తాజా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే వైకాపా పతనం ప్రారంభమైనట్లే… చంద్రబాబు

మంగళగిరి: ప్రజలను వేధించే ప్రభుత్వాన్ని ఇదివరకెప్పుడూ చూడలేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తాజా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే వైకాపా పతనం ప్రారంభమైనట్లు తెలుస్తోందని, దీనిని ఎవరూ కాపాడలేరని అన్నారు. వైకాపా నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అరాచకాలు సృష్టించారని విమర్శించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజాస్వామ్య పరిరక్షణకు తెదేపా వీరోచితంగా పోరాడిందన్నారు. విపరీతంగా ధరలు పెంచి పన్నుల భారం మోపారని అన్నారు.
‘‘ 4వ విడతలో 41.7 శాతం సర్పంచ్‌ స్థానాలు గెలుచుకున్నాం. మొత్తం నాలుగు విడతల్లో కలిపి 4,230 సర్పంచ్‌ స్థానాలను గెలిచాం. సక్రమంగా జరిగి ఉంటే మరో 10 శాతం స్థానాల్లో విజయం సాధ్యమయ్యేది.అధికార దుర్వినియోగం, ఫలితాల తారుమారుపై వైకాపా ఆధారపడింది. కేవలం రెండేళ్లకే మిడిసిపడుతున్నారు.. 22 ఏళ్లు తెదేపా అధికారంలో ఉందని గుర్తుంచుకోవాలి’’ అని చంద్రబాబు అన్నారు. అధికారాన్ని సక్రమంగా వినియోగించుకోవడంలో ఎస్‌ఈసీ విఫలమైందన్నారు. సక్రమంగా నిర్వహించామని ఎన్నికల సంఘం ఎలా చెప్పగలదని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *