(దాదాపు మూడువందలకు పైగా దుర్ఘటనలు గుజరాత్‌ను అల్లకల్లోలం చేసిన 20 ఏళ్లకు జకియా జాఫ్రి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన నిరసన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పు తీస్తాతో పాటు మరో ఇద్దరు ఇండియన్ పోలీసు సర్వీసుకు చెందిన అధికారుల అరెస్టుకు దారితీసిన విషయం తెలుగడ్డా పాఠకులకు తెలిసిందే. ఈ సందర్భంగా 2018 నవంబరు 18న ది వైర్లో తీస్తా సెతల్వాడ్ రాసిన వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము. అనువాదం : కొండూరి వీరయ్య)
కొండ పాదం నుండి శిఖరం వరకూ ఎక్కటం మొదలు పెట్టాక మధ్యలో ఎక్కడో ఒక చోట మనం అసలు కొండ ఎందుకు ఎక్కటం మొదలు పెట్టాము అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
జకియా జాఫ్రి కేసు నేపథ్యంలో ఈ మాటలు పదే పదే గుర్తుకొస్తాయి. 2002 గుజరాత్ నరమేధం వెనక సాగిన కుట్రను బహిర్గతం చేయటానికి ఆ సమయంలో వివిధ ప్రభుత్వ విభాగాల బాధ్యతల్లో ఉన్న అధికారులు, వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యాధారాలను పునాదిగా చేసుకుని 2006లో దాఖలు చేసిన షుమారు 2000 పేజీల క్రిమినల్ కంప్లయింట్ దాఖలు చేసినప్పుడు మేము ఎక్కదల్చుకున్న కొండ శిఖరం ఎత్తు ఎంత ఉందో మాకు తెలుసు. పారదర్శకంగానూ, న్యాయబద్ధంగానూ లేవనెతిన అనేక కీలకమైన కోణాల గురించి దర్యాప్తు జరపాలన్న డిమాండ్ పట్ల ఈ స్థాయిలో వ్యతిరేకత తలెత్తుతుందని మాత్రం ఊహించలేకపోయాము.
విస్పష్టమైన పథకం ప్రకారం 2002లో గుజరాత్లో జరిపించిన ఘోరాన్ని గుర్తించాలని, నష్టపోయిన వారికి న్యాయం చేయాలని, దోషుల జవాబుదారీతనం కోసం జరుగుతున్న ప్రయత్నాలకు అవే శక్తులు నేడు తూట్లు పొడుస్తున్నాయి. గతంలో ఇదే వ్యవస్థ జరిగిన తప్పొప్పులను సరిదిద్దటానికి ప్రయత్నం చేసింది.
బాధ్యతాయుతమైన పౌరుల ట్రిబ్యునల్ వివరించినట్లుగా ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి, అతని నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ద్వారా సాగించిన వ్యూహరచన ఫలితంగా’’ చోటు చేసుకున్న దాదాపు మూడు వందల దుర్ఘటనలకు సంబంధించిన సంపూర్ణ సమచారం ఆధారంగా పదహారేళ్ల క్రితం దాఖలైన క్రిమినల్ కంప్లైంట్ ఎట్టకేలకు నవంబరు19 (2018)న సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఈ విచారణలో మా ఫిర్యాదులో ప్రస్తావించిన విధంగా అసలు ఈ ఘోరానికి మూలకారణం ఏమిటో తెలుసుకోవాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించనున్నాము.
ఈ వక్రీకరణలకు పునాది సుప్రీం కోర్టు పూర్తి అధికారాలతో నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తన వంతు బాధ్యతను నెరవేర్చటంలో చేసిన మోసమే. అ ప్రత్యేక దర్యాప్తు బృందం మాజీ సిబిఐ డెరెక్టర్ నాయకత్వంలో ఏర్పడిరది. సదరు అధికారి ఎవరికి వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తున్నారో అదే ప్రభుత్వం ప్రస్తుతం సదరు అధికారిని సైప్రస్‌లో భారత రాయబారిగా నియమించింది. ఆయనకు సహాయకులు (ఎంపిక చేసుకున్న అధికారులు కూడా ప్రస్తుతం పలురకాలైన పదోన్నతులతో ప్రశాంత జీవనం గడుపుతున్నారు) ఈ మొత్తం ఘోరకలి వెనక ఉన్న నేరపూరితమైన కుట్ర, ప్రేరేణ, హత్యలు, విద్వేష ప్రసంగాలు, సాక్ష్యాధారాలు నాశనం చేయటం, చట్టబద్ధమైన బాధ్యతల్లో ఉన్న అధికారుల చట్టాన్ని తప్పుదారి పట్టించటం వంటి మౌలిక ఆరోపణలను నిగ్గు తేల్చటంలో లోపాయికారీగా వ్యవహరించి కీలకమైన ఆరోపణలను మసిపూసి మారేడుకాయ చేసేలా వ్యవహరించారు. ఈ ఆరోపణలను తొలుత 2006లో దాఖలు చేసిన క్రిమినల్ కంప్లైంట్లో రేఖా మాత్రంగా ప్రస్తావించగా 2013 ఏప్రిల్ 15న మేజిస్ట్రేటు ముందు దాఖలు చేసిన నిరసన పిటిషన్లో మరిన్ని ఆధారాలతో న్యాయస్థానం ముందుంచాము.
కుట్ర కోణాన్ని నీరుగార్చటం
ఆశ్చర్యం ఏమిటంటే స్వయంగా మే 10, 2010న ప్రత్యేక దర్యాప్తు బృందం తన ప్రాధమిక దర్యాప్తు నివేదిక రూపొందించింది. దానిపై 2010, మే 12న బృందం అధ్యక్షుడు అనేక ఆరోపణలకు సంబంధించి తదుపరి దశల్లో జరగాల్సిన దర్యాప్తు గురించి రూపొందించిన ప్రణాళిక కూడా ఉంది. మొత్తంగా ఈ బృందం 32 ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తు కోసం ప్రణాళిక రూపొందించుకుంది. 2012 ఫిబ్రవరి 8న ఈ బృందం సుప్రీం కోర్టుకు సమర్పించిన తుది నివేదికలో ఈ అంశాలు కూడా అంతర్భాగాలే.
జకియా జాఫ్రి ఫిర్యాదు విస్తృతిని పక్కన పెట్టి ప్రత్యేక దర్యాప్తు బృందం ఓ పథకం ప్రకారం దిగువ కోర్టులను దారి మళ్లించేందు విశ్వ ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో మొత్తం దర్యాప్తు పరిధిని గుల్బర్గా సొసైటీ (జకియా జాఫ్రి నివాసం ఉంటున్న గృహ సముదాయం)కే పరిమితం చేసింది. తద్వారా ఈ బృందం ఎవరి మీదనైతే ఫిర్యాదులు ఉన్నాయో వారంతా పరిశుద్ధాత్మలు అని చెప్పుకోవటానికి కావల్సిన భూమికను సిద్ధం చేసింది. నిజానికి ఏ సంస్థా ఈ ఘోరకలికి ముఖ్య సూత్రధారిగా ఉన్న వ్యక్తికి గానీ, ఆయన సహాయక బృందానికి గానీ క్లీన్ చిట్ (ఏ పాపమూ ఎరుగని వ్యక్తులు) అని తేల్చి చెప్పలేదు.
గుల్బర్గా సొసైటీ మారణహోమం 2002లో యావత్ గుజరాత్‌నూ కల్లోలపరిచిన ఘటన. ఫిబ్రవరి 28, 2002 పట్టపగలు జరిగిన ఘోర దురంతం ఇది. ఇక్కడ దాఖలైన ప్రాధమిక దర్యాప్తు నివేదిక ప్రత్యేకంగా గుల్బర్గ నరమేధానికి సంబంధించింది. జకియా జాఫ్రి దాఖలు చేసిన ఫిర్యాదులో ఉన్న నిందితుల పేర్లు, ఘటనలు వేర్వేరు.
గుల్బర్గ సొసైటీ కేసులో 22మంది నిందితులున్నారు. కేసు విచారణ పూర్తి అయ్యింది. వాళ్లకు వివిధ మోతాదుల్లో శిక్షలు పడ్డాయి. అయినా సరే ప్రత్యేక దర్యాప్తు బృందం మొత్తం జకియా ఫిర్యాదును కేవలం గుల్బర్గ సొసైటీ కేసుకు పరిమితం చేయటానికి, తద్వారా దిగువ కోర్టులను దారిమళ్టించటానికి శాయశక్తులా ప్రయత్నం చేసింది.
దిగువ స్థాయి కోర్టు, గుజరాత్ హైకోర్టు ఈ మౌలిక వాస్తవాన్ని గుర్తించటంలో ఎలా విఫలమయ్యాయో, ఈ మొత్తం పరిణామాన్ని సుప్రీం కోర్టు ఎలా పరిశీలిస్తుందన్నది చూడాలి.
జకియా జాఫ్రి తొలుత దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ కానీ తర్వాత దాఖలు చేసిన నిరసన పిటిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన నాయకత్వం వ్యూహాత్మక కుట్రతో సాగించిన నరమేధానికి సంబంధించిన పూర్తి ఆధారాలు సమర్పించింది. ఈ కుట్రకు తెరతీసింది స్వయంగా నాటి గుజరాత్ హోం మంత్రి. దీనికి సంబంధించిన వర్తమాన వాస్తవిక సమాచారాన్ని కూడా పిటిషన్లో భాగంగా ఉంది. జకియా జాఫ్రి పిటిషన్ ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన దర్యాప్తు, సంబంధిత పత్రాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.
ఫిబ్రవరి 8, 2012న ప్రత్యేక దర్యాప్తు బృందం తమ దర్యాప్తు ముగింపు నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించిన తర్వాత ఓ పిటిషన్ ద్వారానే ఈ వివరాలు జకియా జాఫ్రికి చేరాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ పత్రాలు నకళ్లు జకియాకు అందచేయటానికి తిరస్కరించటంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కనీసం ఫిర్యాదు చేసిన వారిని తమ ఫిర్యాదు కు సంబంధించిన లేదా ఫిర్యాదు కారణంగా జరిగిన దర్యాప్తు నివేదికలు అందించటం చట్టబద్ధమైన హక్కు.
23 వేల పేజీల నిడివి గల ఈ నివేదికలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలు, పోలీసు కంట్రోల్ రూం రికార్డులు, ఫోన్ కాల్ రికార్డులు, మాపులు, 161మంది వాంగ్మూలాలు, జాతీయ మానవ హక్కుల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం, మహిళా పార్లమెంటేరియన్ల కమిటీ నివేదికలు, విద్వేషపు ప్రసంగాలు, రాష్ట్ర హోం శాఖ నివేదికలు వంటివి అనేకం ఉన్నాయి.
ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికలో ప్రధాన లోపాలు
ఈ నివేదికలు పరిశీలించిన వారికెవరికైనా గుజరాత్ నరమేధం వెనక దాగిఉన్న కుట్ర కోణం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని నిరసన పిటిషన్ కూడా ఎత్తి చూపింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికలోని లోపాలను కూడా నిరసన పిటిషన్ ప్రస్తావించింది. ఈ నివేదికలో గమనించిన లోపాల సారాంశం ఈ క్రింది విధంగా చెప్పుకోవచ్చు :
- మతోన్మాద భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు కావల్సిన విధంగా ముందస్తుగానే కుట్రపూరిత పథకం ఫిబ్రవరి 27, 2002 గోధ్రా రైలు కాల్చివేతకంటే ముందే జరిగింది. ఈ పథకం రూపకల్పనలో పలు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పాల్గొన్నాయి.
- పోలీసు, పాలనా యంత్రాంగాన్ని పక్కన పెట్టేసి కుట్రకు తెర తీసిన ప్రముఖుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు
- చట్ట విరుద్ధంగా గోధ్రా రైలు దహనకాండలో చనిపోయిన వారికి బహిరంగంగా శవపరీక్షలు నిర్వహించటం 4. ముందస్తు జాగ్రత్తలేవీ తీసుకోలేదు. ముందస్తు అరెస్టులు జరగలేదు. ఫిబ్రవరి 27న అనూహ్య స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ అహ్మదాబాద్‌లో కర్ఫ్యూ విధించటంలో జరిగిన జాప్యం.
- సాయుధబలగాల మోహరింపులో జరిగిన జాప్యం
- పోలీసు కంట్రోలు రూం కి వచ్చిన ఫోన్‌కాల్స్ పరిశీలిస్తే ఫోన్లుకు స్పందించిన వాళ్లు తమ విధి నిర్వహణలో ప్రదర్శించిన అంతులేని నిర్లక్ష్యం బట్టబయలవుతోంది.
- విద్వేషపు ప్రసంగాలను, రచనలను, కరపత్రాలను, అడ్డుకోవటం, కట్టడి చేయటంలో జరిగిన లోపం. ఇవన్నీ నేర శిక్షా స్మృతి ప్రకారం శిక్షార్హమైన నేరాలే.
- తప్పుడు రిపోర్టులు, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను దారి మళ్లించటం.
- మినిట్స్ ఆఫ్ మీటింగ్స్, పోలీసు లాగ్ బుక్స్, వైర్లెస్ మెసేజిలకు సంబంధించిన రికార్డులు ధ్వంసం చేయటం
వాస్తవాలను తొక్కి పెట్టడంలో ప్రత్యేక దర్యాప్తు బృందం పాత్ర
గుజరాత్లో 2002లో జరిగిన అనేక ఘోర కృత్యాలకు మూలం రాజ్యాంగ బద్దమైన సంస్థలు, వ్యవస్థలు తమతమ కర్తవ్యాన్ని విస్మరించటమే. జకియా జాఫ్రి ఫిర్యాదు విషయంలో కూడా ఈ కర్తవ్య విస్మరణ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్వయంగా సర్వోన్నత న్యాయస్థానం ద్వారా నియమించబడిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఇటువంటి కర్తవ్య విస్మరణకు పాల్పడటమే కాక గతం నుండీ జరుగుతున్న ఉల్లంఘనలను, విస్మరణలను కొనసాగించింది.
ఘోరకలి నుండి ప్రాణాలు కాపాడుకున్న వారి అభ్యర్థన మేరకు ఈ దర్యాప్తు
బృందం నియామకం జరిగింది. పిటిషన్ దారులు ఈ కేసుల దర్యాప్తును గుజరాత్ పరిధి నుండి బయటకు తీసుకెళ్లాలని కోరారు. కానీ ఆచరణలో ప్రత్యేక దర్యాప్తు బృందం అంతిమంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ విభాగంగా మారింది. గణనీయమైన ఆరోపణలు న్యాయ స్థానం ముందు విచారణకు రాకుండా చేయటానికి కావల్సిన స్థాయిలో అధికారం, దర్పం వెచ్చించబడ్డాయి.
2013లో దాదాపు 20 వాయిదాల్లో వాదనలు విన్న మేజిస్ట్రేట్ కోర్టు, 2015 ` 2017 మధ్య కాలంలో వాదనలు విన్న గుజరాత్ హైకోర్టు వందల పేజీల నిడివి గల తీర్పులు ఇచ్చాయి. నరమేధంలో భాగంగా జరిగిన ఒక సంఘటనకు మాత్రమే ఈ ఫిర్యాదులోని అంశాలు పరిమితం కాలేదన్న వాస్తవాన్ని ఈ తీర్పులు గుర్తించాయి. ఆ విషయాన్ని గుర్తించిన తర్వాత కూడా దర్యాప్తు బృందం ఈ విస్తృత పరిధికి అనుగుణంగా దర్యాప్తు చేయటంలో లోపాలు జరిగాయన్న వాస్తవాన్ని గుర్తించటంలోనూ, ధృవీకరించటంలోనూ ఈ తీర్పులు విఫలమయ్యాయి. దర్యాప్తు సంస్థల ద్వారా జరిగిన లోపాలకు సంబంధించిన సవివరమైన ఆధారాలను పిటిషనర్లు న్యాయస్థానం ముందుంచారు.
కొండపాదానికి కొండ కొనకు మధ్యలో ఓ చోట ఆగిన మేము భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానం స్వయంగా తమ ఆదేశాలతో ఉనికిలోకి వచ్చి తమకు నివేదించాల్సిన ఓ దర్యాప్తు సంస్థ ఎలా తమ బాధ్యతలను విస్మరించిందో, అత్యంత దారుణమైన నేరాలను కప్పిపెట్టడంలో పావుగా మారిందో తెలుసుకునే అవకాశాన్ని దేశానికి, దేశ ప్రజలకు కల్పిస్తుందన్న విశ్వాసంతో ఎదురు చూస్తున్నాము.
రచన : తీస్తా సెతల్వాడ్
రచనా కాలం : 2018,
అనువాదం : కొండూరి వీరయ్య