ప్రైవేటీకరణ : ఏ వాదన వెనక ఎవరి ప్రయోజనం దాగి ఉంది?

ఫిబ్రవరిలో ఆర్థికమంత్రి ప్రతిపాదించిన బడ్జెట్ లో ప్రవేటీకరణ ఏదో ఉదాత్తమైన లక్ష్యంగా ఆర్థిక మంత్రి ప్రకటించిన నాటి నుండీ సోషల్ మీడియాలో వివిధ కోణాల్లో చర్చ జరుగుతోంది. ఆగ్రహం చెందిన ప్రజలు, పౌర మేధావులు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ అనేక రూపాల్లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కౌంటర్ అన్నట్లు ప్రభుత్వ ప్రకటన ప్రత్యేకించి మోడీగారి ప్రకటనలను ప్రస్తావించి వ్యాపారం చేయటం ప్రభుత్వం పని కాదన్న మాటలు ముక్కున పెట్టుకుని మాట్లాడుతున్న భక్త జన సందోహం కూడా గణనీయంగానే బయలుదేరారు. దేశాన్ని అమ్మేస్తున్నామని చెప్పటంలో కూడా నిజాయితీని చూడగల అంధ భక్తులు కూడా తక్కువేమీ కాదు. మరో తరహా మెస్సేజిలకు మోడీ గారి పట్ల అంత ఛీత్కారభావం ప్రదర్శించక్కర్లేదన్న ఓ మధ్యతరగతి మర్యాదస్తులు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఇటువంటి వాళ్లంతా మనం ఇచ్చే హేతుబద్ధమైన సమాధానంతో సంతృప్తి పడతారని, తమ తప్పుడు ఆలోచనలను సరిచేసుకుంటారని ఇప్పుడే ఆశించలేము. ఇటువంటి వాదనలు చేసే వాళ్ల గురించి వాళ్లు ఆశిస్తున్న ప్రయోజనాల గురించి చివర్లో ప్రస్తావించుకుందాం.

కానీ ఈ వాదోపవాదనల్లో మరో కోణం కూడా గణనీయంగా ముందుకొస్తోంది. ఈ ప్రైవేటీకరణ క్రమాన్ని ప్రారంభించింది కాంగ్రెసే కాబట్టి బిజిపిని వ్యతిరేకించే క్రమంలో కాంగ్రెస్ ను సమర్ధించరాదన్నది ఈ తరగతి చేస్తున్న వాదనల్లో అన్యాపదేశంగా వినిపిస్తున్న వాదనలో కాంగ్రెస్ హయాంలో జరిగిన ప్రైవేటీకరణ గురించి హడావుడి చేయని వాళ్లంతా మోడీ ప్రైవేటీకరణకు సిద్ధమవుతుంటే ఆందోళన చెందుతున్నారన్నది సారాంశం. తటస్థ వాదనగా కనిపించే ఈ వాదన ప్రధానంగా బిజెపి వాట్సప్ యూననిర్శిటీలో తయారైన వాదన. దీని తటస్థ స్వభావం రీత్యా సహజంగానే నిజమే కదా అనిపిస్తుంది. ఎటువంటి రాజకీయ నిశ్చితాభిప్రాయాలు లేని వారికి సైతం అవును కదా అనిపిస్తుంది. ఓ సారి బిజెపి తప్పు తీవ్రత ఎంత కాంగ్రెస్ తప్పు తీవ్రత ఎంత అని వాదించుకోవటం మొదలు పెట్టిన తర్వాత అసలు విషయం పక్కకు పోతుంది. ప్రైవేటీకరణ తప్పా ఒప్పా అన్న విషయం గురించి చర్చించటం దేశానికి ఉపయోగం అన్న దృష్టి నుండి మనం పక్కకు పోతాము. కాబట్టి కాంగ్రెస్ వాదులూ, కాంగ్రెస్ వ్యతిరేక వాదులూ, నిజంగా సమస్య తీవ్రతను గుర్తించిన వాళ్లూ ఇటువంటి ద్వంద్వాత్మక (బైనరీ) చర్చల సుడిగుండంలో పడకుండా ఉండటం శ్రేయస్కరం.

ఇటువంటి బైనరీ చర్చల్లో జనం మునిగి తేలుతున్నప్పుడు పాలక పక్షం తాను అనుకున్న లక్ష్యం దిశగా దేశాన్ని నడిపించుకుంటూ వెళ్తుంది. తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అన్న పరిస్థితి జనసామాన్యానికి ఎదురు కావటం దశాబ్దాలుగా మనం చూస్తూ ఉ న్నదే. ఢిల్లీ ముట్టడిలో ఉన్న రైతాంగంలో కొన్ని గొంతుకలన్నా కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతో మోడీని నెత్తికెత్తుకున్నాము. కానీ ఇప్పుడు చింతిస్తున్నాము అని బాహాటంగానే వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను మనం గమనించాలి. ప్రభుత్వ నిర్ణయాలు ప్రశ్నించకుండా ఉండటానికి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు ఏదో మోడీ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయన్న వాదించటం ప్రజలను మోసగించే మరోవరకమైన వ్యూహం. పాలకవర్గం తీసుకునే నిర్ణయాలు ప్రజలను, దేశాన్ని ఇక్కట్ల పాలు చేసేవిగా ఉన్నప్పుడు ఆ పాలకవర్గంలోని సో కాల్డ్ ప్రజాహిత మేధావులమనుకుంటున్న వారు, ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నామనుకుంటున్న వారు వాటిని ప్రశ్నించాలి. అలా ప్రశ్నించకుండా తమకు వ్యక్తిగత స్వంత్ర అభిప్రాయాలు ఉన్నాయని, బయటి నుండి వస్తున్న విమర్శలు తమ వ్యక్తిత్వాన్నేదో తూట్లు పొడిచేవిగా ఉన్నాయని భక్తజన సందోహం ఆందోళన చెందటం అర్థం లేనిపని.

ఇక నిజాయితీ. నిజాయితీ అన్నది నిరపేక్ష భావన కాదు. సాపేక్ష భావనే. నిజాయితీగా ఉండటం సార్వత్రిక సామాజిక లక్షణం కాదు. ప్రత్యేకించి వర్గ విభజిత సమాజంలో సామాజిక విలువలేవీ నిరపేక్ష సార్వత్రిక విలువలుగా ఉండబోవు. ఉండలేవు. మోడీ గారి నిజాయితీ ఆ మాటకొస్తే ఆ కోవకు చెందిన వారి నిజాయితీ వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గ ప్రయోజనాలు కాపాడుకోవటంలో ఉన్న నిజాయితేయే తప్ప ప్రజల పక్షాన ఉన్న నిజాయితీ కాదు. సార్వత్రిక విలువలుగా చలామణీ అవుతున్న నీతి, న్యాయం, నిజాయితీ, పారదర్శకత, తటస్థత, ప్రయోజనం, సత్యం, అసత్యం, శతృవు, మిత్రుడు, అన్న పదాలకున్న విలువలు నిజానికి నిర్దిష్ట సామాజిక పరిణామ క్రమంలో ఆవిర్భవించిన విలువలే తప్ప మనిషికున్న, ఉండాల్సిన సహజ లక్షణాలు, విలువలు కాదు. మోడీగారు తాను దేశీయ గుత్త పెట్టుబడిదారీ వర్గానికి, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వర్గానికీ ఏ హామీలు ఇచ్చి అధికారానికి వచ్చాడో ఆ హామీలు నెరవేర్చేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా చూసినప్పుడు ఈ సోకాల్డ్ మోడీ నిజాయితీగా ఉన్నాడు అన్న వాదన దేశాన్ని దోచేవారి వాదనే తప్ప ఈ దోపిడీ వల్ల నష్టపోతున్న వారి వాదన కానే కాదు. అందువల్ల ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై సోషల్ మీడియాల్లో వస్తున్న వాదనలను అప్పణంగా ఆహ్వానించటమో తిరస్కరించటమో చేసే క్రమంలో ఈ సందేశాలు వెనక వాటిని రూపొందించిన వారి ఆలోచనలు, ఆ ఆలోచనలకు ఓ వర్గ స్వభావం ఉందన్న విషయాన్ని మర్చి పోతే నష్టపోతాము.

కొండూరి వీరయ్య, సీనియర్ జర్నలిస్ట్

One Reply to “ప్రైవేటీకరణ : ఏ వాదన వెనక ఎవరి ప్రయోజనం దాగి ఉంది?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *