్రధాని మోదీ 2016లో ఇరాన్ పర్యటన సందర్బంగా ఇరాన్ అధ్యక్షుడు రహానేతో భేటీ అయ్యారు. ఓ ఒప్పందం మీద సంతకాలు కూడా అయ్యాయి. అప్పటికే విదేశీ మారకద్రవ్య సమస్యలు నివారించటానికి భారత రిజర్వు బాంక్ కూడా ఆ బకాయి చెల్లించడానికి మార్గాలు అన్వేషించడం మొదలు పెట్టింది. ఆ ప్రయత్నాల మేరకు ఇరాన్ పై ఆంక్షలు సడలించాక మనం ఇరాన్ కు చెల్లించాల్సిన అప్పుల విషయం లో కొన్ని నియమాలు మార్చారు. అప్పటివరకు రవాణా చార్జీలు సగమే చెల్లించే భారతదేశం 2016లో మోడీ ఇరాన్ అధ్యక్షుడుతో కుదుర్చుకున్న ఒప్పందం దరిమిలా పూర్తిగా చెల్లించాల్సి వస్తోంది. అంతకు ముందు 55 శాతం ధర దాలర్లలోనూ 45 శాతం ధర రూపాయల్లోనూ చెల్లించే మన దేశం 2016 తర్వాత మొత్తం దాలర్లలోనే చెల్లించాల్సి వస్తోంది. ఇరాన్ కి అమెరికాకు ఉన్న వైరం రీత్యా మనం యూరోల రూపంలో చెల్లించాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఆ మేరకు రిజర్వ్ బాంక్ ట్రెడింగ్ ప్లాటుఫార్మ్ అవతారం ఎత్తడానికి సిద్ధం అయ్యింది. దాంతో 2016 నుండి దశల వారీగా 43 వేల కోట్లు అప్పు చెల్లిస్తూ వచ్చాము. ఈ వాస్తవాలు పరిశీలించినపుడు యూపీఏ ప్రభుత్వం వదిలిన అప్పు బిజెపి తీరుస్తోందనటంలో ఏ మాత్రం వాస్తవం లేదు అన్నది అర్ధం అవుతుంది.

అదే సమయంలో సదరు భక్తజనాన్ని మనం అడగాల్సిన ప్రశ్న కూడా మరోటి ఉంది. ఇరాన్ నుండి 2013 తర్వాత దిగుమతి చేసుకున్న ముడి చమురు మనం రిఫైన్ చేసాము. భారతీయులు దాన్ని వినియోగించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించారు. ఇపుడున్న సమాచారం ప్రకారం 2013 -2014 మధ్య కాలంలో కూడా లీటర్ పెట్రోలు ధరలో కనీసం 35 శాతం పన్నులు ఉన్నాయి. మిగిలిన 65 శాతం ముడిచమురు దిగుమతి ఖర్చు, రిఫనరీ ఖర్చు దేశీయంగా రవాణా ఖర్చు. పన్నుల రూపంలో వసూలు చేసింది కేంద్రం ఖజానాకు వెళ్ళింది అనుకున్నా మిగిలిన 65 శాతం ఇరాన్ కు చెల్లించాల్సిన సొమ్ము ప్రజలనుండి వసూలు అయ్యింది కదా… మరి ఆ డబ్బేమి చేసినట్టు ? సోషల్ మీడియాలో బిజెపి భక్తజనం చేస్తున్న ప్రచారం ప్రకారం మనం 2013 – 2016 వరకు ఖర్చు పెట్టిన లీటర్ పెట్రోలుకు అప్పుడొకసారి తిరిగి ఇప్పుడు ఒకసారి చెల్లించాలా? అంటే అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్న కాలంలో మనం వాడిన ఒక్కొలీటర్ పెట్రోలుకు సగటున 178 రూపాయలు చెలించినట్టు అవుతుంది. ఇదెక్కడి న్యాయం ? ఇదేమి దేశభక్తి ? ఆలోచించాల్సిన బాధ్యత మనందరిదీ…

