అనారోగ్యం బారిన పడుతున్న రాష్ట్రాలు

0
157

Covid Fourth Wave: కోవిడ్‌ ఫోర్త్ వేవ్ తలెత్తటానికి ప్రయత్నాలు చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఆందోళనకర స్థాయిలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. సెకండ్ వేవ్ సందర్భంగా జరిగిన ప్రాణ నష్టం భవిష్యత్తులో జరక్కుండా ఉండాలంటే వివిధ రాష్ట్రాల్లో ఆరోగ్య వ్యవస్థల గురించిన అంచనా, అవగాహన ఉండాలి. మెరుగైన ఆరోగ్యం, మనిషి ఆరోగ్యానికి, సమాజ ఆరోగ్యానికి కీలకం. 1993లో ప్రపంచ బ్యాంకు వార్షిక నివేదిక కూడా ప్రజారోగ్యాన్ని ఉమ్మడి సామాజిక సరుకుగా గుర్తిస్తోంది.

ప్రజారోగ్యం పట్ల ఏమరుపాటు ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని హెచ్చరించింది. ప్రజారోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు మధ్య ఉన్న సంబంధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించాయి. ఫలితంగా సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు, మన్నికైన అభివృద్ధి లక్ష్యాల్లో ఆరోగ్యానికి అగ్రతాంబూలం ఇచ్చాయి. ఇప్పటికీ భారతదేశంలో దాదాపు ముప్పై శాతం ప్రజానీకం బహుముఖ పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు. దాదాపు మూడోవంతు ప్రజానీకం ఆరోగ్య సమస్యలను, అవసరాలను నిర్లక్ష్యం చేసిన తర్వాత భారతదేశం సమీకృత అభివృద్ధిని సాధించలేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ విషయంలో వివిధ రాష్ట్రాల్లో ప్రజారోగ్య రంగం ఎలా ఉందో పరిశీలించేందుకే ఈ ప్రయత్నం.


శిఖరాగ్రాన కేరళ పాతాళంలో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌
మేము చిన్నప్పుడు సోషల్‌ స్టడీస్‌ క్లాసుల్లో బీమారు రాష్ట్రాలు అన్న పదం వింటూ ఉండేవాళ్లం. బీహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు 1980 దశకం నాటికే మిగిలిన రాష్ట్రాల కంటే ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల కంటే వెనకబడి ఉండేవి. ఈ వెనకబాటు అక్షరాస్యత మొదలు ఆరోగ్యరంగం, ఆర్థిక రంగం వరకూ అన్ని రంగాలకూ విస్తరించి ఉండేది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల పేర్లలో తొలి అక్షరాలు కలుపకుంటూ బీమారు అన్న హిందీ పదాన్ని వ్యాఖ్యాతలు వాడుకలో పెట్టారు. బీమారు అంటే హిందీలో అనారోగ్యం. దేశవ్యాప్తంగా ప్రపంచీకరణ విధానాలు, పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా ప్రవహిస్తున్నాయంటున్న గత మూడు దశాబ్దాల్లో ఈ రాష్ట్రాలు అభివృద్ధి సూచికలు సంగతి అలా ఉంచి, ఆరోగ్య సూచికల్లో కూడా వెనకబాటుతనంలో కొనసాగుతూనే ఉంది.

వివిధ రాష్ట్రాల్లో ఆరోగ్య విధానాలు, ఆచరణను అధ్యయనం చేసిన నీతి ఆయోగ్‌ ఓ నివేదిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగం అభివృద్దిలో ఉన్న అసమానతలను ఎత్తి చూపింది. ఏ రాష్ట్రం సహస్రాబ్ది లక్ష్యాలు, మన్నికైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఎంత దూరం ప్రయాణించిందో ఈ నివేదిక చర్చిస్తోంది. జిల్లా స్థాయిలో ఆరోగ్య సూచికల గురించి చర్చించిన మొట్టమొదటి నివేదిక ఇదే. వినియోగంలో ఉన్న ఆసుపత్రల్లో పడకలు ఈ అధ్యయనంలో ఓ ప్రధానమైన ఇండికేటర్‌గా ఉన్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి వెయ్యిమందికి కనీసం 2 పడకలన్నా ఉండాలని నిర్దేశిస్తుంది. దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానంలో లక్షమంది జనాభాకు 22 పడకలు ఉండాలని ప్రతిపాదించింది. ఈ ప్రకారం చూసుకుంటే కేరళ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రమాణాలను పాటిస్తోంది. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో ఈ ప్రమాణాలు అత్యంత కనిష్ట స్థాయిలో ఉన్నాయి. అంటే కనీసం లక్ష మందికి 22 పడకలు కూడా లేని పరిస్థితి ఈ రెండు రాష్ట్రాల్లో ఉంది.

భారత దేశంలో రాష్ట్రాల ఆరోగ్య సూచికలు అన్న మరో నివేదిక సమర్ధవంతమైన ప్రజారోగ్య వ్యవస్థ ఉన్న రాష్ట్రాల్లో శిశుమరణాలను అరికట్టడం సాధ్యమైందని పేర్కొంది గోరఖ్‌పూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక పసిపిల్లలు ఎలా ప్రాణాలు కోల్పోయారో మనం చూశాము. ప్రతి వెయ్యిమంది నవజాత శిశువుల్లో మరణాల సంఖ్య 12 కు తగ్గించాలన్నది ఐక్యరాజ్యసమతి నిర్దేశించిన లక్ష్యం. ఇప్పుడు భారతదేశంలో అటువంటి మరణాలు 33 వరకూ ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడిస్తోంది కేరళలో నవజాత శిశుమరణాలు వెయ్యికి ఐదు మాత్రమే. ప్రతి ప్రాణాన్ని బతికించటానికి కేరళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.

ప్రారంభంలో చెప్పుకున్నట్లు ఆరోగ్యానికి ఆర్థిక వ్యవస్థకు మధ్య ఉన్న సంబంధం విడదీయరానిది. ఆరోగ్యవంతమైన వ్యక్తి ఎక్కువ కాలం పని చేయగలుగుతాడు. ఎక్కువ ఉత్పత్తి తీయగలుగుతాడు. జాతి సంపదకు పోగేయటానికి ఎక్కువ పాత్ర పోషించగలుగుతాడు. స్థిరాస్థి మార్కెట్‌లో నిలకడగా నిలవగలుగుతాడు. కానీ బహుముఖ పేదరికాన్ని, ఆనారోగ్యాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తులు, కుటుంబాలు పై పాత్రను పోషించలేవు. పైగా ఆర్థిక వ్యవస్థకు భారంగా మారతారు. రాష్ట్రాల వారీ జనాభా వివరాలు పరిశీలించినప్పుడు కేరళలో బహుముఖ పేదరికంతో ఉన్న జనాభా కేవలం 0.73 శాతం ఉంటే ఉత్తరప్రదేశ్‌లో 51.92 శాతం మంది బీహార్‌లో 37.79 మంది ఉన్నారు.


ఇక్కడ మరో విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆరోగ్య వ్యవస్థతో పాటు ఆదాయ అసమాతనలు కూడా అదుపులో ఉండాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు ప్రజలందరికీ ఇప్పుడున్న దానికంటే మెరుగ్గా చేరతాయి. అందువల్ల కేవలం ఆర్థిక వ్యవస్థ ఓ దిక్కూ, ఆరోగ్య సంరక్షణ మరో దిక్కూ ఉంటే సామాజిక లక్ష్యాలు సాధించలేము. ప్రజారోగ్య వ్యవస్థ మౌలిక సదుపాయాలు ఏ మేరకు విస్తరిస్తాయో ఆ మేరకు ఆర్థిక అసమానతలు కూడా తగ్గుతూ పోవాలి. కానీ నేడున్న సంస్కరణల దశ దీనికి భిన్నంగా సాగుతోంది. అందువల్లనే విద్య, వైద్యం వంటి రంగాలపై మొత్తం పెత్తనం కేంద్రానికే అప్పగించకుండా రాజ్యాంగ నిర్మాతలు ఈ విషయాల్లో రాష్ట్రాలకు గణనీయమైన అధికారాలు అప్పగించారు.

ఈ బాధ్యతలు నిర్వహించేందుకు ఏర్పాటైన జాతీయ అభివృద్ధి మండలి దాదాపుగా పదేళ్లు నుండీ ఒక్కసారి కూడా సమావేశం జరపలేదు. ఫలితంగా వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన సామాజిక రంగాల అభివృద్ధి కుంటుపడిరది. ఆరోగ్య వ్యవస్థ అటకెక్కింది. అందువల్ల కోవిడ్‌ రెండోతరంగంలో జరిగిన ప్రాణ నష్టానికి రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న విధాన వైఫల్యం పునాదిగా ఉందన్న వాస్తవాన్ని గుర్తించకపోతే భవిష్యత్‌లో సంభవించే అటువంటి ప్రమాదాలను ఎదుర్కుని ప్రజారోగ్యాన్ని కాపాడుకోవటం మరింత కష్టమౌతోంది.

Also Read…

Jahangirpuri violence: జహింగీర్‌పూర్‌ నివాసితులు అక్రమ వలసదారులు : బిజెపి నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Devulapalli Prabhakar Rao : అధికార భాషా సంఘం అధ్య‌క్షులు దేవులపల్లి ప్రభాకర్ రావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here