AP Politics – Narayana Arrest: పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ వాతావరణం వెడెక్కింది. ఇటీవల పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నారాయణ విద్యాసంస్థల ద్వారానే లీకేజీ జరిగిందనే అనుమానంతో కొందరిని అరెస్ట్ చేసి విచారించిన నేపథ్యంలో… హైదరాబాద్ కేపీహెచ్భీలోని నారాయణ నివాసానికి వెళ్లి ఆయన భార్యను కూడా చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం- అచ్చెన్నాయుడు
సీఎం వైఎస్ జగన్ తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారని, మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారు. రోజురోజుకూ జగన్ రెడ్డి పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని, ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి చెబుతుంటే.. నారాయణను ఏవిధంగా అరెస్ట్ చేస్తారు? అన్నారు.
నారాయణ అరెస్ట్ చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడమే: నారా లోకేష్
చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడమేనని, చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులని చెయ్యడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్ అని టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలపై మంత్రి బొత్స, సిఎం జగన్ రెడ్డి గారి విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూశారని, ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి, టిడిపి నేత నారాయణపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని, సంబంధం లేని కేసులో నారాయణ దంపతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
ఇక మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ మొత్తం నారాయణ కాలేజీలో ఈ ప్రశ్న పత్రాలు మాల్ ప్రాక్టీస్ జరిగిందని, ఇప్పటికే ప్రశ్న పత్రాలు మాల్ ప్రాక్టీస్ కేసులో 60 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. అందులో పూర్తి విచారణ జరిపాక నారాయణను అరెస్ట్ చేశారని, ఇందులో ఎలాంటి కక్ష్య సాధింపు లేదన్నారు.
విచారణలో తేలిన వాస్తవాల ఆధారంగానే అరెస్ట్ చేశారు. చంద్రబాబుకి మతిమరుపు వచ్చి రోజుకో మాట మాట్లాడుతున్నారు. పొత్తులపై మాట్లాడింది ఆయనే, మాట మార్చింది ఆయనే. చంద్రబాబుకి జనం గెలిపించరని తెలుసని, అందుకే పొత్తుల కోసం రోజు మాట్లాడుతున్నారని, మేం మాత్రం ఒంటరిగా పోటీ చేసి మళ్ళీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.