హిందూ మతం – హైందవం – హిందూత్వ ఒకటి కాదు !

0
93

షుమారు వంద సంవత్సరాల క్రితం చనిపోయిన షిర్డీ సాయిబాబ నేడు భారతదేశంలో విస్తృతంగా భక్తి ప్రపత్తులు అందుకుంటున్న సాధువుగా మారారు. హిందూ ముస్లింలన్న బేధం లేకుండా కోట్లాదిమంది భక్తులు సాయిబాబను పూజిస్తున్నారు. హిందూ కుటుంబంలో జన్మించి ఫకీర్‌ సాంప్రదాయంలో జీవించే కుటుంబంలో పెరిగిన సాయిబాబ మత మౌఢ్యంపై ధ్వజమెత్తిన బోధకుడు. హిందూ ముస్లిం చీలికలను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి. హిందూ, ముస్లిం రెండు మతాలూ ప్రేమ, సేవ, స్వేఛ్చ అనే సూత్రాల ప్రాతిపదికన విలసిల్లాయని నమ్మి అదే విషయాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టిన గొప్ప దార్శనికుడు సాయిబాబ.

ఇదే తరహాలో మత విశ్వాసాలకు అతీతంగా ప్రజల ఆదరణ పొందిన సాధువు భక్త కబీర్‌. ఆయన 1398 `1448 మధ్యకాలంలో జీవించారు. పుట్టుకతోనో, పెంపకం ద్వారానో ముస్లిం చేనేత కుటుంబంలో జీవితాన్ని ప్రారంభించిన కబీర్‌ ఇస్లాం మత విశ్వాసాల గురించి లోతుగా అవగాహన చేసుకున్నారు. అయితే విస్తారంగా అందుబాటులో ఉన్న ఆయన ద్విపద (రెండు పంక్తుల పద్యం) గేయాలు పరిశీలిస్తే కబీర్‌కు హిందూ పురాణాలు, సాహిత్యం గురించి కూడా లోతైన అవగాహన ఉన్నదన్న విషయం స్పష్టమవుతుంది. హిందూ, ముస్లిం మతఛాంధసత్వాన్ని తీవ్రంగా ఈసడిరచుకున్న వ్యక్తి. మతమౌఢ్యాన్ని, నిరంకుశత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టిన వ్యక్తి గా కబీర్‌ మధ్యయుగాల భారత చరిత్రలో నిలిచిపోతారు.

నేడు విస్తృతంగా ప్రచారంలో ఉన్నట్లు భారతదేశపు గతమంతా కేవలం బ్రాహ్మణాధిపత్యం, హైందవ విశ్వాసాలు, ఆచారాలు, సంస్కృత సాహిత్యంలో కనిపించే చర్చలు, ఉపనిషత్‌లు, గీత లేదా కుల వ్యవస్తకు మాత్రమే పరిమితం కాలేదు.

ప్రముఖ రచయిత ముకుందరావు అధ్యయనం ప్రకారం భారతదేశంలోని వైదీక సాంప్రదాయం, సాహిత్యం, అధ్యాత్మిక ధోరణుల కంటే వైదికేతర సాంప్రదాయాలు, సాహిత్యం, ఆధ్యాత్మిక ధోరణులు ఎక్కువగా ఉన్నాయి. మధ్యయుగాల భారత చరిత్రలో ప్రఖ్యాతి పొందిన సాధువులు హిందూ ముస్లిం ఐక్యత కోసం విశేషంగా కృషి చేసిన వాస్తవం కూడా చరిత్ర పుటల్లో నిక్షిప్తమై ఉంది.

ఈ వివరాలు పరిశీలించినప్పుడు భారతీయ తాత్వికత అని ఒకే తరగతి కింద వర్గీకరించగలిగిన తాత్విక సాంప్రదాయం లేదని స్పష్టమవుతుంది. అందుకే ముకుందరావు భారతీయత అంటే బహుళత్వం అనే అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. భారతీయ సాంప్రదాయం అంటే ఈ దేశంలో పుట్టిన హిందూ, బౌద్ధ, జైన, సిఖ్కు సాంప్రదాయాలతో పాటు విదేశీ మతాలైన క్రైస్తవ, ముస్లిం సాంప్రదాయాలు, విశ్వావాల సమాహరమే అని చెప్పాలి.

వర్తమాన భారత రాజకీయ నేపథ్యంలో ఈ వాస్తవాన్ని ప్రకటించటం అంటే కోరి తిప్పలు తెచ్చుకోవటమే.
క్రీస్తు శకం తొలి శతాబ్దానికి చెందిన శరహానంద ఇహలోక జీవనానికి కావల్సిన అన్ని విషయాలు, వస్తువులు, ఆలోచనలు త్యజించాలన్న ప్రచారాన్నేకాక వైదీకాన్ని, ఆధిపత్య ధోరణులను, వ్యాఖ్యానాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆ నాటితో పోల్చి చూసినప్పుడు ఆయన జీవితకాలానికంటే ఆయన బోధనలు చాలా ఆధునిక దృక్ఫధాన్ని చర్చకు పెట్టాయని చెప్పవచ్చు. ‘‘నగ్నత్వమే విముక్తి అయితే అందరికన్నా ముందు కుక్కలు, నక్కలు మోక్షం పొందాలి’’ అని మోక్ష ప్రాప్తికి చిట్కాలు చెప్తున్న వారిని ఎగతాళి చేస్తారు. ఆశ్చర్యమేమిటంటే తర్వాతి కాలంలో ఆయన్ను మహాసిద్ధుడని పిలిచారు. కొలిచారు.

అభినవగుప్త (950`1016) శివభక్తుడు. అపర భైరవ అవతారంగా పూజలందుకున్నారు. భారతదేశపు అతి కొద్ది మంది గొప్ప తత్వవేత్తలు, రచయితలు, సాధువులు, దార్శనికుల్లో అభినవగుప్త ఒకరు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించదల్చుకున్న వాళ్లు ఎవరైనా మానసిక స్వఛ్చత కలిగి చిత్తశుద్ధితో ప్రయత్నించాలని, అటువంటి వ్యక్తి సాధువా, సంసార జీవనం గడుపుతున్న వ్యక్తా, బ్రాహ్మణుడా లేక ఛండాలుడా అన్నదాంతో పని లేదని ప్రకటించారు. ఆయన జీవించిన కాలంలో పోలిస్తే ఇది విప్లవాత్మకమైన అవగాహన.

ఈ దేశంలో జన్మించిన తత్వవేత్తల్లో 1136`1196 మధ్యకాలంలో జీవించిన బసవన్న ఒకరు. బ్రాహ్మణీకపు ధర్మశాస్త్రాలు, ఆచార వ్యవహారాలతో విసుగు చెందిన వాటిపై ఏకంగా తిరుగుబాటుబావుటానే ఎగురవేసిన వాడు బసవన్న. బ్రాహ్మణాధిపత్యాన్ని సవాలు చేయటమే కాక కుల వివక్ష, లైంగిక వివక్షలను తిరస్కరించిన వ్యక్తి. అంతటితో ఆగకుండా శివ భక్తి సాంప్రదాయంలో ఓ నూతన సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన సాంప్రదాయమే నేడు లింగాయతగా పేరుపొందింది. శివ భక్తుల్లో కుల వివక్ష ఏమిటి, ఎందుకు అని ప్రశ్నించారు. కుల వివక్ష రూపుమాపటానికి సహపంక్తి భోజనాలు సాగించాలని పిలుపునిచ్చారు. లింగాయత సాంప్రదాయంలో దీన్ని దాసోహ అంటారు. సిఖ్కులు పాటించే లంగర్‌ సాంప్రదాయం కుడిఎడంగా ఇలానే ఉంటుంది.

పదకొండవ శతాబ్దానికి చెందిన అల్లామా ప్రభు అనే సాధువు కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. వాగ్గేయకారుడు. సాధువు. సంచారి. ఆయన కూడా వేదీక సాంప్రదాయాన్ని ఘాటుగా విమర్శించారు. ప్రత్యేకించి విగ్రహారాధనను, కుల వ్యవస్థను, ధార్మిక ఆచార వ్యవహారాలను తీవ్రంగా వ్యతిరేకించారు.

భారతీయ భక్తి సాంప్రదాయం చెప్పుకోదగ్గ సంఖ్యలో మహిళా సాధువులను కూడా తయారు చేసింది. ఇందులో కొన్ని పేర్లు మాత్రమే సార్వత్రింగా తెలిసినవి. మరికొందరు తెలియనివారున్నారు.

అటువంటి వారిలో అక్కమహాదేవి ముఖ్యులు. 1130 `1160 మధ్యకాలంలో జీవించిందని అంచనా. ఆమె ఒకసారి బసవన్న, అల్లామా ప్రభుల వద్దకి నగ్నంగా వచ్చిందని చెప్తారు. సమాజం విధించిన సరిహద్దులను చెరిపేసి అక్కమహాదేవి నూతన వ్యక్తిత్వం అస్తిత్వం కోసం నిరంతరం అన్వేష సాగించిన వ్యక్తి అని చెప్తారు ముకుందరావు. నేడు కర్ణాటకలో ఆమెను పూజించని ఇల్లు లేదు. విశ్వవిద్యాలయాల మొదలు రహదారుల వరకూ ఆమె పేరు పెట్టి సాంస్కృతిక వారసత్వాన్ని చాటుకుంటూ ఉన్నాయి కర్ణాటక ప్రభుత్వాలు. ఆవిడ ఆ రోజుల్లో వ్యవహరించినట్లుగా ఈ రోజుల్లో వ్యవహరించాలంటే ఆధునిక భారత సమాజం అని మనం పిలుచుకుంటున్న వర్తమాన సమాజం ఆమెకు స్వేఛ్చనిస్తుందా అన్నది పెద్ద ప్రశ్న.

1320`1390 మధ్యకాలంలో జీవించిన లల్లేశ్వరి అసలు పేరు శ్రీనగర్‌ సమీపంలో జన్మించిన ఆమె ముస్లింలకు లల్లా ఆరిఫ్‌, హిందువులకు లల్లా యోగీశ్వరి. అక్కమహాదేవి లాగానే ఈమె కూడా నిత్య సంచారి అయిన సాధువు. సామాజిక విభజనలను బంధనాలను అధిగమించి నగ్నంగా తిరుగుతూ అలౌకికానందం గురించి మాట్లాడి, పాడి, నాట్యం చేసిన వ్యక్తి.

తమిళనాడులోని తంజావూరు జిల్లాల్లో పులియ (ఓ రకమైన అంటరానికులం)లో పుట్టిన నందనార్‌ గొప్ప శివ భక్తుడు. కానీ నేడు తమిళనాడులో కోట్లాదిమంది శివ భక్తులతో పూజించబడుతున్నారు.

పదిహేడో శతాబ్దికి చెందిన తుకారాం (1608`1650) ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన భక్త కవిగా మనకు కనిపిస్తున్నప్పటికీ ఆయన కూడా బ్రాహ్మణ పక్షపాతానికి బలైనవాడే. భక్తి సాంప్రదాయంలో తుకారాంకు దక్కిన ప్రజాదరణను తొలినాళ్లల్లో గుర్తించటానికి బ్రాహ్మణ పండితులు సిద్ధం కాలేదు.

క్రీస్తు శకం 1371లో జన్మించిన రవిదాస్‌ హైందవ సాంప్రదాయాన్ని, ఆచార వ్యవహరాలను తన శైలిలో మృదువుగా తిరస్కరించిన వ్యక్తి. బ్రాహ్మణులకు ప్రత్యేకమైన మానవతీత శక్తులేవీ లేవని ఘంటాపథంగా చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని అవధ్‌ ప్రాంతంలో తులసీదాస్‌ రామాయణ పారాయణాన్ని వారణాసికి చెందిన బ్రాహ్మణులు అందరూ స్వాగతించలేరు.
తన బోధనలతో మధ్యయుగాల భారత సాంస్కృతిక మత చరిత్రలో తనదైన స్థానాన్ని ధృవపర్చుకున్న భక్తి కవి శంకరదేవ. ఆయన 1339`1568 మధ్య కాలంలో జీవించారు. మేధావి. సాధువు. నాటక రచయిత, కళాకారుడు. సంఘ సంస్కకర్త. దేవుడు మనుషులందరినీ తిస్కరించాడని వాదించారు. ఆయన జీవితకాలం నాటికి విప్లవాత్మకమైన సంఘజీవనాన్ని ఆచరించి గిరిజనులు, ముస్లింలు, శూద్రులతో కలిసి జీవించారు.

1819`1889 మధ్యకాలంలో జీవించిన శిశునాల షరీఫ్‌ కూడా హిందూ, ముస్లిం ధార్మిక సాంప్రదాయంలో ప్రావీణ్యం సంపాదించిన భక్త కవి. సాధువు. మతవిశ్వాసాలు, అస్తిత్వాల పరిధిని అధిగమించి సర్వమత సమానత్వాన్ని ప్రచారం చేసినవారిలో ఆయన ఒకరు. శివభక్తుడైన ఖాద్రి కుటుంబంలో జన్మించిన షరీఫ్‌ లింగాయత్‌ సాంప్రదాయంలో విద్యాబుద్దులు నేర్చుకున్నారు. రామాయణ మహాభారతాలు, పురాణాలు ఔపోసన పట్టారు. చాంధస బ్రాహ్మణులు ఆయన్ను ద్వేషించారు. 1889 జూలై 3న శివస్త్రోతం చేస్తూ ప్రాణాలొదిలారు. ఆయన మరణాన్ని శ్లాఘిస్తూ ముస్లింలు ఖురాన్‌ నుండి హిందువులు వేదాల నుండి మంత్రోఛ్చారణ చేశారు. ఆయన సమాధిని నేడు హిందూ ముస్లింలు ఇరువురూ సందర్శిస్తూ ఉంటారు.

సూఫీయిజం ఇస్లాం మతంలో ఓ ఉపాంగం కాదు. ఇస్లాం మతానికి మార్మిక భక్తివాదాన్ని పరిచయం చేసిన భక్తి సాంప్రదాయం అని ముకుందరావు చెప్తారు. ప్రఖ్యాత నిజాముద్దీన్‌ చిస్తీ భక్తులను తమతమ మతవిశ్వాసాలు విడనాడకుండానే చిస్తీ జీవన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.

మహ్మద్‌ ప్రవక్త మీద ఉన్న అచంచల విశ్వాసం బులే షాను హిందూ ఆధ్యాత్మిక బోధనలతో పాటు ఇతర భక్తి సాంప్రదాయాలనుండి ఎన్నో విషయాలు నేర్చుకోవటంలో ఎటువంటి ఆటంకమూ కల్గించలేదు.
ముకుందరావు సమగ్ర పరిశోధనతో వెలుగులోకి తెచ్చిన ఈ వివరాలు భారత దేశపు ప్రఖ్యాత వ్యక్తులు : సంఘసంస్కర్తలు, తత్వవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు అన్న పుస్తకంలో పొందుపర్చారు. నిజానికి హిందూ మతం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ఈ సమాచారం అక్కరకొస్తుంది.

(ముకుందరావు గ్రంధాన్ని పరిచయం చేస్తే ది వైర్‌ లో ఎం ఆర్‌ నారాయణ స్వామి రాసిన వ్యాసానికి కొండూరి వీరయ్య అనువాదం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here