కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి కారెక్కనున్న వీహెచ్..?

Breaking News: అసలే చావు బతుకుల మధ్య ఉన్న కాంగ్రెస్ కు టీపీసీసీ చీఫ్ ఎంపిక వ్యవహారం మెడమీద కత్తిలా తయారైంది. ఉత్తమ్ కుమార్ ఎప్పుడో ఆ పదవికి రాజీనామా చేసినప్పటికీ… కొరివితో తల గోక్కోవడం ఎందుకని కాంగ్రెస్ పెద్దలు ఆయన్నే ఆ బాధ్యతల్లో కొనసాగించారు. అయితే దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఫలితాల్లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు కావడంతో ఉత్తమ్ మరోసారి రాజీనామా చేశారు. దాంతో కొత్త చీఫ్ ఎంపిక కాంగ్రెస్‌కు తప్పడంలేదు.

ఇక ఉత్తమ్ రాజీనామా చేసి నెల రోజులు దాటినప్పటికీ.. కొత్త చీఫ్ ఎంపిక ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. టిపీసీసీ రేసులో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి ముందున్నారు. కానీ తాను భవిష్యత్తులో బీజేపీలో చేరతానంటూ వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిప్పు రాజేశాడు. దీంతో రేవంత్ వైపు మొగ్గు కనిపించే పరిస్థితి కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా రేవంత్‌కు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే… తాను పార్టీలో కొనసాగబోనని సీనియర్ నేత వీహెచ్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. చాలా మంది సీనియర్ నేతలు కూడా ఇలాగే చేస్తామన్నారు. రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినా ఓకేనంటూ వీహెచ్.. ఒకవేళ తను వద్దంటున్న వ్యక్తికే ఆ బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీ మారేందుకు సన్నద్ధం అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం లోయర్ ట్యాంక్‌బండ్‌లో  జరిగిన మున్నూరుకాపు మహాసభలో వీహెచ్ పాల్గొని… సీఎంను పొగడ్తలతో ముంచెత్తాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలను ప్రోత్సహిస్తున్నారంటూ ప్రశంసలు గుప్పించాడు. కుల సంఘం భవన నిర్మాణం కోసం ప్రతి కులానికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నారని, ఇది మంచి విషయమన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా కుల సంఘాలకు ఇంతటి ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు ఆయన.

పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి దక్కితే… తాను మాత్రం పార్టీలో ఉండన్న వీహెచ్… తాజాగా కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యం సంతరించకుంది. కచ్చితంగా ఆయన టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందనే చర్చ కూడా మొదలైంది. కేసీఆర్‌ను ప్రశంసించడానికి కారణం ఇదే కావచ్చని భావిస్తున్నారు. మీరు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారా అని మీడియా ప్రశ్నించగా… తాను ఇప్పుడే స్పందించనంటూ వీహెచ్ తెలివిగా బదులిచ్చి తప్పించుకున్నారు. తాను టీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే వార్తలను ఖండించబోనన్నారు. టిఆర్ఎస్ పార్టీలో విహెచ్ చేరితే డి.శ్రీనివాస్ స్థానంలో రాజ్యసభ సీటును ఆయనకు ఇస్తాం అన్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. చూడాలి ఏం జరగబోతోందో…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *