తెలుగడ్డా ప్రత్యేకం: కాన్సర్ రోగులకు కీమోతో పని లేకుండా ప్రమాదకరమైన శస్త్రచికిత్సతో పని లేకుండా కాన్సర్ గ్రంధులను తొలగించగలిగితే ఎలా ఉంటుంది?
శస్త్రచికిత్స, కీమోతో పనిలేకుండా నయం చేసే మార్గం ఏముంటుంది? ఇటువంటి ప్రశ్నలు నేడు వైద్య పరిశోధనా రంగం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దాంతో పాటే కొన్ని ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. మరికొన్ని ప్రయోగాలు వైద్యపరీక్షల పరిభాషలో అడ్వాన్స్డ్ దశలో ఉన్నాయి. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం సాగిస్తున్న ప్రయోగం అటువంటి అడ్వాన్డ్స్ దశలో ఉన్నవాటిలో ఒకటి.
ఈ బృందం సాగించిన పరిశోధనా ఫలితాలు న్యూ ఇంగ్లాండ్ మెడికల్ జర్నల్ అనే వైద్య పరిశోధనా పత్రికలో ప్రచురించబడ్డాయి. ఈ వివరాల ప్రకారం అమెరికా పరిశోధకులు రూపొందించిన డొస్ట్రాలిమాబ్ అనే మందును రెండు, మూడు దశల్లో ఉన్న కాన్సర్ రోగులు మూడు వారాలకొకసారి చొప్పున ఆర్నెల్ల పాటు వాడిన తర్వాత వారి శరీరంలో అన్ని భాగాల్లో ఉన్న కాన్సర్ గ్రంధులు కరిగిపోతాయి. ఈ ఫలితాలు కాన్సర్ నివారణ, చికిత్సలకు సంబంధించిన సరికొత్త అవకాశాలను ముందుకు తెస్తున్నాయి.
అమెరికాకు చెందిన జిఎస్కె ప్రై తయారు చేసిన ఈ మందును ఎంపిక చేసిన పన్నెండు మంది రోగులకు ఇచ్చారు. ఈ పన్నెండు మందీ రెక్టాల్ కాన్సర్ రోగులు. సాధారణంగా ఈ తరహా కాన్సర్కు కీమో థెరఫీ లేదా రేడియేషన్ ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న వైద్యాలు. అటువంటి వారికి కీమో, రేడియేషన్తో పని లేకుండా నయం చేయటానికి ఆరు నెలల పాటు వారానికి మూడు డోసుల చొప్పునఈ మందులు సరఫరా చేశారు. ఈ రోగులందరినీ దాదాపు రెండేళ్ల పాటు పరిశీలించారు. ఈ మందులు వాడిన రెండేళ్ల తర్వాత రకరకాల టెస్టులు చేసిన తర్వాత కూడా ఏ ఒక్కరిలోనూ కాన్సర్ కణాలు కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. వీరి ఆరోగ్యం కీమోతో పని లేకుండానే కోలుకున్నది.
ఈ తరహా మందులు ఇమ్యూనో థెరపీలో భాగంగా ఇస్తామని, ఈ మందులు కాన్సర్ క్రిముల వ్యాప్తిని అడ్డుకుంటాయని గుర్గాంలోని మెదాంత ఆసుపత్రి కాన్సర్ విభాగం అధిపతి డాక్టర్ అశోక్ కుమార్ వైద్ అంటున్నారు. అయితే ఈ మందులు ఇతర రకాల కాన్సర్ చికిత్సలో అక్కరకొస్తాయా లేదా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దీనికోసం మరిన్ని ప్రయోగాలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కీమోతో పని లేకుండా కాన్సర్కు చికిత్స చేయగలటం అద్భుతమైన అంశమని అయితే దీన్ని మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఫోర్టిస్ ఆసుపత్రి కాన్సర్ విభాగం డెరెక్టర్ అనిల్ హెరోర్ అంటున్నారు.
అయితే ప్రపంచంలో కోటిన్నర మంది రెక్టాల్ కాన్సర్ రోగులున్నారని, కేవలం 12 మందిపై సాగిన ప్రయోగమే పునాదిగా భావించలేమన్న ఆందోళన పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. క్లినికల్ ట్రయల్ దశలో ఈ మందును మరింత విస్తృంగా పరిశీలనలోకి తీసుకురావల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కాన్సర్ కణం ఐదు నుండి పదేళ్ల తర్వాత కూడా తిరగబెట్టే ప్రమాదం ఉన్నందున కేవలం రెండేళ్లు పరిశీలించి శాశ్వతంగా నివారణ పొందామని భావించటం కూడా సరైన అంచనకా కాదని డాక్టర్ హెరోర్ అంటున్నారు.
ప్రాణం ఖరీదు
ఈ మందు కాల పరీక్షకు నిలిచినా సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావటం అసాధ్యమే అంటున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు చూస్తే ఒక్కో డోసు కనీసం 11000 డాలర్లు ధరగా ఉంది. అంటే వారానికి మూడు డోసులు చొప్పున ఆరు నెల్లు అంటే 72 డోసులకు దాదాపు ఎనిమిది లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది. అంటే రూపాయిల్లో షుమారు 60 లక్షలు. పరిశోధనా రంగం ప్రమాణాల్లో చూస్తే ఇది ఓ ముందడుగే అయినా ప్రజా ఆరోగ్య కోణంలో చూసినప్పుడు సాధించాల్సినది చాలా ఉందని అంటున్నారు.