జాతీయం Air india: ఎయిర్‌ ఇండియా అమ్మకంలో లక్ష కోట్ల కుంభకోణం?

Air india: ఎయిర్‌ ఇండియా అమ్మకంలో లక్ష కోట్ల కుంభకోణం?

  • మొదటి భాగం

Air India – Tata Group: ఎయిర్‌ ఇండియా అమ్మకం ద్వారా కేంద్ర బిజెపి ప్రభుత్వం లక్షకోట్ల కుంభ కోణానికి పాల్పడిరదని ‘డీల్‌’ నడిచిన తీరు గమనించిన పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దేశమంతా కోవిడ్‌ సాలెగూడులో చిక్కుకుని విలవిలలాడుతుంటే మోడీ ప్రభుత్వం మాత్రం లక్షల కోట్ల కుంభకోణాలకు వ్యూహరచన చేస్తూ గడిపింది. ఎయిర్‌ ఇండియా అమ్మకానికి దారి తీసిన పరిస్థితులు, అమ్మకం కోసం ప్రభుత్వం దఫదఫాలుగా తీసుకున్న నిర్ణయాలు, మార్చిన అమ్మకం విధి విధానాలు గమనిస్తే లక్ష కోట్ల కుంభకోణం రూపుదిద్దుకున్న తీరుతెన్నులు కూడా అర్థమవుతాయి.

దేశంలో ప్రైవేటీకరణ విధానాలు జోరందుకున్న తొలి ఎన్డీయే ప్రభుత్వం (1999`2004) నుండీ ఎయిర్‌ ఇండియాను అమ్మటానికి పలు ప్రయత్నాలు జరిగాయి. క్లుప్తంగా ఈ ప్రయత్నాలు గురించి తెలుసుకున్న తర్వాత తాజా ‘డీల్‌’ గురించి చర్చించుకుందాం. కేంద్ర ప్రభుత్వం 8 అక్టోబరు 2021న ఎయిర్‌ ఇండియాను తెగనమ్మటానికి కావల్సిన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థను దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు గుత్తపెట్టుబడిదారీ సంస్థ టాటా సన్స్‌ గ్రూపు వశమంది.

మూడు నెలలు కూడా తిరక్కుండానే ఎయిర్‌ ఇండియా, మరియు దాని అనుబంధ సంస్థల యాజమాన్యం టాటా సన్స్‌ ప్రారంభించిన టేలేస్‌ కంపెనీకి బదిలీ చేస్తూ జనవరి 27, 2022న బదిలీ ఒప్పందాలు చేతులుమారాయి.కాంగ్రెస్‌ను మించిన స్థాయిలో గుత్తపెట్టుబడిదారులకు నమ్మిన బంటుగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో వాజపేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2001లో ప్రభుత్వరంగ సంస్థ భారీ అమ్మకాలకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఇందులో భాగంగా ఎయిర్‌ ఇండియా లో 40 శాతం వాటాలు అమ్మకానికి పెట్టింది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, మరియు టాటా గ్రూపు కొనుగోలుకు ముందుకొచ్చినా అప్పట్లో కార్మిక సంఘాలు దేశవ్యాప్త ఉద్యమం ప్రభావంతో ఈ రెండు  వెనక్కు తగ్గారు. దాంతో ఎయిర్‌ ఇండియా అమ్మకం ఆగిపోయింది.తర్వాత అధికారానికి వచ్చిన యుపిఎ ప్రభుత్వానికి ప్రైవేటీకరణ జోలికి పోకూడదన్న కనీస ఉమ్మడి కార్యక్రమం అవగాహనతోనే వామపక్షాలు మద్దతు ఇచ్చాయి. దాంతో తొలి యుపిఎ హయాంలో ఎయిర్‌ ఇండియా అమ్మకం ప్రస్తావన తెర మీదికి రాలేదు. కానీ వామపక్షాల మద్దతుతో పని లేకుండా రెండో సారి అధికారానికి వచ్చిన యుపిఎ తిరిగి ఎయిర్‌ ఇండియా అమ్మకం ఆలోచనలు పున: ప్రారంభించింది.

ఈ మధ్యనే అప్పటి వరకూ వేర్వేరుగా నడుస్తున్న ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ కంపెనీలను విలీనం చేసి ఒకే కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీగా 2007లో మార్చారు. అప్పట్లో పార్లమెంటరీ పౌరవిమానయాన శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ విలీనం దీర్ఘకాలంలో సంస్థకు నష్టదాయకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ పార్లమెంట్‌కు నివేదిక కూడా సమర్పించింది. అయినా ప్రభుత్వాలు వినిపించుకోలేదు. అప్పట్లోనే ఎయిర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, మరియు కార్మిక సంఘాలు సంస్థను నష్టాల బారినుండి బయటకు తీసుకురావటానికి అనేక ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు చర్చకు పెట్టారు.

ఈ సంస్థను అమ్మేయటానికే మొగ్గు చూపుతున్న ప్రభుత్వాలు ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను చెవికెక్కించుకోలేదు.2007 నుండీ 2012 వరకూ వచ్చిన నష్టాలనుండి సంస్థను కాపాడే పేరుతో 2012లో యుపిఎ 2 ప్రభుత్వం ఎయిర్‌ ఇండియా ఆర్థిక పున:నిర్మాణ పథకాన్ని ముందుకు తెచ్చింది. ఇందులో భాగంగా ఎయిర్‌ ఇండియాకు ఉన్న అప్పుల్లో 60 శాతం అప్పులను కేంద్ర ప్రభుత్వం లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీగా మారుస్తూ ముందస్తు పెట్టుబడులు పెట్టాలని, మిగిలిన 40 శాతం అప్పు చెల్లించటానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం రిడీమబుల్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీర్మానించింది.

ఈవిధంగా జారీ చేసిన డిబెంచర్లును 19 ఏళ్ల తర్వాత నగదు కింద మార్చుకోవచ్చన్న ఒప్పందంతో ఎయిర్‌ ఇండియా పునర్నిర్మాణ పథకం సిద్ధమైంది.ఈలోగా 2014 ఎన్నికల ఫలితాలతో తిరిగి ప్రైవేటీకరణ రాగం ఉధృతమైంది. ఈ నేపథ్యంలో 2015 నుండి 2018 వరకూ బడ్జెట్‌ ప్రసంగాల్లో ఎయిర్‌ ఇండియాను అమ్ముతామన్న ప్రకటనలకు పరిమితమైన మోడీ ప్రభుత్వం 76 శాతం వాటా అమ్మకానికి వీలుగా 2018లో కొనుగోలుదారుల నుండి ప్రతిపాదనలు ఆహ్వానించింది.(ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌).

అప్పట్లో కేంద్ర మంత్రివర్గ ఆర్థిక ఉపసంఘం నిర్ణయం ప్రకారం ఎయిర్‌ ఇండియా దాని అనుబంధ సంస్థల్లో 76 శాతం వాటా కొనుగోలు చేసే ప్రైవేటు కంపెనీ ఆయా సంస్థలకున్న రు.33392 కోట్ల రూపాయల అప్పులో కూడా 70 శాతం వాటా తీసుకోవల్సి ఉంటుంది. అయితే డీల్‌ దేశీయ గుత్తపెట్టుబడి కంపెనీలకు రుచించకపోవటంతో ఏ కంపెనీ ఎయిర్‌ ఇండియా వాటా కొనుగోళ్లకు ముందుకు రాలేదు. ప్రధానంగా అప్పుల భారం మోయటానికి ప్రైవేటు కంపెనీలు సిద్ధం కాకపోవటమే ఎయిర్‌ ఇండియాను అమ్మటానికి 2018 నాటి కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రయత్నం ఆచరణరూపం దాల్చలేదు. 

దీంతో ప్రభుత్వంలోని కౌటిల్యులు రెండేళ్ల పాటు మేధో మధనంసాగించి దేశీయ గుత్తపెట్టుబడిదారుల నోరూరించే ప్రతిపాదనలతో మళ్లీ ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ యజ్ఞానికి ఆజ్యం పోయటం ప్రారంభించారు. ఇందులో భాగంగా 2020 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ సారి వందశాతం వాటా అమ్మకాలకు సిద్ధమంటూ ప్రకటించింది. ప్రభుత్వమే బేరానికి దిగుతుందన్న వాస్తవాన్ని గుర్తించిన  కార్పొరేట్‌ తోడేళ్లు మరింత బింకం ప్రదర్శించాయి. ప్రభుత్వం మరో మెట్టు దిగి ఎయిర్‌ ఇండియాను సొంతం చేసుకునే ప్రైవేటు కంపెనీకి బదిలీచేసే రుణ భారాన్ని కూడా తగ్గిస్తూ మరో దఫా తన నిర్ణయాన్ని సవరించింది.

2018 నాటి ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ ప్రతిపాదనల ప్రకారం 70 శాతం రుణభారాన్ని మోయాల్సి వచ్చిన కొనుగోలుదారులు 2020 జనవరి నాటి ప్రతిపాదనల ప్రకారం కేవలం రు.23286.5 కోట్ల రుణభారాన్ని మోయటానికి సిద్ధపడితే సరిపోతుంది. కార్పొరేట్ల ముందు సాష్టాంగపడే కేంద్ర ప్రభుత్వం అంతగటితో ఆగకుండా మరో మేధోమధనం సాగించి ఈ వ్యూహాత్మక అమ్మకాల్లో భాగంగా కొనుగోలుదారుడు మోయాల్సిన  రుణభారాన్ని మరింత సడలించేందుకు కావల్సిన అధికారాన్ని 2021 బడ్జెట్‌ ద్వారా కేంద్రం సంపాదించింది.

ఆర్థిక మంత్రి 2020`21 బడ్జెట్‌ ఉపన్యాసం ప్రకారం ఎయిర్‌ ఇండియా కొనుగోలు చేయటానికి సిద్ధమయ్యే కంపెనీలు ముందుకొచ్చిన పక్షంలో వారి ప్రయోజనాలకు భంగం కలగని రీతిలో మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తామని ప్రకటించింది. అంతేకాదు. కొనుగోలుదారుడు ఎంత రుణభారాన్ని మోయటానికి సిద్ధపడతాడో తానే నిర్ణయించుకోవచ్చని, అది కూడా ఎంత సమయంలో చెల్లించాలో కూడా తానే నిర్ణయించుకోవచ్చని ప్రకటించింది. ఈ ప్రకటనల తర్వాత డిశంబరు 2020లోగా కొనుగోలుదార్లు తమ ఆసక్తిని కనబరుస్తూ ప్రతిపాదనలు సమర్పించవచ్చని నిర్ణయించింది.

అయితే కోవిడ్‌ కారణంగా ఈ తుదిగడువును ఐదుసార్లు పొడిగించింది. ఎట్టకేలకు సెప్టెంబరు 15, 2021 తుదిగడువుగా నిర్ణయించింది. మొత్తంగా ఏడు కంపెనీలు తమ ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించాయి. ఇందులో ఐదు ప్రతిపాదనలను సాంకేతిక లోపాలు, కేంద్రం విధించిన షరతులకనుగుణంగా  లేకపోవటం వంటి కారణాలతో తిరస్కరించారు. అంతిమంగా ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు టాటా మరియు స్పైస్‌జెట్‌ కంపెనీలు బరిలో నిలిచాయి. ఈ మొత్తం రెండు దశాబ్దాల చరిత్ర గమనిస్తే ఒక ప్రభుత్వంరంగ సంస్థను ఎలాగైనా అమ్మాలన్న నిర్ణయానికి వస్తే కేంద్రంలో ఎన్ని పార్టీలు మారినా ఆ నిర్ణయం అమలు జరిగే వరకూ, జరిపే వరకూ పాలకవర్గాలు ఎలా తమ ప్రయత్నాలు నిరంతరాయంగా ముందుకు తీసుకెళ్తాయో, వారి పట్టుదలకు రాజకీయ మద్దతు ఎలా సమకూరుతుందో తెలుసుకునేందుకు ఎయిర్‌ ఇండియా అమ్మకం ఓ పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది.

ఇదే సమయంలో ప్రత్యామ్నాయం కోసం, ఇటువంటి ప్రజాధనం లూటీ చేసే ప్రయత్నాలను నిలువరించేందుకు, లేదా ఆయా సంస్థల్లో జరిగే అవినీతి, లోపాలు, ఉల్లంఘనలను ఎదిరించి పోరాడేందుకు బరిలోకి దిగే శక్తులకు అటువంటి ఓపిక, నిలకడతనం, సామాజిక మద్దతు కొరవడటంతో ఎక్కువసార్లు అంత దీర్ఘకాలం పోరాటం సాగించలేకపోతాయి. 2001లో ఎయిర్‌ ఇండియా అమ్మకాన్ని వ్యతిరేకించిన స్థాయిలో మోడీ హయాంలో జరుగుతున్న తెగనమ్మకాలను కార్మికసంఘాలు ప్రతిఘటించలేకపోవటం ఇందుకు మరో ఉదాహరణగా ఉంటుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో లక్షకోట్ల ప్రజాధనం ఎలా చేతులు మారిందో, కుంభకోణం అని చెప్పటానికి కూడా వీలుకానంతగా మోసం రూపాంతరం చెందిందో రెండో భాగంలో తెలుసుకుందాం. 

వ్యాసకర్త: కొండూరి వీరయ్య, సీనియర్ జర్నలిస్ట్

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...