విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు.. వైఎస్ జగన్

7నుంచి 12వ తరగతి వరకు ఉచిత పంపిణీ

అమరావతి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న బాలికలకు శానిటరీ న్యాప్ కిన్స్ ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. న్యాప్ కిన్స్ పంపిణీ పై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. 7 నుంచి 12వ తరగతి విద్యార్థినుల వరకు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన న్యాప్ కిన్స్ ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని చెప్పారు. విద్యార్థినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందించాలని సిఎం ఆదేశించారు. దీనికోసం ల్యాప్ టాప్ ను ఉపయోగించుకోవాలని చెప్పారు. 9వ తరగతి ఆ పైన ల్యాప్ టాప్ కావాలనుకున్న విద్యార్థినులకు అమ్మఒడి పథకంలో ఇప్పటికే ఆప్షన్ ఇచ్చామని తెలిపారు. ఆప్షన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇస్తున్న కంప్యూటర్స్ తో పాటు కోచింగ్ ఇనిస్టిట్యూషన్స్ సహకారం తీసుకునే దిశగా ప్రణాళిక రచించాలని తెలిపారు ఇంటరాక్టివ్ విధానంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎంపిక చేసిన నిపుణుల సహకారం తీసుకోవాలని చెప్పారు. దీని ద్వారా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు సిఎంకు వివరిస్తూ… ఈ నెల ‘8న మహిళా దినోత్సవం సందర్భంగా న్యాప్ కిన్స్ పంపిణీ పథకం ప్రారంభిస్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినులకు న్యాప్ కిన్స్ పంపిణీ జులై 1 నుంచి ప్రారంభించనున్నారు. నెలకు 10 చొప్పున ఏడాదికి 120 న్యాప్ కిన్స్ ప్రభుత్వం అందించనుంది. దీనికోసం సుమారు రూ.41.4 కోట్లు ఖర్చు చేయనుంది. ఏప్రిల్ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. ఏప్రిల్ చివరి నాటికి ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో సెర్చ్, మెప్మా ఎంఒయు కుదుర్చుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చేయూత కిరాణా స్టోర్స్ ద్వారా తక్కువ ధరకే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.’ అని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శులు బి. రాజశేఖర్, వై.శ్రీలక్ష్మి, ఎఆర్ అనురాధ, అనిల్ కుమార్ సింఘాల్, గోపాలకృష్ణ ద్వివేది, కె.సునీత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *