సిపిఎం పై అక్కసు ఎవరిమేలు కోసం ?

తాజాగా ముగిసిన శాసనసభ ఎన్నిక ఫలితాలు దాదాపు ఖరారైన నేపధ్యంలో సోషల్ మీడియాలో చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చర్చ ముసుగులో సిపిఎం వ్యతిరేకత కూడ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చర్చలో వచ్చే అన్ని ప్రశ్నలకు సోషల్ మీడియాLఓ తక్షణమే సమాధానం రాదు. వీలు కాదు. కొన్ని ప్రశ్నలకు మారుతున్న కాలమే సమాధానం. ఇదేదో పలాయనవాదం అనుకునే మేధావులు ఉంటే మనం ఏమీ చేయలేము. ఏకకాలంలో అనేక ప్రశ్నలు వచ్చాయి. కొన్నింటి గురించయినా చర్చించెందుకే ఈ ప్రయత్నం.

అధికారం కోసం ఓడిపోతే పర్వాలేదు కానీ సైద్ధాంతికంగా ఓటమి పాలుగావటం గురించి ఓ మిత్రుడు ఆవేదన చెందుతున్నారు.

గత మూడు దశాబ్దాలుగా వామపక్ష చైతన్యం వెనకపట్టు పట్టినమాట వాస్తవం. దీనికి పలు జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు ప్రధాన కారణం. ప్రజలు చైతన్యవంతులు కాకపోవటం, కాలేక పోవడం వంటి పరిణామాలకు ఆయా కాలాల్లో పార్టీలకు నాయకత్వం వహించిన కొందరు వ్యక్తుల ను బాధ్యులుగా చేయడం ఎంత వరకు అర్ధవంతమో ఆలోచించాలి. ఇక దివాళాకోరుతనం గురించిన ఆవేదన కూడా ఆ మిత్రుని స్పందన లో ఉంది. మారుతున్న వర్గపొందికకు, ఆయా వర్గాల ప్రయోజనాల మధ్య జరిగే ఘర్షణ కు రాజకీయాలు ఓ వ్యక్తీకరణ మార్గం అన్న సూత్రాన్ని మర్చిపోతున్నట్లు ఉంది. బెంగాల్ లో ఫలితాలను ఆ వర్గ కోణం లో విశ్లేషించటం ఉపయోగకరం కాగలదు.

మావోయిస్టులు మమమత తో కలిసి బెంగాల్ లో వామపక్షాన్ని ఓడించారట అన్న ఎద్దేవా చేస్తున్న పోస్టులు కూడా వస్తున్నాయి. ఎన్నికల ప్రచారములో సింగూర్ హత్యాకాండ కు వ్యూహరచన చేసింది తామేనని మమతా గొప్పగా చెప్పుకుంది… ఫలానా వ్యక్తులు అని పేర్లు కూడా ప్రస్తావించింది. ఆ నేతలు ఇపుడు బిజెపి చొక్కా తొడుక్కున్న వైనం మనకు తెలియనది కాదు. ఈ వాస్తవం గురించి కావాలనే కళ్ళు మూసుకున్నట్టు అనిపిస్తోంది.

బెంగాల్ లో సిపిఎం ను వర్గ శత్రువుగా ప్రకటించిన పార్టీలు, నాయకులు, వ్యూహారచయితలు ఉన్నారు. శత్రువు కి శత్రువు మిత్రుడు అన్న సూత్రాన్ని కూడా వాడుకొని గ్రామాల్లో తృణమూల్ తో కలిసి టెర్రర్ సృష్టించటం లో మావోయిస్టుల పాత్రను ఎలా మర్చిపోగలం ?

వర్గ శత్రు నిర్మూలన విధానాన్ని అనుసరించి బెంగాల్ లో ప్రత్యేకించి 1999 తర్వాత సిపిఎం కేడర్ ని మట్టుబెట్టారు మావోయిస్టులు. మరి సిపిఎం ని గద్దె దించి మమతను గద్దెనెక్కించాక అధికారంలో ఉన్న వాళ్ళు వర్గ శత్రువులు అన్న మావోయిస్టుల సూత్రం ఏమైంది ? సిపిఎం నాయకత్వాన్ని మట్టుబెట్టిన తరహాలో టిఎంసీ నేతలను మట్టుబెట్టారా ? లేదు. అంటే అన్యోపదేశంగా టీఎంసీ వర్గ శత్రువు కాదు అని చెప్పిన మాట ఆచరణలో కనిపిస్తుంటే టీఎంసీ మావోయిస్టుల మధ్య లోపాయికారీ సయోధ్య లేదు అని ఇంకా నమ్మించటానికి ప్రయత్నం చేయటం ఎవరికి ప్రయోజనం ?

మరో పోస్ట్ లో సిపిఎం సిపిఐ బిజెపిలను ఓకే గాటన కట్టేస్తున్న వైనం కనిపిస్తోంది. అటువంటి రాజకీయ అవగాహన మీద వ్యాఖ్యానించటం అవసరమా ?

ఇక సిపిఎం సీపీఐ లను వామపక్షాలు కాదు అన్న తీర్మానం కూడా ఆ చర్చలో ఉంది. అలాంటి నిర్ధారణలు దేశంలో కొత్తేమీ కాదు. దానికోసం మావోయిస్టు సైద్దాంతిక సహచరులు విదేశాల్లో మేధో కసరత్తు కూడా జరుగుతోంది. అయితే నాది ఓ ప్రశ్న. ఎన్ని పరిమితులున్నా దేశ వ్యాప్తంగా వామపక్షాలకు ఓ గుర్తింపు గౌరవం తెచ్చింది సిపిఎం అనుసరించిన విధానాలే. మూడు రాష్ట్రాల్లో ప్రజల మన్ననలు పొందాయి. మరి సో కాల్డ్ మావోయిస్టులు రూపొందించిన వ్యూహము అనుసరించిన విధానము, దేశంలో వామపక్షాల పట్ల ఎటువంటి గుర్తింపు గౌరావాలని తెచ్చి పెట్టాయి ? సిపిఎం అనుసరించిన విధానం తప్పు అన్నప్పుడు మరి దేశవ్యాప్తంగా సరైన వ్యూహాన్ని, విధానాన్ని రూపొందించి చర్చకు పెట్టాలి కదా… కనీసం సిపిఎం నేతృత్వం లో రూపొందిన విధానాలు నాలుగు దశాబ్దాల అమలు తర్వాత, మూడు రాష్ట్రాల్లో అధికారానికి వచ్చిన తర్వాత నేడు దేశంలో తలెత్తిన ప్రమాదాలను అంచనా వేయటంలో విఫలమైందని అంటున్నారు. మరి దాదాపు అదే వయసున్న మావోయిస్టులు ఆ మాత్రం సాధించలేకపోయారు కదా…

కనుక ఇపుడు నిజంగా వామపక్ష అభిమానులు అనుకున్న వారు చర్చించాల్సింది దేశంలో ప్రజల శత్రువులు ఎవరు, వారికి వ్యతిరేకంగా ఎవరితో జట్టుకట్టాలి అన్న కోణంలో చర్చ జరిపితే ఉపయోగం. సిపిఎం ను తిట్టుకుంటూ కాలక్షేపం చేయటం వలన వారు లక్ష్యాన్ని చేరుకోలేరు. సాధించేది కూడా శూన్యం. అటువంటి కడుపు మంటే రాజకీయ విమర్శ గా చూపించే ప్రయత్నం మిత్రులు కావాల్సిన వారి మధ్య దూరాన్ని పెంచుతుందే తప్ప తగ్గించబోదు.
– కొండూరి వీరయ్య,
సీనియర్ జర్నలిస్టు

4 Replies to “సిపిఎం పై అక్కసు ఎవరిమేలు కోసం ?”

  1. విజయన్ స్ఫూర్తిదాయకంగా పార్టీని నడిపించిన తీరు ప్రశంసనీయంగా. అందుకు పరిస్థితులు కూడా సహకరించడమే కాకుండా యువతకు తగిన ప్రాధాన్యత లభించడం మరో కారణం. ప్రస్తుతం దేశంలో ఎక్కువ శాతం ఉన్న యువ ఓటర్లు ఈ యువ నాయకులతో తొందరగా కనెక్ట్ కాగలిగారు.
    అధికారమే అంతిమ లక్ష్యంగా పని చేయడం, ఆ తర్వాత ప్రజల్లో తమ సిద్ధాంత ఆచరణకు ప్రయత్నించడం అవసరం. ఇందులో ఇతర రాష్ట్ర నాయకులు ఫెయిలయ్యారు.

  2. శత్రువుతో అంటాకాగే మీరు, మీలో లోపాలు సరిచేసుకోండి. అంతే కాదు ప్రజలు మీరు ఆచారిస్తున్న తప్పుడు విధానాలు చూసి విశ్వసించడం లేదు. ఎందుకో మీరు అర్ధం చేసుకొనంత కాలం మీ గతి అంతే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *