Russia-Ukraine War: గురువారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చల తర్వాత విలేకరులతో మాట్లాడులూ రష్యా ప్రతినిధి బృందం నాయకుడు, ఉపప్రధాని అలెగ్జాండర్ ఫామిన్ ‘‘ పరస్పర విశ్వాస కల్పన మరియు చర్చలను మరో అడుగు ముందుకు వేయించే అవకాశం కల్పించటానికి వీలుగా ఉక్రెయిన్ నగరాలైన కీవ్, చెర్నిహివ్‌లలో రష్యా సైనిక చర్యల వేగాన్ని పరిమితం చేయాలని నిర్ణయించాము’’ అని ప్రకటించారు.
దీనికి స్పందనగా ఉక్రెయిన్ బృందం ‘‘నాటోలో చేరబోము. అదే విధంగా విదేశీ సైనిక స్థావరాలను ఉక్రెయిన్ భూభాగంలో అనుమతించబోము. అయితే నాటో రాజ్యాంగంలోని ఐదో అధికరణం ప్రకారం ఉమ్మడి రక్షణ అవసరాలు కొనసాగిస్తాము’’ అని ప్రకటించారు. తదుపరి సమావేశాల్లో 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా గురించి ఉక్రెయిన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ, ఈ మధ్యనే స్వతంత్ర దేశంగా చీలిపోయిన డాన్బాస్ ప్రాంతాల గురించి చర్చించనున్నట్లు తెలిపారు.
ఉక్రెయిన్ ప్రతినిధి బృందం ముందుకు తెచ్చిన ప్రతిపాదనల్లో ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం తీసుకోవడంపై రష్యా అభ్యంతరం వ్యక్తం చేయకూడదు అన్న ప్రతిపాదన కూడా ఉంది. ఈ ప్రతిపాదనలను అధ్యయనం చేసిన తర్వాత రష్యా అభిప్రాయం తెలియచేస్తామని ప్రతినిధి బృందం నాయకుడు వ్లదిమీర్ మెదిన్క్సీ తెలిపారు.
కీవ్‌కు ఉత్తర ప్రాంతంలో సైనిక చర్యలను మందగింపచేయటానికి రష్యా అంగీకరించటం నెల రోజులుగా సాగుతున్న యుద్ధంలో కీలకమైన మలుపు కానుంది. ఉక్రెయిన్ ప్రయోజనాల రీత్యా చూసినప్పుడు ఈ ప్రతిపాదన ఉక్రెయిన్‌కు కీలకమైన ఉపశమనం గానుంది. ఇప్పటికే స్వతంత్ర రిపబ్లిక్కులుగా ప్రకటించబడిన క్రిమియా, డాన్‌బాస్‌లలో శాంతి స్థాపన కోసం రష్యా దళాలు కొంతకాలం కొనసాగటాన్ని స్థూలంగా ఇరు పక్షాలు అంగీకరించాయి.
ఉక్రెయిన్ ప్రతినిధి బృందం ప్రతిపాదనలో విబేధిస్తున్న దేశాధ్యక్షుని చర్యలు
ఇస్తాన్‌బుల్‌లో జరిగిన చర్చల పర్యవసానంగా కీవ్ ఇతర ప్రాంతాల్లో రష్యా సైనిక చర్యల ఉధృతి మందగించటాన్ని గుర్తించటానికి, చర్చల్లో కుదిరిన అవగాహన మేరకు మిగిలిన అంశాలపై స్పందించటానికి బదులుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్క్సీ ఉక్రెయిన్ దళాల దాడికి రష్యా దళాలు వెనకడుగు వేశాయని ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల ఉక్రెయిన్ శాంతి చర్చల బృందం కూడా విస్మయం ప్రకటించింది.
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఉక్రెయిన్‌కు 152 యుద్ధ విమానాలు ఉంటే ఈ దాడుల్లో దాదాపు వందకు పైగా యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయి. 149 యుద్ధ హెలికాఫ్టర్లకు గాను 77, 180 క్షిపణి రక్షణ వ్యవస్థలకు గాను 152 ధ్వంసమయ్యాయని రష్యా రక్షణ శాఖ వెల్లడిరచింది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ వెయ్యికి పైగా రష్యా సైనిక సిబ్బంది చనిపోయారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలైన డాన్‌బాస్‌లో అమెరికా ప్రేరేపిత నయా నాజీ సంస్థల కార్యకలాపాలను పూర్తిగా తుడిచి పెట్టేందుకు రష్యా దళాలు చర్యలు చేపట్టాయి.
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్ష భవనం నేతృత్వంలో ఫేక్ వార్త కథనాల పరంపర సాగుతోంది. అందులో భాగంగానే ఉక్రెయిన్ శక్తి సామర్ధ్యాలపై రష్యా అధ్యక్షుడిని నిఘా వర్గాలు తప్పుదారి పట్టించాయని, ఉక్రెయిన్ దళాలు తీవ్రంగా ప్రతిఘటించి పోరాడుతున్నాయన్న వార్తలు పాశ్చాత్య మీడియాలో పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. వాట్సప్, ఫెస్బుక్, గూగుల్ వంటి మీడియా యాగ్రిగేటర్స్ ద్వారా ఈ వార్తలు రష్యాలో ప్రసారం చేయటానికి జరుగుతున్న ప్రయత్నాలను రష్యా అడ్డుకొంది. ఆయా మీడియా సంస్థలపై నిషేధాజ్ఞలు విధించింది. మరోవైపున రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రక్షణ మంత్రి షోయవ్కు మధ్య విబేధాలు తలెత్తినట్లు రక్షణ శాఖ శ్రేణులు పుతిన్ నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసింది.
అల్జీర్స్లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ప్రతినిధి ఉక్రెయిన్‌లో రష్యా దళాలు చావుదెబ్బ తింటున్నాయని, ఈ వాస్తవాన్ని పుతిన్ గ్రహించలేకపోతున్నారని ప్రకటించారు. ఈ పరిణామలు గమనిస్తుంటే ఉక్రెయిన్ రష్యాల శాంతి చర్చల వాతావరణాన్ని నీరుగార్చేందుకు, శాంతి చర్చల్లో ప్రతిష్టంభన సృష్టించేందుకు అమెరికా ప్రధాన స్రవంతి మీడియా, సోషల్ మీడియా ద్వారా శతవిధాలా ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోంది.
- తెలుగడ్డా ప్రత్యేకం
Also Read…
Russia-America: రష్యాలో అధికార బదిలీకి అమెరికా ప్రయత్నించిందా ?