రెండో తప్పుడు ప్రచారం నేరుగా ప్రధాని గారే మొదలు పెట్టారు. గత వారం తమిళనాడులో పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేస్తూ గత ప్రభుత్వాలు తగినంత జాగ్రత్త తీసుకోకపోవటం వలన నేటికీ మన దేశపు చమురు ఉత్పత్తుల అవసరాలు తీర్చుకోడానికి 85 శాతం వరకు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని అన్నారు. అంటే దిగుమతి వలన ధరలు పెరుగుతున్నాయి.. మన బావుల్లో చమురు మనమే బయటకి తీసుకుంటే ఆ దిగుమతి ధరల భారం తగ్గేది అన్నది ఆయన ఉపన్యాసం సారాంశం. ఈ వాదన గురించి చర్చించుకునే ముందు కనీసం మనదేశంలోని చమురు నిల్వలు ఎన్ని? మన అవసరాలకు అవి సరిపోతాయా లేదా అన్న అవగాహన కూడా ప్రధానికి లోపించింది అన్నది ఇట్టే అర్ధం అయ్యే అంశం. మన బావిలో నీళ్లు లేనపుడు చేద వేసి తోడలేదు కాబట్టి గాబులో నీళ్లు లేవు అన్నట్లు ఉంది ప్రధాని విమర్శ. అంతే కాదు. విదేశీ చమురు నిల్వలు బయటకు తీయటానికి చమురు సహజవాయువు కార్పొరేషన్ ఓఏన్ జిసి విదేశ్ కంపెనీ ని ప్రారంభించారు. ఓఎన్ జిసి లో వచ్చే లాభాలు పొదుపు చేసి విదేశీ చమురు నిల్వలు సంపాదించటానికి పెట్టుబడిగా పెట్టాలన్నది ఈ కంపెనీ ప్రారంభం వెనక నున్న లక్ష్యం. కానీ బిజెపి అధికారానికి వచ్చాక దివాళా తీసిన గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ ను ఓ.ఎన్.జి.సిలో విలీనం చేయటానికి షుమారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చినందుకు ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సంపాదకుడు పరంజయ్ గుహ ఠాకూర్ దా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అంతే కాదు. 2014కి ముందు దేశీయంగా వెలికి తీసే చమురు మోతాదు మనం వాడుకునే దాంట్లో కనీసం 24 శాతంగా ఉండేది. 2019 నాటి లెక్కల ప్రకారం 16 శాతానికి పడిపోయింది. అంటే చమురు వెలికితీత సామర్ధ్యం పెంచుకుంటే దిగుమతులపై ఆధారపడాల్సిన దుర్గతి ఉండేది కాదు అని ఉపన్యాసం ఇచ్చిన ప్రధాని గారి హయాంలోనే మన దేశీయ చమురు వెలికితీత సామర్ధ్యం 8 శాతం పడిపోయింది. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఉంది కదా ప్రధాని వాదన !

అంతటితో అయిపోలేదు. ప్రధాని చెప్పకనే ఓ వాస్తవం మనముందుంచారు. అది 85 శాతం చమురు దిగుమతి అవుతోంది అన్నదే ఆ వాస్తవం. మరి 85 శాతం దిగుమతి అవుతున్న చమురు ధరలు రూపాయికి పావలా అయినపుడు దేశీయంగా వినియోగదారులకు అందే చమురు విలువ కనీసం రూపాయికి అర్ధరూపాయన్నా తగ్గాలి కదా… మరి ఈ సూత్రం ప్రధానికి ఆయన భక్త జనసందోహానికి ఎందుకు గుర్తు రావటం లేదు ?

కేవలం గతాన్ని నిందిస్తూ మరో పదేళ్లు గద్దె దిగకుండా ఉండేందుకు బిజెపి అనుసరిస్తున్న వ్యూహం సో కాల్డ్ అంధ భక్తుల వలన జనం వాక్కుగా మారుతోంది. ఫాసిస్టు పాలన దిశగా దేశం నడిచేటపుడు జరిగే పరిణామమే ఇది. ఈ వాదనను మిగిలిన దేశం అంగీకరించటం అంటే అర్థం పర్ధం లేని నమ్మకాలతో ప్రాణాలు తీసుకోవడమే దేశభక్తి అని ముద్ర వేసి మన చేతిలో కత్తి పెట్టి మన గొంతుక కోసుకొమ్మనే దిశగా దేశాన్ని నడిపించటమే తప్ప మరోటి కాదు. తస్మాత్ జాగ్రత్త !

కొండూరి వీరయ్య
సీనియర్ జర్నలిస్టు

One Reply to “యుపిఎ ప్రభుత్వం చమురు దిగుమతి కోసం బకాయి 42వేల కోట్లు బిజెపి ప్రభుత్వం చెల్లించిందా ?”

  1. ఈ దేశానికి పట్టిన దరిద్రం ఈ యురేషియా విదేశీ యూదూ ఆర్య భ్రష్టు బ్రాహ్మణత్వ ను అంతమొందించుదాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *