గుజరాత్ నరమేథం గురించి జకియా జాఫ్రి పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించటం అంటే ఎవరైనా కక్షిదారు న్యాయస్థానం తలుపు తట్టి తాను పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలు నిరూపించలేకపోతే ఫిర్యాదుదారుకు మూడిరదని చెప్పినట్లేనని ప్రముఖ సీనియర్ కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకుర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ది వైర్లో మదన్ లోకూర్ ఇచ్చిన ఇంటర్వ్వూ పూర్తి పాఠం.
కరణ్ థాఫర్ : తీస్తా సెతల్వాడ్ కేసులో ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు తీవ్రమైన పొరపాటు చేసిందా? ఈ తీర్పు ఫిర్యాదుదారుని ముద్దాయిగా మార్చిందా? గుజరాత్ లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గురించి 2004లో స్వయంగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను మర్చిపోయిందా? ప్రముఖ న్యాయమూర్తి మదన్ లోకూర్‌ను అడగబోతున్న మూడు కీలకమైన ప్రశ్నలు.
ఈ రోజు ప్రధానంగా సుప్రీం కోర్టు తీస్తా సెతల్వాడ్ కేసులో ఇచ్చిన తీర్పు గురించి ప్రశ్నించబోతున్నాను. ఫిర్యాదుదారు ఉద్దేశ్యపూర్వకంగా సెన్సేషన్ సృష్టించటం కోసం కేసులు వేశారని ఆరోపిస్తూ సుప్రీం కోర్టు ‘‘నిజానికి ఈ విధంగా వ్యవస్థలతో చెలగాటమాడిన వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది’’ అని ప్రకటించింది.
ఓ మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఈ వాక్యాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు?
మదన్ లోకూర్ : ఇది దురదృష్టకర పరిణామం. ఏ కేసునైనా కొట్టేస్తున్నప్పుడు ఇటుంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమే లేదు. ప్రస్తుత సందర్భంలో సుప్రీం కోర్టు జకియా జాఫ్రి వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ కేసు కొట్టేస్తున్నాము, కానీ తప్పుడు సమాచారంతో వచ్చినందుకు మీపై కేసు నమోదు చేయనున్నామని చెప్పాల్సిన అవసరం ఏమిటి? నిజానికి ఏటా వివిధ కోర్టులు వేల కేసులు కొట్టేస్తుంటాయి. అటువంటప్పుడు ఆ వేలాదిమందిని అరెస్టు చేసి విచారణ చేయాలని న్యాయస్థానం ఆదేశిస్తుందా?
మరి పోలీసులు దాఖలు చేసిన తప్పుడు కేసుల సంగతేమిటి? అటువంటి తప్పడు కేసులు వేసినందుకు పోలీసు వ్యవస్థను బోనులో నిలబెట్టాలని న్యాయస్థానం ఆదేశిస్తుందా? ఈ విషయాలు పరిశీలించినప్పుడు తీస్తా విషయంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు పూర్తిగా సందర్భరహితమైనవి. దురదృష్టకరమైనవి.
కరణ్ థాఫర్ : మీరు ది వైర్లో రాసిన వ్యాసంలో ‘ఒక వేళ నిజంగానే తీస్తాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు భావించి ఉంటే ఆ దేవుడే ఆమెను కాపాడాలి’ అని రాశారు. పరిస్థితి అంత తీవ్రంగా ఉందా?
లోకూర్ : అవును. అంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకవేళ ఎవరన్నా కోర్టులో కేసు వేసి గెలవలేకపోతే వాళ్లకు సమసస్యలు మొదలవుతాయి. ఆ విషయం జాగ్రత్తగా పరిశీలించాలి.
కరణ్ థాపర్ : అంటే ఎవరైనా కోర్టులో కేసు వేసి ఆ కేసులో గెలవలేకపోతే వాళ్లను అరెస్టు చేసి విచారణ మొదలు పెడతారు. అటువంటి వాళ్లకు ఇక ఆ దేవుడే దిక్కు అనేనా మీరు చెప్పేది?
లోకూర్ : అంతే.
థాపర్ : మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఒక వేళ తీస్తాను అరెస్టు చేయాలన్నది న్యాయస్థానం ఉద్దేశ్యం కాకపోతే ఆ మేరకు ఓ వివరణ ఇవ్వాలని కూడా సూచించారు. తీస్తాను బేషరతుగా విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని కూడా ప్రతిపాదించారు. ఆమెను అరెస్టు చేసి మూడు రోజులైంది. కానీ కోర్టు నోరు విప్పలేదు. ఈ నిశ్శబ్దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
లోకూర్ : కోర్టుకు శెలవులు కాబట్టి గౌరవ న్యాయమూర్తులు ఎక్కడున్నారో తెలీదు. ఎక్కడున్నా సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చు. తీస్తాను అరెస్టు చేసి అహ్మదాబాద్‌కు తీసుకెళ్లాలన్నది మా ఉద్దేశ్యం కాదు అని సెక్రటరీ జనరల్ ద్వారా కూడా వివరణ ఇవ్వవచ్చు.
వారు ఆ పని చేసి ఉండాల్సింది. ఒకవేళ వాళ్లే ఢల్లీిలో ఉంటే ఓ ప్రత్యేక సమావేశం జరిపి ఇటువంటి వివరణ జారీ చేసి ఉండాల్సింది.
థాపర్ : ఒకవేళ వాళ్లు ఆ పని చేయకపోతే మీ స్పందన ఎలా ఉండబోతుంది?
లోకూర్ : ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేయగలను. అంతకన్నా ఏమి చేయగలను?
థాపర్ : నిర్వేదానికి లోనుకావటం కూడానా ?
లోకూర్ : అవును. ఓ మేరకు.
థాపర్ : అంటే మంచి గుర్తింపు వ్యక్తిత్వం కలిగిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి తన సహచర న్యాయమూర్తుల చర్యలతో నిర్వేదానికి లోనవుతున్నారని చెప్పవచ్చా?
లోకూర్ : తప్పకుండా. నా నిర్వేదానికి కారణం ఈ తీర్పు ఒక్కటే కాదు. గత కొంతకాలం నుండీ జరుగుతున్న పరిణామాలు కూడా దానికి తోడవుతున్నాయి. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలన్నీ ఈ తీర్పు రూపంలో ఓ కొలిక్కి వచ్చాయి. సుప్రీం కోర్టు స్పందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ స్పందించని సందర్భాలు గతంలో కూడా అనేకం ఉన్నాయి. కానీ ఈ విషయంలో సుప్రీం కోర్టు స్పందించి ఉండకూడదు. కానీ స్పందించింది. అసలేమి జరుగుతుందో తెలీడం లేదు.
థాపర్ : అంటే గతంలో సుప్రీం కోర్టు స్పందించాల్సిన అనేక సందర్భాలు వచ్చినప్పటికీ స్పందించలేదు, స్పందించాల్సిన అవసరం లేని విషయంలో స్పందించింది. అంటే మీ నిర్వేదానికి అనేక కారణాలున్నాయన్నమాట. ఇదొక్కటే కాదు.
లోకూర్ : అవును. ఇదొక్కటే కాదు. హెబియస్ కార్పస్, ఎన్నికల బాండ్లు వంటి అనేక కేసులు పెండిరగ్లో ఉన్నాయి. వాటిని విచారణకు ఎందుకు చేపట్టడం లేదు? హెబియస్ కార్పస్ కేసుల్లో జనం జైళ్లలో మగ్గుతున్నారు. కస్టడీలో ఉన్నారు. అటువంటి కేసులకు ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది.
థాపర్ : ఈ విషయాల గురించి గతంలో కూడా అనేకసార్లు రాశారు. అనేక ఇంటర్వ్యూల్లో చర్చించారు. ఈ విషయాల పట్ల మీరు చాలా స్పష్టంగా ఉన్నారు. మీరు లేవనెత్తిన విషయాల గురించి కనీసం సుప్రీం కోర్టు నుండి ఒక్కరన్నా మీతో వ్యక్తిగతంగా మాట్లాడి పరిస్థితిని వివరించే ప్రయత్నం జరిగిందా? పూర్తి నిశ్శబ్దమేనా?
లోకూర్ : నాతో ఎవరూ మాట్లాడలేదు. మిగిలిన వాళ్లతో ఏమన్నా మాట్లాడారా లేదా నాకు తెలీదు. నాతో అయితే ఏమీ చర్చించలేదు.
థాపర్ : తీస్తా సెతల్వాడ్ తీర్పు అని పిలుస్తున్నాను. ఈ తీర్పు ఫిర్యాదు చేసిన వాళ్లనే ముద్దాయిలుగా మార్చింది. పరిణామాన్ని గమనిస్తుంటే ఏదైనా ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికనో లేక ప్రభుత్వ నిర్ణయాన్నే ప్రశ్నించే స్వేఛ్చ భారతీయులకు లేదనిపిస్తోంది. ఇది చాలా ఆందోళనకరమైన పరిణామం. అవునా?
లోకూర్ : అవును. క్రిమినల్ కేసుల్లో ఆయా సందర్భాలు, అవసరాన్ని బట్టి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించటం జరుగుతుంది. సివిల్ కేసుల్లో కమిటీలను నియమిస్తారు. ఆయా విచారణ కమిటీలు, దర్యాప్తు బృందాలు చెప్పిందే చివరి మాటగా భావించేట్లయితే మరి న్యాయస్థానాలు ఎందుకు? ఆయా సందర్భాన్ని బట్టి అంశాన్ని నిపుణుల కమిటీకో, మాజీ న్యాయమూర్తుల బృందానికో లేక కమిటీ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందానికో పంపుతున్నామంటే సరిపోతుంది.
థాపర్ : మీరు చెప్పు విషయం వెనుక మరింత లోతైన అంశాలున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారణలను న్యాయమూర్తులు ప్రశ్నించలేకపోతే ఆ న్యాయమూర్తులు తమ విధిని సక్రమంగా నిర్వర్తించటం లేదనుకోవాలి అన్న అర్థం వస్తుంది మీ మాటల్లో. ఎందుకంటే ఏ నివేదికమీదనైనా ప్రశ్నలు వస్తాయి. వాటికి సమాధానాలు వెతకాలి. ఇక్కడ మరీ దురదృష్టకరమైనదేమిటంటే ప్రశ్నలు వేసినందుకే ప్రజలను శిక్షించటం అంటే న్యాయమూర్తులు తమ విధిని సక్రమంగా నిర్వర్తించటం లేదనే.
లోకూర్ : అవును. మీరు ఆ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారణలు అయినా, కమిటీ నిర్ధారణలు అయినా ఆయా నిర్ధారణలు ఎల్లప్పుడూ సరైన నిర్ధారణలే కానక్కర్లేదు. అన్ని సందర్భాల్లోనూ సత్యాలను వెలుగులోకి తెస్తాయని కూడా భావించాల్సిన అవసరం లేదు. అటువంటి నివేదికల వలన తమకు నష్టం కలిగిందని భావించిన వాళ్లు ఆయా నివేదికల్లోని నిర్ధారణలను ప్రశ్నించవచ్చు.
అనేక సందర్భాల్లో సుప్రీం కోర్టే స్వయంగా ‘‘ మేము సుప్రీం కావచ్చు కానీ మాకు తిరుగులేదు అనుకోకూడదు’’ అని ప్రకటించింది. అటువంటప్పుడు ఓ కమీషన్ లేదా దర్యాప్తు బృందం నివేదికలే తుది పలుకులు అని ఎందుకు అనుకోవాలి? అటువంటి అవగాహన పూర్తిగా తప్పుడు అవగాహన.
థాపర్ : సుప్రీం కోర్టు తీర్పులో ‘‘ఈ క్రమంలో నిమగ్నమైన ప్రతి వ్యవస్థనూ వ్యక్తినీ ప్రశ్నించేందుకు సాహసించారు’’ అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ భాష గమనిస్తే సాధారణ పౌరులు ఎవరైనా ప్రభుత్వం లేదా అధికారంలో ఉన్న వాళ్లను ప్రశ్నిస్తే అది సాహసమే అవుతుందా?
లోకూర్ : దురదృష్టవశాత్తూ సుప్రీం కోర్టు ప్రయోగించిన భాష కటువుగానే ఉంది. అటువంటి భాష ప్రయోగించకూడదు. మరీ ముఖ్యంగా క్రిమినల్ కేసుల విషయంలో ఇటువంటి భాష ఉపయోగించటం ఆచరణీయం కాదు. ఎందుకంటే అప్పటి వకే కక్షిదారుడు అనేక ఇబ్బందులను ఎదుర్కుని ఉంటాడు. మనం చర్చించుకుంటున్న కేసులో జకియా జాఫ్రి అంంతులేని దు:ఖాన్ని అనుభవించి ఉన్నారు. అంత బాధలకు దు:ఖానికి లోనైన వ్యక్తి దర్యాప్తు బృందం నివేదికను తప్పు పట్టేందుకు సాహసించిందని వ్యాఖ్యానించటం సరైనది కాదు.
థాపర్ : భాష కటువుదనాన్ని అలా ఉంచుదాం. ‘దర్యాప్తు బృందం నివేదికనే సవాలు చేసేందుకు సాహసిస్తారా’ అన్నది కీలకమైన వాక్యం. అంటే అప్పటికే పిటిషర్ వాదనకు భిన్నంగా దర్యాప్తు బృందం నిర్ధారణలు తిరుగులేనివని పిటిషనర్‌కు వ్యతిరేకంగా న్యాయస్థానం ఓ అంచనాకు వచ్చినట్టుంది. అంటే ఇక్కడ ప్రయోగించిన భాష ముందస్తుగా ఏర్పరుచుకున్న అభిప్రాయానికి సంబంధించినదే తప్ప కటువుదనం గురించిన చర్చ కాదు.
లోకూర్ : సరే. ఈ విషయంలో జడ్డిలకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వటానికి సిద్ధమయ్యాను. మీరు చూసిన కోణం కూడా ‘అటువంటి వారిని బోనులో నిలబెట్టండి’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించటానికి దారితీసి ఉండొచ్చు.
థాపర్ : మరింత లోతుగా చూద్దాం. న్యాయమూర్తులు ‘‘రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఓ భాగం లేదా కొందరు అధికారుల నిష్క్రియాపరత్వం రాష్ట్ర ప్రభుత్వపు లోతైన కుట్ర ఫలితమే అని వాదించటానికి ఆధారం కాకూడదు. లేదా అల్పసంఖ్యాకవర్గాలకు వ్యతిరేకంగా రాజ్యం ప్రేరేపిత నరమేధం అన్న నిర్ధారణకు రాలేము. ఈ మాట అన్నంత మాత్రాన ప్రభుత్వ యంత్రాంగంలో ఓ భాగం తమ విధులు నిర్వర్తించకపోవటానికి వారి అసమర్థత, చేతగానితనానికి బదులు ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి నుండి అందిన ఆదేశాలే కారణమని కూడా భావించలేము.’’ అనేక సందర్భాల్లో పాలకవర్గం కనుసైగతో అధికార యంత్రాంగాన్ని తప్పుకొమ్మని చెప్పటాన్ని కూడా మనం గమనించవచ్చు.
లోకూర్ : అలా జరగటానికి అవకాశం ఉంది. మనం చర్చించుకుంటున్న కేసులో భాగంగా ఈ వాదన సుప్రీం కోర్టు ముందు ఉంచారా లేదా అన్నది నాకు తెలీదు. కానీ మీ వాదన సరైనదే. ఏ పని అయినా చేయాలని లేదా చేయొద్దని అధికారులకు, పోలీసులకు ఆదేశం ఇచ్చే అవకాశం ఉంది. అలా జరిగే అవకాశం ఉంది. అయితే సుప్రీం కోర్టులో ఈ వాదన వినిపించారా లేదా అన్నది తెలీదు. తీర్పులో మాత్రం దీనికి సంబంధించి సూచన ఏమీ లేదు.
ప్రభుత్వ యంత్రాంగంలో ఓ విభాగం తమ కర్తవ్య నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారన్నది స్పష్టమవుతోంది.అయితే దానికి మొత్తం యంత్రాంగాన్ని బాధ్యులను చేయలేము.
థాపర్ : తీస్తా పై దాఖలైన ఎఫ్ఐఆర్లో 2002 జనవరి 1వ తేదీ నుండి 2022 జూన్ 15వ తేదీ మధ్య కాలంలో జరిగిన పరిణామాలను కవర్ చేసేలా ఉంది. అంటే గోధ్రా రైలు దహన కాండ మొదలు గత 20 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలన్నింటిలోనూ తీస్తా పాత్ర గురించి దర్యాప్తు చేయనున్నారా?
లోకూర్ : అది జూన్ 15 లేక జూన్ 25 ఆ ?
థాపర్ : ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం జూన్ 15. బహుశా జూన్ 25 కూడా అయి ఉండొచ్చు.
లోకూర్ : జూన్ 15 అయితే అది చాలా కీలకమైన అంశం. జూన్ 25కూ జూన్ 15 కూ మధ్య చాలా తేడా ఉంది. జూన్ 15 వరకూ జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేయటం అంటే జూన్ చివరి వారంలో సుప్రీం కోర్టు ఇవ్వబోయే తీర్పు గురించి గుజరాత్ పోలీసులకు ముందస్తు అవగాహన ఉందన్న మాట. అంతేకాదు. జూన్ 15 నాటికే తీస్తా పై కేసు నమోదు కాబోతోందనీ, దర్యాప్తు చేయబోతున్నామనీ గుజరాత్ పోలీసులకు ముందే తెలుసన్నమాట. ఇది అత్యంత తీవ్రంగా పరిశీలించాల్సిన అంశం. ఇదిలా ఉంచితే 20 ఏళ్లకాలంలో జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేయటం, నేరారోపణ చేయటం ఖచ్చితంగా కక్షపూరితమైనదే.
తీస్తా గతం ఏమిటో దర్యాప్తు చేయమని సుప్రీం కోర్టు చెప్పలేదు. అలాంటి ఆదేశం ఇచ్చే ఉద్దేశ్యం సుప్రీం కోర్టుకు లేదని కూడా తీర్పు పాఠం చదివితే అర్థమవుతుంది. దాంతో పాటే ఎఫ్ఐఆర్లో ఎక్కడో ఓ చోట తీస్తాకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయి, వాటిని ఎలా వినియోగించారు అన్నది కూడా దర్యాప్తు చేయనున్నామని చెప్పారు. ఇది ఖచ్చితంగా సహజంగా జరిగిన నేరాన్ని దర్యాప్తు చేసే విధానం కాదు. ప్రేరేపిత నేర నిరూపణ ప్రయత్నమే.
థాపర్ : జస్టిస్ లోకూర్, మీ సమాధానంలో కాస్తంత ఆందోళన కలిగించే అంశం మరోటి ఉంది. ఇదే నేరారోపణ అయితే సుప్రీం కోర్టు తీర్పులో ఏమి చెప్పనున్నదో గుజరాత్ పోలీసులకు ముందుగానే వినికిడి లేదా సమాచారం ఉందా అన్నది కలవరపెడుతున్న సమస్య. ఒకవేళ అలానే జరిగి ఉంటే, జూన్ 15కు ముందే తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టు చేయబోతున్నామని తెలుసుకుందంటే అది చాలా ఆందోళనకరమైన పరిణామం.
అంటే సుప్రీం కోర్టు వెలువరించే తీర్పులో ఏముండబోతోందో కొద్దిమంది పోలీసు అధికారులకు ముందే తెలిసిందంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తుల హోదాకు, క్రమశిక్షణకు వన్నె తెచ్చే పరిణామం కాదు.
లోకూర్ : అవును. సుప్రీం కోర్టు నుండి ముందే సమాచారం వెళ్లింది అనేకంటే గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాదులు తెలివితేటలతో ఈ విషయాన్ని పసికట్టారని భావించవచ్చు. వాళ్లే మీరు సిద్ధంగా ఉండండి, తీస్తాను బోనులో పెట్టాల్సి ఉంటుందని గుజరాత్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండొచ్చు.
గుజరాత్ ప్రభుత్వ పక్ష న్యాయవాదులు ఈ మాత్రం అంచనా వేయగలిగారంటే విచారణ సమయంలో న్యాయమూర్తులు స్పందనే దానికి ఆధారంగా ఉండి ఉండాలి. ఆయా సందర్భాల్లో న్యాయమూర్తులు జోక్యం తీరును గమనించినప్పుడు తీర్పు ఎలా ఉండనుందో తెలివైన న్యాయవాదికి అవగతమవుతుంది. తమ వాదన నెగ్గబోతోందని కూడా ఆ పక్షం న్యాయవాదులు అభిప్రాయపడే అవకాశం ఉంది. దర్యాప్తు బృందం నివేదికను సుప్రీం కోర్టు ఖరారు చేయనున్నదన్న అంచనాకు ఆ పక్షం న్యాయవాదులు వచ్చారు. ఆ మేరకే వారు గుజరాత్ పోలీసులకు ఉప్పందించి ఉంటారు.
తీర్పు ఆ మార్గంలో ఉండబోతే మేము ఇలా చేయబోతున్నామని పోలీసులు నిర్ణయించుకున్నారు. బహుశా పరిణామాలు ఇలా జరిగి ఉండొచ్చు. నాకు తెలీదు. ఇదంతా నా అంచనా అనుమానం మాత్రమే.
థాపర్ : ఇదంతా వినటానికి వీక్షకులకు కూడా ఇబ్బందిగా ఉంది. ఈ తీర్పుపై వచ్చిన కొన్ని వ్యాఖ్యలను ఇక్కడ ప్రస్తావిస్తాను. ఆక్స్ఫర్డ్ సాల్కర్, రాజ్యాంగ నిపుణుడు గౌతం భాటియా మాటల్లో ‘‘అంతర్జాతీయ న్యాయసూత్రాలకు భారతదేశ సుప్రీం కోర్టు కొత్త కోణాన్ని అందించింది. అదేమిటంటే వ్యక్తి హక్కులకు, రాజ్యపు అధికారానికి మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తిని అరెస్టు చేయమని సుప్రీం కోర్టు ఆదేశించింది. భళా….ఎంతటి రాజ్యాంగ సృజనాత్మకత’’. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా గౌతం భాటియా వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటి?
లోకూర్ : ఏ దేశంలోని రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే న్యాయస్థానమైనా ఫలానా వ్యక్తిని అరెస్టు చేయమని ఆదేశించదు. అరెస్టులు చేయటం పోలీసుల కర్తవ్యం. అరెస్టు చేయాలా వద్దా అన్నది నిర్ణయించుకోవల్సింది పోలీసులే. ఒకవేళ పోలీసులు ఫలానా వ్యక్తిని అరెస్టు చేయాలనుకుంటే పోలీసులు కోర్టుకు వస్తారు. సదరు వ్యక్తికి బెయిల్ మంజూరు చేయాలా లేదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. ఇంతవరకూ కోర్టు ధిక్కారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయమని చెప్పాల్సి వచ్చినప్పుడు ఫలానా వ్యక్తిని ఫలానా నెల ఫలానా తేదీ నుండి ఇంత కాలానికి ఖైదు చేయమని ఆదేశిస్తుంది. అప్పుడు పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు.
థాపర్ : ఈ ప్రత్యేక సందర్భంలో కోర్టు విస్పష్టంగా ‘‘అటువంటి వారినందరినీ బోనులో నిలబెట్టాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని చెప్పింది. అంటే తేలికపాటి భాషలో చెప్పుకోవాలంటే, ‘‘వాళ్లను అరెస్టు చేయండి, మా ముందు నిలబెట్టండి’’ అని చెప్పటమేగా?
లోకూర్ : నేను రాసింది కూడా అదే. ఆమెను అరెస్టు చేయాలన్నది సుప్రీం కోర్టు నిర్ణయమా? ఆమెను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు సూచించిందా? వ్యక్తీకరణ ఏదైనా, ఆదేశించినా, సూచించినా, అన్యాపదేశంగా చెప్పినా ఇది తప్పు. అందులో నాకేమీ సందేహం లేదు.
థాపర్ : ఒకవేళ ఆమెను అరెస్టు చేయాలన్నది సుప్రీం కోర్టు ఉద్దేశ్యం కాకపోతే తక్షణమే ఆమెను బేషరతుగా విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించాలని మీరు ఇంటర్వ్యూ ప్రారంభంలో చెప్పారు. కనీసం న్యాయమూర్తులు శెలవుల్లో ఉంటే తగిన వివరణ జారీ చేసేలా సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్‌కు ఆ మేరకు ఆదేశాలైనా జారీ చేయవచ్చని కూడా మీరన్నారు. అలా జరగకపోవటం పట్ల మీరు నిరాశ చెందారు.
లోకూర్ : అవును. అవును. అవును.
థాపర్ : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏమి చెప్పిందో చూద్దాం. మానవ హక్కులు, వ్యక్తిగత స్వేఛ్చా స్వాతంత్య్రాల కోసం పని చేస్తున్న ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వేతర సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ‘‘మానవ హక్కుల ఉల్లంఘలనలకు పాల్పడుతున్న పాలకులను ప్రశ్నించలేనితనమే మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాడ్ అరెస్టుకు దారితీసింది. పౌర సమాజపు వెన్నులో వణుకు పుట్టించే చర్య ఇది. దేశంలో నిరసనలకున్న కొద్దిపాటి అవకాశాన్నీ లాగేసుకునే చర్య.’’ ఏ ప్రజాస్వామిక దేశానికైనా ఇది మరణమృదంగమే.
లోకూర్ : ఆ వ్యాఖ్య నిస్సందేహంగా వాస్తవం. అందుకే ఇప్పటికైనా సుప్రీం కోర్టు ఓ వివరణ ఇవ్వాలి. ఆమెను అరెస్టు చేయమని చెప్పామనో చెప్పలేదనో ఏదో ఒక వివరణ ఇవ్వాలి. ఒకవేళ అరెస్టు చేయమన్నదే వారి ఉద్దేశ్యమైతే అవునయ్యా అరెస్టు చేయమన్నాం. ఇప్పుడేమిటి అనన్నా చెప్పాలి.
థాపర్ : తీర్పు వచ్చి మూడు రోజులు అవుతుంది. రోజురోజుకూ పెరుగుతున్న ఈ మౌనం సుప్రీం కోర్టు ప్రతిష్టను మసకబారుస్తుందా?
లోకూర్ : అవును. ఈ తీర్పును విమర్శిస్తూ ఇప్పటికే అనేమంది నిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ తీర్పు విషయంలో ఏదో ఒకటి చేయాలి. మౌనవ్రతం వలన పరిస్థితులు మెరుగుపడవు.
థాపర్ : మౌనంగా ఉన్నంత మాత్రాన పరిస్థితులు మారవు అన్నది కీలకమైన వ్యాఖ్య. నిజాయితీగా చెప్పాలంటే నోరు విప్పనంత కాలం పరిస్థితులు మరింత అధ్వాన్నంగా తయారవుతాయి. ఆమె జైల్లోనే రోజులు వెళ్లదీయాల్సి ఉంటుంది. ఆమె పట్ల పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో దేవుడికే తెలియాలి. సుప్రీం కోర్టు నోరు విప్పనంత వరకూ ఆమె విషయంలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుందనటంలో సందేహం లేదు.
లోకూర్ : ఇక్కడ మరో విషయం కూడా ఉంది. సుప్రీం కోర్టే అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు దిగువ స్థాయి కోర్టులు ఆమెకు బెయిల్ ఇవ్వటం అంత తేలికైన పని కాదు. ‘‘సుప్రీం కోర్టే చెప్పింది కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము బెయిల్ ఇవ్వలేము’’ అని చేతులు దులుపుకుంటారు. అలా జరగటం ఏమంత శ్రేయస్కరం కాదు.
థాపర్ : అంటే స్వయంగా సుప్రీం కోర్టే ముందుకొచ్చి తమ వ్యాఖ్యల విషయంలో జోక్యం చేసుకుంటే తప్ప తీస్తా సెతల్వాడ్ దీర్ఘకాలం కటకాల పాలుకాక తప్పదన్నమాట. సుప్రీం కోర్టు అటువంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని మీరంటున్నారు.
లోకూర్ : అవును. తప్పక వివరణ ఇస్తుందనుకుంటున్నా.
థాపర్ : ఏతావాతా ఆమెకు దీర్ఘకాల జైలు జీవితం తప్పదు. అది పూర్తిగా అన్యాయం.
లోకూర్ : అవును. మీరన్నది నిజమే. ఏదైనా మేజిస్ట్రేట్ స్థానంలో ఉండి మీరు ఆలోచించండి. ప్రభుత్వం తరఫు న్యాయవాది మేజిస్ట్రేట్ ముందుకొచ్చి ‘‘అయ్యా, సుప్రీం కోర్టు ఇలా చెప్పింది. ఇప్పుడు చెప్పండి. ఆమెను బెయిల్ మీద విడుదల చేస్తారా?’’ అని నిలదీస్తారు. ‘‘ఆ విషయం మర్చిపోండి. సుప్రీంకోర్టే ఆమెను అరెస్టు చేసి జైల్లో ఉంచాలని భావించినప్పుడు, చెప్పినప్పుడు, ఉద్దేశించినప్పుడు అలానే కానివ్వండి. ఆమెకు బెయిల్ ఇవ్వటం లేదు.’’ అంటారు.
ఆమె హైకోర్టుకు వెళ్లినా అదే జరుగొచ్చు. అలా జరిగినప్పుడు ఆమె దీర్ఘకాలం జైల్లో ఉండాల్సిరావచ్చు.
థాపర్ : ఈ సందర్భంగా 2004లో అప్పటి ముఖ్యమంత్రి మోడీనాయకత్వంలో ని గుజరాత్ ప్రభుత్వం గురించి సుప్రీం కోర్టు ఏమన్నదో పాఠకుల దృష్టిలో ఉండాలి. అదే సుప్రీం కోర్టు నేడు తీస్తా గురించి ఇచ్చిన తీర్పులో మోడీ ప్రభుత్వం గురించి నాటి ప్రధాన న్యాయమూర్తితో సహా ఉన్నత న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చింది. 2004 ఏప్రిల్ 12న జస్టిస్ అభిజిత్ పర్సాయత్, దొరైస్వామి రాజుల ద్విసభ్య ధర్మాసనం ‘‘బెస్ట్ బేకరీ మంటల్లో మహిళలు, అభం శుభం ఎరుగని తల్లులు, పిల్లలు కాలిపోతుంటే అభినవ నీరో ఎటో చూస్టూ ఉండిపోయారు’’ అని వ్యాఖ్యానించింది. అంతేకాదు. ‘‘ఈ నేరాలకు పాల్పడ్డవారిని ఎలా కాపాడాలన్న పనిలో నిమగ్నమై ఉండొచ్చు’’ అని కూడా జోడిరచింది.
నాలుగు నెలల తర్వాత మొత్తం 4600 కేసులకు గాను 2100 కేసులపై పునర్విచారణ ప్రారంభిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసుల విచారణ గుజరాత్లో జరిగితే న్యాయం జరగదని భావించిన సుప్రీం కోర్టు ఆ కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేసింది. పద్దెనిమిదేళ్ల క్రితం ఈ నరమేధం గురించి సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టే మర్చిపోయింది. ఇవేవీ వ్యాఖ్యలు కాదు. రాతపూర్వకమైన తీర్పులో ఉన్న అంశాలు. సుప్రీం కోర్టు తన తీర్పులను తానే మర్చిపోయిందా?
లోకూర్ : ఆహ్… చూడండి. ఈ వ్యాఖ్యల్లో కొన్ని పరిధిని అతిక్రమించినవి కూడా ఉన్నాయి. పర్లేదు. కానీ రెండువేలకు పైగా కేసులపై గుజరాత్ వెలుపల విచారణ జరపటం అంటేనే వాస్తవం ఏమిటో అర్థమవుతుంది. ఆ నాటి పరిస్థితి అలా ఉన్నప్పుడు పరిస్థితులు ఉండాల్సిన పద్ధతిలో లేవు అన్న వాస్తవాన్ని సుప్రీం కోర్టు తన బుర్రలో పెట్టుకోవాల్సింది. ఈ తీర్పులో అనుబంధంగా ఇచ్చిన అమికస్ క్యూరి నివేదికలోని అంశాల పట్ల సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కాస్తంత మెదడు పెట్టి ఆలోచించాల్సింది.
అమికస్ క్యూరికి ఎటువంటి ఉద్దేశ్యాలూ ఆపాదించలేము. దర్యాప్తు బృందం తన పని తాను చేయాలి. చేశారు. కానీ అమికస్ క్యూరి అలా కాదు. తాజా తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వ్యవహరించి ఉండాల్సింది. కానీ దురదృష్టవశాత్తూ అలా జరలేదు.
థాపర్ : ఈ వివరణ విన్నాక మరో ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రశ్న అవసరమే అనుకుంటున్నాను. భారతదేశంలో ప్రజలు సాధారణంగా తమకు న్యాయం కోసం కోర్టులవంక ప్రత్యేకించి సుప్రీం కోర్టు వంక చూస్తారు. కానీ ఇక్కడ రాజ్యాంగ యంత్రంలో భాగంగా అందివచ్చిన అధికారాలను ఉపయోగించుకుని సుప్రీం కోర్టు అసమ్మతి గొంతు నులుముతున్నట్లు కనపడుతుంది. ఎందుకంటే వ్యక్తులు చేసిన ఫిర్యాదులను న్యాయస్థానాలు తిరస్కరిస్తున్నాయి. సుప్రీం కోర్టు చరిత్రలో ఇది కాళరాత్రి అని చెప్పవచ్చా?
లోకూర్ : మీరు కాళ రాత్రి అనొచ్చు. కానీ మసకబారుతోందనటం నిస్సందేహం. అది కాళరాత్రి అయినీ మసకబారటం అయినా రెండూ తప్పుడు పరిణామాలే. ధోరణులే. సుప్రీం కోర్టు అంత దూరం వెళ్లి ఉండాల్సింది కాదు.
థాపర్ : ఇది కాళరాత్రి అయ్యే అవకాశం లేదని మీరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అది ఆసక్తికరమైన అంశం
లోకూర్ : అవును. మీ ఆరోపణ తోసిపుచ్చలేకపోతున్నాను. ఇంతకన్నా ఘోరంగా కూడా పరిస్థితులు మారొచ్చు.
థాపర్ : మసకబారినప్పుడూ, చీకటి కమ్మినప్పుడూ రెండు సందర్భాల్లోనూ దట్టంగా ఉండొచ్చు. మీరు చెప్పినట్లుగా త్రి సభ్య ధర్మాసనంలో కూర్చున్న ముగ్గురిలో ఏ ఒక్కరూ తీర్పుపై సంతకం చేయలేదు. అయోధ్య కేసులో తీర్పు వచ్చినప్పుడు కూడా అలానే జరిగింది. ఇప్పుడూ అలానే జరిగింది.
లోకూర్ : నాకు ఈ విషయం తెలీదు. తీర్పు ఇచ్చిన వాళ్ల పేర్లు తీర్పులో లేవా?
థాపర్ : ఈ విషయం పత్రికల్లో వచ్చింది. అదే ప్రస్తావిస్తున్నాను. పత్రికల్లో పొరపాటుగా కూడా వచ్చి ఉండొచ్చు. కానీ జూన్ 27 నాటి పత్రికా వార్తలపై ఆధారపడి ఈ మాట అంటున్నాను.
లోకూర్ : తీర్పులో ముగ్గురు న్యాయమూర్తుల పేర్లూ ఉన్నాయి కాబట్టి వాళ్లే సంతకం చేసి ఉండొచ్చు.
థాపర్ : అయోధ్య కేసు తీర్పులో కూడా న్యాయమూర్తుల పేర్లు ఉన్నాయి కానీ వాళ్లు సంతకాలు చేయలేదు. అయోధ్య కేసులో తీర్పు ఎవరు రాశారో కూడా తెలీదు. మన ఊహకే వదిలేశారు. ఇక్కడ కూడా అదే జరిగి ఉండే అవకాశం లేదా? ధర్మాసనంలో కూర్చున్న న్యాయమూర్తులెవరో మనకు తెలుసు. వాళ్లను గుర్తు పడతాం. పత్రికల్లో వచ్చింది వాస్తవమే అయితే న్యాయమూర్తులు సంతకాలు తీర్పు పత్రంలో లేవు. అదే జరిగి ఉంటే దాన్ని మీరు ఎలా చూస్తారు?
లోకూర్ : నాకు గాభరా వేస్తోంది అని మాత్రం చెప్పగలను.
థాపర్ : చివరిగా మీరు సుప్రీం కోర్టు గర్వించదగిన న్యాయమూర్తిగా ఉన్నారు. సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు? ఈ ప్రశ్న ఇంతకు ముందే అడిగాను. నాకు గుర్తుంది. సుప్రీం కోర్టును ఆకాశమంత సమున్నతంగా చూస్తున్న వారి దృష్టిలో ఉన్నత న్యాయస్థానం తన స్థానాన్ని నిలుపుకోలేకపోయిందనుకుంటున్నారా?
లోకూర్ : అవును. నిస్సందేహంగా అదే జరిగింది. సుప్రీం కోర్టు ఇలా వ్యవహరిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఊహించరు కూడా. చట్టం సంగతి అటువంటి ఏ సాధారణ వ్యక్తీ ఇలా ఊహించరు. మరీ ముఖ్యంగా వీళ్లను బోనులో నిలబెట్టండి అన్న పేరాగ్రాఫ్‌ను మీరు ఉటంకించారు. ఇది అత్యంత దురదష్టకరం.
థాపర్: జస్టిస్ లోకూర్, బాహాటంగా, భేషజాలకు పోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడినందుకు, కనీసం తీస్తా అరెస్టు విషయంలో తామేమనుకుంటున్నదో సుప్రీం కోర్టు వివరణ ఇవ్వాలని కోరినందుకు చాలాచాలా ధన్యవాదాలు. మీరన్నట్లు అటువంటి వివరణ అనివార్యం. అవసరం. అటువంటి వివరణ రానంత వరకూ సుప్రీం కోర్టు మౌనం పాటించే ప్రతి రోజూ ఆ మౌనం మరింత భారంగా మారుతుంది. పరిస్థితి భరించరానంత దారుణంగా మారుతుంది.
లోకూర్: ధన్యవాదాలు.
(తీస్తా సెతల్వాడ్ అరెస్టుకు దారితీసిన సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పుపై మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ ను ది వైర్ అంతర్జాల పత్రిక కోసం ప్రముఖ పాత్రికేయులు కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చేశారు. ది వైర్ వెబ్సైట్లో ప్రచురించబడిన ఇంటర్వ్యూ పూర్తి పాఠానికి తెలుగు అనువాదం : కొండూరి వీరయ్య)