విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న ప్రయాణీకులకు ప్రభుత్వ నూతన మార్గదర్శకాలు….

గల్ఫ్: విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న ప్రయాణీకులను ఉద్దేశించి ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాలు ఫిబ్రవరి 22 రాత్రి 11.59 నిమిషాల నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ క్రమంలో ఇండియాకు రావడానికి ప్రవాసులు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా యూఏఈలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి భారత్‌కు రావాలని ప్లాన్ చేసుకున్న ప్రవాసులు.. ప్రభుత్వం మార్గదర్శకాలను కఠినతరం చేయడం వల్ల పునరాలోచిస్తున్నారని ట్రావెల్ ఏజెంట్లు వెల్లడించారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల గురించి ప్రతిరోజు వందలాది మంది ప్రవాసులు అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు.

కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రయాణ వ్యయం అధికమవ్వడం, నమోదు ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటం, పిల్లలకు పరీక్షలు జరుగుతుండటం.. తదితర కారణాల వల్ల ఇండియాకు రావడానికి ప్రవాసులు ఆసక్తి చూపడం లేదని స్మార్ట్ ట్రావెల్ డైరెక్టర్ అఫీ అహ్మద్ పేర్కొన్నారు. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే.. ప్రయాణానికి సిద్ధపడుతున్నట్టు సిటీ వన్ టూరిజం డైరెక్టర్ చెప్పారు. కాగా.. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో పుట్టుకొచ్చిన కరోనా కొత్త స్ట్రెయిన్లు భారత్‌లోకి కూడా ప్రవేశించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న ప్రయాణీకులకు కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈ మార్గదర్శకాల ప్రకారం.. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులు వయసుతో సంబంధం లేకుండా ప్రయాణానికి 72 గంటల ముందుగా చేయించుకున్న కరోనా ఆర్టీ-సీపీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్‌ను ఎయిర్ సువిధా పోర్టల్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎయిర్‌పోర్ట్‌ లోపల నిర్వహించే థర్మల్ స్క్రీనింగ్‌లో కరోనా లక్షణాలు లేకపోతేనే విమానం ఎక్కేందుకు అనుమతి ఉంటుంది. అయితే యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్‌ నుంచి మొదలయ్యే విమానాల ద్వారా నేరుగా భారత్‌కు వచ్చే ప్రయాణీకులను మాత్రం ఈ మార్గదర్శకాల నుంచి మినహాయిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. కాకాపోతే వీరు ప్రయాణానికి ముందు 14 రోజుల ట్రావెల్ హిస్టరీని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా భారత్‌కు చేరకున్నాక వీరంతా తమ స్వంత ఖర్చులతో ఎయిర్‌పోర్టులో కరోనా టెస్ట్ చేయాంచుకోవాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *