తీస్తా సెతల్వాడ్‌, హిమాంషుకుమార్‌: రాజ్యాంగపరిహార హక్కుకు వెన్నుపోటు

0
96
  • జస్టిస్‌ ఎ.ఎం ఖాన్విల్కర్‌ తీర్పుల విశ్లేషణ – నాలుగో భాగం

Justice AM Khanwilkar: జకియా జాఫ్రి కేసు తీర్పులో ఏది ఏమైనా ప్రభుత్వాన్ని సమర్ధించాలన్న ఖాన్విల్కర్‌ నిశ్చితాభిప్రాయం మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
2002 గుజరాత్‌ నరమేధం జరుగుతున్న సందర్భంలో ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం చేసిన నిర్ధారణలు సరైనవేనని సుప్రీం కోర్టు ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు న్యాయసమ్మతమైనదా కాదా అన్న విషయాన్ని నేను చర్చించబోవటం లేదు. రాజకీయ కుట్ర జరిగిందని నిరూపించటానికి కావల్సిన సాక్ష్యాధారాలను అర్జీదారులు న్యాయస్థానం ముందుంచలేకపోయారు అనుకుందాం. అంతవరకే న్యాయస్థానం పరిశీలిస్తే రిట్‌ పిటిషన్‌ను కొట్టేయాలి.

కానీ ఖాన్విల్కర్‌ ఆ ఒక్క పనికి మాత్రమే (రిట్‌ కొట్టేయటానికి మాత్రమే) పరిమితం కాలేదు. తీర్పు తొలి పేజీల్లో కార్యనిర్వాహకవర్గం సాగించిన కృషి గురించి పెద్దఎత్తున ప్రశంసల జల్లు కురిపించారు. రాజ్యాంగ ధర్మాసనం నుండి అటువంటి వ్యాఖ్యలు రావటం సుప్రీం కోర్టు గౌరవానికి, ప్రతిష్టకు ఏమంత శ్రేయస్కరం కాదు. అందులోనూ ప్రపంచం ముందు దేశానికి తలవంపులు తెచ్చిపెట్టిన నరమేధం విషయంలో కార్యనిర్వాహకవర్గం గురించి ఆ విధంగా పొగడటం అందరూ ముక్కున వేలేసుకునే సందర్భం. అంతకంటే దారుణంగా ధర్మాసనం ముందున్న కేసు కేవలం అసంతృప్తికి లోనైన కొందరు ఉన్నతాధికారుల చర్యల ఫలితమేనని తీర్మానించారు. ఈ ధర్మాసనం వరకూ కేసు నడుపుకుంటూ వచ్చిన వారు ప్రభుత్వాన్ని సవాలు చేయటానికి సాహసించారని కూడా ఆరోపించారు. ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో ఉన్నవారి నిబద్ధతలను ప్రశ్నించటానికి అర్జీదారులకు ఎంత ధైర్యం అని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వాములైన వారిని (ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారిని, అసంతృప్తజీవులైన ఉన్నతాధికారులు, కార్యనిర్వాహకవర్గంపై ఆరోపణలు చేస్తున్నవారిని) బోనులో నిలబెట్టాలని ఆదేశించారు.

ఈ వాక్యాల గురించి మనం కొన్ని అంశాలు చెప్పుకోవాలి. క్రియాశీలకమైన న్యాయ వ్యవస్థ ఉన్న దేశాల్లో ఇటువంటి వాక్యాలు పరువునష్టం దావాలకు పురికొల్పుతాయి. దాంతో అర్జీదారులు భారీ మొత్తంలో జరిమానాలను భరించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అవేవీ వర్తించలేదు. ఖాన్విల్కర్‌ తీర్పునే ఉదాహరణగా తీసుకుంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తమ విధినిర్వహణలో భాగంగా (విధి నిర్వహణ పేరుతో) ఎటువంటివారికైనా వ్యక్తిత్వ నిర్ధారణ పత్రాలు (కారెక్టర్‌ సర్టిఫికెట్లు) ఇవ్వవచ్చు. వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వ్యాఖ్యానించవచ్చు. దాడులకు దిగొచ్చు. ఈ పనులు చేయటానికి కావల్సిన సాక్ష్యాధారాలున్నాయా లేదా అని వెనక్కు తిరిగి చూసుకోవాల్సి అవసరం లేదు. సాక్ష్యాధారాల మాట పక్కన పెడదాం. ఈ దారుణ వ్యాఖ్యలు చేయటానికి ముందు అసలు అర్జీ దారులు ఆయా అంశాలపై న్యాయస్థానానికి తమ వాదన వినిపించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఇతర సందర్భాల్లో సహజ న్యాయ సూత్రాలు వల్లెవేయటానికి ధర్మపన్నాలు వినిపించటానికి సుప్రీం కోర్టు వెనకాడదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ వ్యాఖ్యల సంగతి అటుంచితే వాటి ఆధారంగా జరిగిన పరిణామాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసిన మరునాడే గుజరాత్‌ పోలీసులు ఈ కేసులో రెండో అర్జీదారు అయిన తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టు చేశారు. సుప్రీం కోర్టు తీర్పులో పైన చెప్పిన వాక్యాలే ఆమె అరెస్టుకు పునాదిగా గుజరాత్‌ పోలీసులు వాడుకున్నారు. ఇదే విషయాన్ని ఎఫ్‌ఐఆర్‌లో బహిరంగంగానే ఒప్పుకున్నారు. అంటే సుప్రీం కోర్టు ‘‘ఈ పనులకు పాల్పడిన వారినందరినీ బోనులో నిలబెట్టాల’’న్న జస్టిస్‌ ఖాన్విల్కర్‌ వ్యాఖ్యల ద్వారా తీర్పు అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే తీస్తాను అరెస్టు చేయటానికి కావల్సిన పునాదులు సిద్ధం చేసింది. రాజ్యాంగబద్దమైన పరిహారాన్ని కోరే ఆర్టికల్‌ 32 కింద నమోదైన కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే అర్జీదారుల అరెస్టుకు పునాది వేసిందన్న కీలకమైన వాస్తవాన్ని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాలి. ప్రజల ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ఆయా హక్కులు అమలు చేసుకోవటానికి పౌరులు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు. అంటే సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు వ్యక్తినే గుజరాత్‌ పోలీసులు సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగానే అరెస్టు చేశారు. ఈ వ్యాఖ్యానం రాసే సమయానికి తీస్తా సెతల్వాడ్‌ జైల్లోనే ఉన్నారు.(తెలుగు అనువాదం ప్రచురించే సమయానికి విడుదలయ్యారు).

ఇదేదో పొరపాటున జరిగిందని మీరు సర్దిచెప్పుకుంటే సర్దిచెప్పుకోవచ్చు. ఈ తీర్పుకు ముందే ఖాన్విల్కర్‌ ఇటువంటి మరో తీర్పునిచ్చారు. హిమాంషుకుమార్‌ చత్తీస్‌ఘర్‌ ప్రభుత్వంపై దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తుల్లో ఖాన్విల్కర్‌ సీనియర్‌ న్యాయమూర్తి. హిమాంషుకుమార్‌ కేసులో తీర్పు రాసిన న్యాయమూర్తి జస్టిస్‌ పర్దివాలా. పర్దివాలా రానున్నకాలంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఛత్తీస్‌ఘర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లను సవాలు చేస్తూ హిమాంషుకుమార్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జకియా జాఫ్రీ లాగానే హిమాంషుకుమార్‌ కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 ద్వారానే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హిమాంషుకుమార్‌ పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు కొట్టేసింది. అంతటితో ఆగలేదు. పిటిషనర్‌పై ఐదు లక్షల జరిమానా విధించింది. దాంతో పాటే హిమాంషుకుమార్‌పై చట్టపరమైన చర్యలకు తావిచ్చే వ్యాఖ్యలు చేసింది.

ఈ తీర్పులో మధ్యంతర దరఖాస్తుపై ఇచ్చిన తీర్పులో ప్రస్తావించిన అంశాలపై చర్యలు తీసుసకోవటం తీసుకోకపోవటం అన్నది ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం / సిబిఐలపై ఆధారపడి ఉంటుంది. హిమాంషు చర్యలు ఐపిసిలోని 211 సెక్షన్‌లో ప్రస్తావించిన నేరాలకే పరిమితం కాలేదు. నేరపూరితమైన కుట్ర లేదా మరో ఆరోపణలు కూడా చేసేందుకు కావల్సిన అధారాలున్నాయని ప్రస్తావించింది.
ఛత్తీస్‌ఘఢ్‌లో ఆదివాసీలను పారామిలటరీ దళాలు ఊచకోత కోశాయన్నది కాదనలేని వాస్తవం. అటువంటి అంశంపై న్యాయం చేయమని రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆశ్రయిస్తే అదే రాజ్యాంగ ధర్మాసనం న్యాయం కోరిన వారికి అరదండాలు వేయమని ఆదేశిస్తోంది. తీర్పులో తేలికపాటి భాషను ఉపయోగిస్తోంది. ‘నేరపూరిత కుట్ర లేదా మరేదైనా ఆరోపణ కింద కేసు నమోదు చేయవచ్చ’ని రెచ్చగొడుతోంది. అటువంటి కేసులు నమోదు చేయటానికి కావల్సిన సాక్ష్యాధారాలేమీ సుప్రీం కోర్టు ముందు లేవు. కనీసం హిమాంషు వాదనలేమిటో కూడా వినటానికి సుప్రీం కోర్టు సిద్ధం కాలేదు. ఇటువంటి ఆరోపణలు మరెవ్వరైనా చేస్తే పరువునష్టం కేసులు దాఖలవుతాయి. విశేషమేమిటంటే ఈ రెండు కేసుల్లోనే స్వయంగా సుప్రీం కోర్టే ఇటువంటి విమర్శలు చేస్తోంది.

మీరే సుప్రీం కోర్టు అయితే ఖాన్విల్కర్‌ వంటి న్యాయమూర్తి ధర్మాసనంలో కూర్చుంటే ఆర్టికల్‌ 32 రాజ్యాంగానికి గుండెకాయ అన్న అంబేద్కర్‌ మాటలను విశ్వసించి సుప్రీం కోర్టు తలుపు తట్టేవారి సంగతి శంకరగిరి మాన్యాలే.
హిమాంషుకుమార్‌ తీర్పులో సుప్రీం కోర్టు కేవలం ఛత్తీస్‌గఢ్‌ విషయాన్ని మాత్రమే ప్రస్తావించింది. కానీ తీర్పు రాసేటప్పుడు మాత్రం సిబిఐని కూడా జోడిరచింది. అది కూడా తీర్పు వెలువరించటం పూర్తయ్యాక సొలిసిటర్‌ జనరల్‌ నోటిమాటగా చేసిన విజ్ఞప్తిని ఆధారం చేసుకుని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కానీ సిబిఐ కానీ హిమాంషుకుమార్‌పై చర్యలు తీసుకోవచ్చని సవరించింది. ఇక్కడ కూడా రాజ్యాంగ ధర్మాసనం వ్యవహారశైలి బట్టబయలు అవుతోంది. కేవలం కేంద్ర హోం శాఖ తరపున వాదిస్తున్న న్యాయవాది కోరిక మేరకు హిమాంషుపై కేసునమోదు చేసే అవకాశాన్ని సిబికి కూడా ఇచ్చింది. ఇదేదో అక్షరదోషాన్ని సరిచేసినంత తేలిగ్గా మార్చేసింది. న్యాయస్థానం ప్రభుత్వం చేతిలో పావుగా మారిందని చెప్పటానికి ఇంకేమి ఉదాహరణలు కావాలి?

ఖాన్విల్కర్‌ వ్యక్తిగత చొరవతో వచ్చిన ఈ రెండు తీర్పులు సుప్రీం కోర్టు చరిత్రను ప్రమాదకర దిశవైపు మరల్చనున్నాయి. ఆర్టికల్‌ 32 కింద దాఖలైన పిటిషన్లను కొట్టేయటం, రాజ్యం వాదనలకు పెద్ద పీట వేయటం ఓ సంగతి. ఏకంగా పిటిషనర్లపై కత్తికట్టి దూకుడుగా వ్యాఖ్యలు చేయటమే కాక వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించటం మరో సంగతి. ఏ రకంగా చూసుకున్నా ఇది సహజన్యాయ సూత్రాలను తల్లకిందులుగా మార్చటమే. రాజ్యాంగాన్ని, సుప్రీం కోర్టును కూడా తల్లకిందులు చేయటమమే. ఈ తరహా తీర్పులు సుప్రీం కోర్టును ప్రాధమిక హక్కుల పరిరక్షకురాలి పాత్ర నుండి ప్రధాన దర్యాప్తు అధికారి పాత్రకు దిగజార్చటమే. ఇడీ అమీన్‌ ఓ సందర్భంలో ‘‘మాట్లాడే స్వాతంత్య్రాన్ని గ్యారంటీ చేయగలను. కానీ మాట్లాడిన తర్వాత స్వేఛ్చకు గ్యారంటీ ఇవ్వలేను’’ అన్నారు. అదే తరహాలో ఈ తీర్పుల ద్వారా జస్టిస్‌ ఖాన్విల్కర్‌ కూడా ‘‘కోర్టుకు వచ్చే స్వేఛ్చను అందరికీ ప్రసాదించగలను. కానీ ఓసారి న్యాయస్థానం గడప తొక్కిన తర్వాత నీ స్వేఛ్చా స్వాతంత్య్రాలకు గారంటీ ఇవ్వలేను’’ అని తేల్చి చెప్పారు.

Also Read…

నోయెల్‌ హార్పర్‌: సంఘం పెట్టుకునే హక్కుపై గొడ్డలి పెట్టు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here