ప్రసిద్ధ కవి, విరసం నేత వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. భీమా-కోరెగావ్ కుట్ర కేసులో అరెస్టయి జైలు జీవితం గడుపుతున్న వరవరరావుకు న్యాయస్థానం ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని చంపిన విధంగా ప్రధాని నరేంద్ర మోదీని చంపేందుకు మావోయిస్టులతో కలిసి కుట్ర పన్నారంటూ వి.వితో పాటు సుధా భరద్వాజ్, గౌతం నవలఖ, వెర్నన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరారియాలను 2018లో అరెస్ట్ చేశారు.
అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన కుటుంబసభ్యుల సహ పలు ప్రజాసంఘాలు న్యాయస్థానాలను ఆశ్రయించగా.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరుతూ వచ్చింది. అయితే ఆయన అనారోగ్య పరిస్థితుల కారణంగా న్యాయస్థానం తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని, ముంబయి నగరం విడిచి వెళ్లరాదని వరవరరావును హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణకు సంబంధించి పోలీసులకు సహకరించాలని, సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నిస్తే బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు హెచ్చరించింది.
