నర్సుల సేవలు అసమానమైనవి..తమిళిసై సౌందరరాజన్

నర్సులు ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో అసమానమైన సేవలు అందిస్తున్నారని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆరోగ్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలను గవర్నర్ కొనియాడారు.
రాజ్ భవన్ కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఈరోజు జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఆరోగ్య రంగంలో, రోగుల సేవలో నర్సులు అద్వితీయమైన, నిస్వార్థమైన సేవలు అందిస్తున్నారని, వారి సేవలకు గవర్నర్ సెల్యూట్ చేశారు.
తమ ఆరోగ్యాలను, జీవితాలను పణంగా పెట్టి ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్ లో నర్సులు అందిస్తున్న సేవలు చాలా గొప్పవని ఆమె అన్నారు. తాను మెడిసిన్ చదువుతున్నప్పుడు మెడికల్ కళాశాల, హాస్పిటల్స్ లోని స్టాఫ్ నర్సులతో అనేక విషయాలు నేర్చుకున్నానని ఆమె అన్నారు.
వారి నైపుణ్యాలు, అంకితభావం తనను ఎంతో ప్రభావితం చేశాయని డాక్టర్ తమిళిసై వివరించారు.

యువత ఆరోగ్య రంగంలో నిస్వార్థమైన సేవలు అందించాలంటే నర్సింగ్ ప్రొఫెషన్ ఎంచుకోవాలని గవర్నర్ సూచించారు.
ఈ సందర్భంగా ఆధునిక నర్సింగ్ వృత్తికి ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ కు గవర్నర్ నివాళులు అర్పించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ఆమె సేవలు స్ఫూర్తిదాయకమైనవని గవర్నర్ కొనియాడారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన మరో కార్యక్రమంలో పాల్గొని గవర్నర్ తమిళనాడులోని నర్సులకు వారి అత్యుత్తమ సేవలకుగాను అవార్డులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *