ఓసారి న్యాయస్థానం గడప తొక్కాక స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు నో గారంటీ

0
132
  • జస్టిస్‌ ఎ.ఎం ఖాన్విల్కర్‌ తీర్పుల విశ్లేషణ – మొదటి భాగం

ఈ మధ్య కాలంలో భారత న్యాయవ్యవస్థ అత్యంత ప్రమాదకరమైన మలుపుకు చేరువైంది. ఇటలీలో ఫాసిస్టు పాలన సందర్భంగా రోక్కో స్మృతి అమల్లోకి వచ్చినట్లు భారతదేశంలో కూడా న్యాయస్థానాలు సహజ న్యాయ సూత్రాలకు తిలోదకాలు ఇవ్వటమే కాక న్యాయ సూత్రాలను తలక్రిందులుగా అమలు చేసే క్రమం ఊపందుకొంది. న్యాయస్థానాలు ప్రభుత్వం చేతుల్లో పావులుగా మారాయన్న జనాభిప్రాయం వాస్తవమే అని రుజువు చేసే కొన్ని తీర్పులపై రాజ్యాంగ నిపుణులు గౌతం భాటియా విశ్లేషణలను తెలుగడ్డా పాఠకుల కోసం అందిస్తున్నాము.

“నా అంతర్జాల పత్రికలో భారతదేశపు ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలంలో ఇచ్చిన తీర్పులు, చూపించిన చొరవవంటి విషయాలపై లోతైన విశ్లేషణ చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకూ భారత ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలాన్ని మాత్రమే విశ్లేషిస్తూ వచ్చాను. ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న వాళ్లు పలు రాజ్యాంగ ధర్మాసనాల్లో అనేక భాగంగా కీలకమైన తీర్పులు వెలువరించే అవకాశం వారికి దక్కుతుంది.
ఈ సాంప్రదాయానికి మినహాయింపునిస్తూ గత సంవత్సరం జస్టిస్‌ ఆర్‌ ఎఫ్‌ నారిమన్‌ పదవీ విరమణ సందర్భంగా ప్రత్యేక విశ్లేషణ చేశాను. ఇప్పుడు ఈ మినహాయింపును జస్టిస్‌ ఖాన్విల్కర్‌కు కూడా వర్తింపచేయాలనుకుంటున్నాను.

తన పదవీకాలంలో ఖాన్విల్కర్‌ రాజ్యాధికారం, వ్యక్తిగత స్వేఛ్చను ప్రభావితం చేసే పలు కీలకమైన తీర్పులు వెలువరించారు. ముఖ్యంగా ఈ తీర్పులు చదువుతున్నప్పుడు ఓ కొత్త తరహా న్యాయతాత్వికతను సూచిస్తున్నాయి. ఒకటి అరా మినహాయింపులు పక్కన పెడితే ఖాన్విల్కర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సరికొత్త న్యాయతాత్వికత ఆయనొక్కడిదే కాదు. నేటి సుప్రీం కోర్టు అవగాహన లేదా అభిప్రాయం కూడా అదే అనిపిస్తోంది. (బహశా ప్రధాన న్యాయమూర్తులు మారినా ఇటువంటి కేసులు మాత్రం ఖాన్విల్కర్‌ ధర్మాసనానికే కేటాయిస్తూ రావటం వెనక ఉన్న కారణం ఇదే అయి ఉంటుంది)
ఏమిటి ఈ నూతన న్యాయతాత్వికత? విదేశీ నిధుల స్వీకరణ నియంత్రణ చట్టంపై ఖాన్విల్కర్‌ ఇచ్చిన తీర్పును విశ్లేషిస్తూ నేను పెరూ అధ్యక్షుడు ఆస్కార్‌ ఆర్‌ బెనెవైడ్స్‌ చెప్పిన ‘‘నా మిత్రులకోసం దేనికైనా సిద్ధం కానీ నా శతృవుల విషయానికి వస్తే చట్టమే వారికి సమాధానం’’ మాటను ప్రస్తావించాను. రాజ్యాంగ విషయాల్లో ఖాన్విల్కర్‌ ఇచ్చిన తీర్పులన్నింటిలోనూ ఓ ఉమ్మడి అంశం కనిపిస్తుంది. ‘‘రాజ్యం ఏమి చేసినా ఓకే కానీ వ్యక్తులు మాత్రం చట్టానికి లోబడి ఉండాలి’’ అన్న వ్యాఖ్యానం కనిపిస్తుంది. ఈయన రాసిన తీర్పులన్నీ సుప్రీం కోర్టును కార్యనిర్వాహకవర్గం మార్చటమే కాక కార్యనిర్వాహకవర్గపు న్యాయస్థానంగా కూడా మారుస్తోంది.
దిగువన చర్చించే వివిధ తీర్పులతో నేను ఏ మాత్రం ఏకీభవించటం లేదని మాత్రం చెప్పదల్చుకున్నాను. ఆయా తీర్పులు వెలువడినప్పుడు కూడా వాటిని విమర్శించాను. కేసులో నేను అనేకమంది లాగానే ఓడిపోయిన కక్షిదారుని పక్షానే వాదిస్తూ ఉంటాను. అయితే నేను కేవలం ఇచ్చిన తీర్పుతో విబేధించాలి కాబట్టి వాదించటం లేదు. ఈ తీర్పులు న్యాయమూర్తిగా ఖాన్విల్కర్‌ పదవీకాలానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను ముందుకు తెస్తాయి. అందువల్లనే ఈ చర్చ అవసరం అని భావిస్తున్నాను. ఈ విశ్లేషణాత్మక విమర్శను ఆ కోణంలోనే చూడాలని కోరుతున్నాను.
వటాలి : వ్యక్తిగత స్వేఛ్చకు పిడుగుపాటు
సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఖాన్విల్కర్‌ పదవీకాలాన్ని విశ్లేషించాలంటే నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్నీ వర్సెస్‌ జహూర్‌ అహ్మద్‌ షా వటాలి కేసుతోనే మొదలు పెట్టాలి. ఈ కేసులో ఖాన్విల్కర్‌ 2019లో తీర్పు ఇచ్చారు. ఊపా చట్టంలో సెక్షన్‌ 43(డి)(5)ని ఎలా వ్యాఖ్యానించాలన్న అంశాన్ని ఈ తీర్పులో ఖాన్విల్కర్‌ చర్చిస్తారు. ఊపా అంటే ఇప్పటి వరకూ భారతదేశంలో అమల్లో ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టాల సమాహారంగా చెప్పుకోవాలి. అంటే ఇప్పటి వరకూ వివిధ చట్టాల్లో ఉన్న కీలకమైన అధికారాలు ఈ తాజా చట్టం రూపంలో కుదించబడ్డాయి. ‘‘(న్యాయస్థానం) సదరు ముద్దాయి మీద దర్యాప్తు సంస్థలు న్యాయస్థానానికి సమర్పించిన కేసు డైరీ లేదా నివేదికల ఆధారంగా ముద్దాయికి బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని, బెయిల్‌ తిరస్కరించటానికి కావల్సిన ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని భావిస్తే బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించవచచ్చు.’’ అని చెప్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసులు ఇచ్చిన రికార్డుల వరకే పరిశీలించి ఆయా రికార్డులు సమంజసమైనవేనని భావిస్తే (ముద్దాయి వాదన వినకుండానే) బెయిల్‌ తిరస్కరించే అధికారాన్ని న్యాయస్థానానికి కట్టబెడుతోంది.

ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టు ఉపా చట్టంలోని 43 (డి) (5) ప్రకారం వటాలికి బెయిల్‌ మంజూరు చేసింది. ‘‘తీవ్రమైన ఆరోపణలకు సంబంధించిన నేరాలు, అందులోని నిందితులు బెయిల్‌ కోసం కోర్టుకు వస్తే ట్రయల్‌ కోర్టు ఆయా ఆరోపణలపై ఉన్న సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలిస్తుంది’’ అన్న అవగాహనతో ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నేషనల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ ఇచ్చిన సమాచారం, ప్రకటనల ఆధారంగానే న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది తప్ప న్యాయస్థానం ప్రభుత్వం తరఫున పని చేసే పోస్టాఫీసు కాదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ప్రమాణానికి అనుగుణంగా ఢిల్లీ హైకోర్టు వటాలి ఉగ్రవాద చర్యల్లో పాల్గొన్నారు అన్న పోలీసు వాదనను లోతుగా పరిశీలించింది. సాక్ష్యుల వాంగ్మూలాలు అంటూ ఏజెన్సీ న్యాయస్థానం ముందు సమర్పించిన అనేక వాంగ్మూలాలు ఏవిడెన్స్‌ చట్టం కింద అనుమతించరానివని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడిరది. నిందితుడు జారీ చేసిన పత్రాలు అని కోర్టు ముందుకు తీసుకురాబడిన పత్రాలు వటాలీ పని చేసే సంస్థ లెటర్‌హెడ్‌ల మీద కానీ, ఆయన సంతకంతో కానీ లేవని గుర్తించింది. ఇతర పత్రాలన్నీ ఆయన కాశ్మీరీ వ్యాపారవేత్తగా చూపించేవే. ఇవన్నీ పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు పోలీసువాదనల్లో నేలమీద నిలబడగలిగింది కాదనీ, వటాలికి బెయిల్‌ తిరస్కరించటానికి తగిన కారణాలు లేవనీ భావించింది.

ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ నేషనల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన ఖాన్విల్కర్‌ ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టేశారు. వటాలి తిరిగి జైలుకు వెళ్లారు. మరో మూడేళ్ల పాటు ఈ కేసులో వటాలి విచారణను ఎదుర్కొంటూనే ఉన్నారు. చివరకు ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న వటాలిని ఫిబ్రవరి 22న గృహనిర్భంధానికి పంపాలని నిర్ణయించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఢిల్లీ హైకోర్టు సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించనందువలన ఆయన ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కొట్టేశారనుకుంటే పొరపాటు. ఆయన మాటల్లో ఢిల్లీ హైకోర్టు తప్పుడు న్యాయ ప్రమాణాలు పాటించిందన్న కారణాన్ని చూపించి బెయిల్‌ రద్దు చేశారు. ఉపా చట్టం కింద న్యాయస్థానం పోషించే పాత్రను పోస్టాఫీసుతో పోల్చటాన్ని తప్పు పడుతూ బెయిల్‌ రద్దు చేశారు.
అంతేకాదు, ‘‘ బెయిల్‌ పిటిషన్‌ విచారిస్తున్నప్పుడు సాక్ష్యాధారాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం లేదు’’ అని కూడా ఖాన్విల్కర్‌ వ్యాఖ్యానించారు. బెయిల్‌ పిటిషన్‌ విచారణ స్థాయిలోనే సాక్ష్యాధారాలు కోర్టు పరిశీలనకు అర్హమైనవా లేదా అన్నది నిర్ధారించటం అంటే కేసులో ఉన్న బలాబలాలను చర్చకు చేపట్టడమే అవుతుందని కూడా ఖాన్విల్కర్‌ అభిప్రాయపడ్డారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే న్యాయస్థానం ఓ స్థూల అభిప్రాయానికి రావాలని ఆయన ఉపదేశించారు.

వటాలి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అందువల్ల మళ్లీ ఆ విమర్శల్లో వెల్లడైన అంశాల జోలికి పోవడటం లేదు. కానీ ఆ తీర్పు ప్రభావం, పర్యవసానం ఎలా ఉందో ఓ సారి గుర్తు చేసుకోవటం అవసరం. బెయిల్‌ విచారణ సమయంలో ముద్దాయి తమ పూర్తి సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టలేరు. ప్రభుత్వం వద్ద ఉన్నన్ని వనరులు రిమాండ్‌లో ఉన్న ఖైదీ వద్ద ఉండవు. ప్రాసెక్యూషన్‌ ప్రవేశపెట్టే సాక్ష్యులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయటం కుదరదు. కాబట్టి ప్రభుత్వ వాదనలన్నింటికీ సందేహానికి తావులేని రీతిలో సమాధానమివ్వటం సాధ్యం కాదు. ఈ వివరాలు, విషయాలన్నీ పూర్తి స్థాయి విచారణ సమయంలోనే చర్చకు వస్తాయి. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నప్పుడు న్యాయస్థానం ప్రధానంగా ‘‘ ఆరోపణలు మౌలికంగా వాస్తవమైనవా కాదా’’ అన్న అంశాన్నే చూడాలి. ముద్దాయి తరఫు న్యాయవాదులు కూడా ఇంతవరకే వాదించగలగుతారు. ప్రభుత్వ వాదనల్లో ఏమైనా పొసగని విషయాలు, సందేహాస్పదమైన కారణాలు, పరిస్థితులు వంటివి ఉన్నాయా అన్నది న్యాయస్థానం పరిశీలించాలి. బెయిల్‌ తిరస్కరించటానికి ప్రభుత్వం ముందుకు తెస్తున్న వాదనలు, సాక్ష్యాలు, తర్కం పూర్తి స్థాయి విచారణ సమయంలో న్యాయస్థానం రికార్డుల్లోకి ఎక్కగలిగినదేనా (అడ్మిజబుల్‌) కాదా అన్నది కూడా న్యాయస్థానం పరిశీలించాలి. తద్వారానే న్యాయస్థానం ఆరోపణల వాస్తవాస్తవాలపై ప్రాధమిక అంచనాకు రాగలదు.

బెయిల్‌ పిటిషన్లను విచారిస్తున్న న్యాయస్థానాలు అసలు ప్రభుత్వం ముందుకు తెచ్చే సాక్ష్యాధారాలను పరిశీలించాల్సిన అవసరమే లేదని ఖాన్విల్కర్‌ తీర్మానించిన తర్వాత ఉపా చట్టంలో నిందితులకు బెయిల్‌ దొరకటం దాదాపుగా అసాధ్యమైపోయింది. అభినవ్‌ శేఖర్‌ ఈ పరిణామంపై వ్యాఖ్యానిస్తూ ‘‘ న్యాయమూర్తి తీసుకున్న వైఖరి కారణంగా విచారణ జరుగుతున్న కాలమంతా నిందితుడు జైల్లోనే జీవితాన్ని వెళ్లబుచ్చాల్సిన పరిస్థితికి నెట్టబడతాడు’’ అన్నారు.

ఉపా చట్టం విషయంలో అధికార వ్యవస్థ తీరుతెన్నులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. దేశంలో ఉపా చట్టం కింద నమోదైన కేసుల్లో విచారణ పూర్తి కావటానికి ఏళ్లు గడుస్తుంది. బెయిల్‌ తిరస్కరించాలంటే పోలీసులు నమోదు చేసే కేసు ఏదైనా సరే చివర్లో ఉపా చట్టాన్ని కూడా ప్రస్తావిస్తే సరిపోతుంది. కనీసం విచారణకు కూడా నోచుకోకుండా ముద్దాయిలు దశాబ్దాలపాటు జైళ్లల్లో మగ్గిపోవాల్సి వస్తుంది. ఛార్జిషీటు కానీ ప్రభుత్వం న్యాయస్థానం ముందుంచే సమాచారం, ఆధారాలు అర్థవంతంగానో, లేక తర్కబద్ధంగానో ఉండాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అటువంటి (ఉమర్‌ ఖాలిద్‌ విషయంలో జరిగినట్లు) ప్రభుత్వం ఏ మాత్రం న్యాయప్రమాణాల ప్రకారం అడ్మిట్‌ చేసుకోలేని సాక్ష్యాలను ముందుకు తెచ్చినా బెయిల్‌ తిరస్కరించవచ్చు. ఈ విషయాలు పరిశీలిస్తే వటాలి కేసులో ఖాన్విల్కర్‌ ఇచ్చిన తీర్పు న్యాయస్థానాలను ప్రాసెక్యూషన్‌ చెప్పే నోట్సు రాసుకునే స్టెనోగ్రాఫర్ల స్థాయికి దించేసింది. ముద్దాయిల తరఫు న్యాయవాదుల మీద మోయలేని భారాన్ని మోపుతోంది. ఖాన్విల్కర్‌ తీర్పుతో ముద్దాయి తరపు న్యాయవాదుల పీకల్లోతు ఊబిలో కూరుకుని ఈదటమా లేక మునగటమా అన్న డైలమాకు లోనవ్వాల్సిన పరిస్థితులు తెచ్చి పెట్టింది.

ఈ పరిస్థితుల్లో 2019లో వచ్చిన ఈ తీర్పు గురించి విశ్లేషిస్లూ శేఖ్రి ‘‘ముందు ముందు ముద్దాయిల పరిస్థితి భయానకంగా మారనుంది. ఈ తీర్పు తర్వాత అయినదానికీ కానిదానికీ ఉపా చట్టాన్ని శాంతిభధ్రతల యంత్రాంగం తడికగా వాడుకోవటానికి ఉత్సాహం చూపుతుంది.’’ అని చేసిన హెచ్చరికలు ఈ కాలంలో అక్షర సత్యాలుగా మారాయి. వర్తమాన భారతంలో రాజకీయ అణచివేతకు ఉపా చట్టం కీలకమైన సాధనంగా మారింది. విచారణ లేకుండా దీర్ఘకాలం జనాన్ని జైల్లో పెట్టటానికి ఒకటో అరో తప్ప దాదాపు అన్ని న్యాయస్థానలూ వటాలీ కేసులో ఖాన్విల్కర్‌ ఇచ్చిన తీర్పునే పునాదిగా పరిగణిస్తున్నాయి.

మూలం: గౌతం భాటియా, ఆక్స్‌ఫర్డ్‌ స్కాలర్‌
అనువాదం : కొండూరి వీరయ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here