నిజామాబాద్ ఎంపీ అర‌వింద్‌కు ప‌సుపు రైతుల ఐక్య‌వేదిక హెచ్చ‌రిక

ప‌సుపు బోర్డు తెస్తాన‌న్న మాట త‌ప్పినందుకు వెంట‌నే ఎంపీ ప‌దవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
లేకుంటే గ్రామ గ్రామాన అర‌వింద్‌ను అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించింది.
ప‌సుపుబోర్డు, మ‌ద్ద‌తు ధ‌ర సాధించే వ‌ర‌కు త‌మ‌ పోరాటం కొన‌సాగిస్తామ‌ని పేర్కొంది.

నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం చౌట్‌ప‌ల్లిలో గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన పసుపు రైతుల‌ సమవేశం శ‌నివారం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ఎంపీ అర‌వింద్ హాజ‌ర‌య్యారు. ఎంపీ అరవింద్‌తో పసుపు రైతుల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దాదాపు 4 గంటలపాటు చర్చించినా ఫలితం లేకుండా చర్చలు ముగిశాయి. చర్చల నుంచి అరవింద్‌ అర్ధాంతరంగా వెళ్లిపోయారు.

స‌మావేశంలో అస‌లు విష‌యం ప‌సుపు బోర్డు ఏర్పాటుపై మాట్లాడ‌కుండా విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టేంచేలా ఎంపీ మాట్లాడారు. పసుపు పంటకు రూ. 15 వేల కనీస మద్దతు ధర కల్పిస్తామని తాను ఎక్కడా చెప్పలేదని చేతులెత్తేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల‌ను మోసం చేశారంటూ అర‌వింద్‌ను నిల‌దీశారు. త‌క్ష‌ణ‌మే ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఎంపీని రైతులు డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించిన పసుపు రైతులు ఎంపీ అరవింద్‌ 10 రోజుల్లో స్పష్టమైన వైఖరి ప్రకటించాల‌న్నారు. రాజీనామా చేస్తారో.. మద్దతు ధర కల్పిస్తారో చెప్పాలన్నారు. లేదంటే అడుగడుగునా అడ్డుకుంటామ‌ని ప‌సుపు రైతులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *