మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టం: వ్యక్తిగత స్వేఛ్చపై మరో శరాఘాతం

0
88
  • జస్టిస్‌ ఎ.ఎం ఖాన్విల్కర్‌ తీర్పుల విశ్లేషణ – రెండో భాగం

ప్రభుత్వానికి గిట్టని వ్యక్తులను ఏళ్ల తరబడి విచారణ కూడా లేకుండా జైల్లో పెట్టేందుకు ఉపా చట్టం ప్రభుత్వం (కార్యనిర్వాహకవర్గం) చేతిలో పావుగా మారితే అక్రమ ధన లావాదేవీల నియంత్రణ చట్టం రాజకీయ సాధనంగా మారింది. నేడు దేశంలో ప్రతిపౌరుడికీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అంటే ఏమిటో తెలిసిపోయింది. రోజువారీ పరిభాషలో ఈడీ అని పిలుస్తున్నాము. అడ్డు అదుపూ లేకుండా రాజకీయ ప్రత్యర్ధులను విచారణ లేకుండా జైళ్లకు పంపటానికి ఈ చట్టం సాధనంగా మారిందన్న సార్వత్రిక అభిప్రాయాన్ని ఈ లోతైన వివరణ, విశ్లేషణ ధృవీకరిస్తుంది. గత ఎనిమిదేళ్లల్లో ఈడి నమోదు చేస్తున్న కేసులు 8 రెట్లు పెరిగాయన్న వాస్తవం ప్రత్యర్ధులకు బెయిలు కూడా దక్కకుండా జైల్లో కుక్కటమే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని రుజువు చేస్తుంది.

ఈ కాలంలో ఈడి నమోదు చేసే కేసుల్లో నిరూపణ జరిగిన నిందుతులు ముద్దాయిలుగా మారుతున్నది కేవలం ఒక్క శాతం కేసుల్లో మాత్రమే. దాఖలవుతున్న కేసుల్లో ఒక్క శాతానికి మించి నిరూపణ కావటం లేదన్న వాస్తవం అందరినీ ఆందోళన కలిగించే అంశం. (అయితే కేవలం సుప్రీం కోర్టుకు మాత్రమే ఈ విషయంలో ఆందోళన లేదనిపిస్తోంది). ఈ చట్టాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తూ 2019లో కేంద్రం చేసిన సవరణలను సుప్రీం కోర్టులో సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలైంది. పదవీ విరమణ చేయటానికి రెండ్రోల ముందు ఖాన్విల్కర్‌ నాయకత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2019 సవరణలన్నీ సరైనవేనని వక్కాణిస్తూ తీర్పునిచ్చింది.

ఇప్పటికే ఈ తీర్పుపై లోతైన విశ్లేషణలు వచ్చాయి కాబట్టి మరోసారి తీర్పులోని అంశాల లోతుపాతుల గురించి విశ్లేషించబోవటం లేదు. అయితే ఈ తీర్పు వెనక ఉన్న తర్కం, తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఈడి అధికారులు అన్ని విధాలా పోలీసుల్లాగా వ్యవహరిస్తున్నప్పుడు అంటే ప్రభుత్వం చేతిలో పావుగా మారి ప్రజలపై భస్మాసుర హస్తం ప్రయోగిస్తున్నప్పుడు కూడా ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఈడీ సిబ్బంది అధికారులు కనీసం ప్రాధమిక జాగ్రత్తలు కూడా తీసుకోవల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేసింది. అంటే క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ పోలీసులను నియంత్రించిన మేరకైనా 2019లో సవరించిన మనీ లాండరింగ్‌ చట్టం ఈడి సిబ్బందిని నియంత్రించటానికి సిద్ధంగా లేదు.

ఉదాహరణకు పోలీసులు కేసు దాఖలు చేస్తే ప్రాధమిక దర్యాప్తు నివేదికను ఆరోపితులకు ఇవ్వాలి. ఈడి కేసు నమోదు చేసినప్పుడు దాఖలు చేసే ఈసిఐఆర్‌ కూడా ప్రాధమిక దర్యాప్తు నివేదిక లాంటిదే. కానీ ఈడి అధికారులు ఈ ఈసిఐఆర్‌ను ఆరోపితులకు ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తన తీర్పులో చెప్పింది. న్యాయస్థానం మరో అడుగు ముందుకేసి ఎందుకు అరెస్టు చేస్తున్నారో కారణాలు చెప్తే సరిపోతుందని తేల్చింది. ఈడి విచారణకు హాజరు కావాలని కోరటం అరెస్టు చేయటం కాదు కాబట్టి అరెస్టు సందర్భంలో పోలీసు యంత్రాంగం తీసుకోవల్సిన జాగ్త్రతలు, పాటించాల్సిన ప్రమాణాలు ఈడీ పాటించాల్సిన అవసరం లేదని కూడా నిర్ధారించింది. (ఈడి విచారణ సందర్భంగా ఇచ్చిన ఆరోపితులు ఇచ్చే సమాచారాన్ని వారికి వ్యతిరేకంగా విచారణలో వాడుకునేందుకు అవకాశం ఉందన్న విషయాన్ని సుప్రీం కోర్టు పట్టించుకోలేదు).

అంటే ఈడి అధికారుల ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని తర్వాత ఈడి సాక్ష్యంగా కూడా ఉపయోగించుకోవచ్చన్నమాట. (పోలీసుల ముందు ఇచ్చే వాంగ్మూలాన్ని న్యాయస్థానం లో ఆరోపితుడికి వ్యతిరేకంగా ఉపయోగించుకునే అవకాశం ఉంట పోలీసుల దాష్టీకానికి అడ్డు అదుపూ ఉండదనే కారణంతోనే న్యాయస్థానం దీన్ని తిరస్కరించింది. కానీ ఈడి విషయంలో అటువంటి వాంగ్మూలాలను యధేశ్చగా వాడుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు చెప్తోంది). ఈడి పోలీసులు కాదు అన్నప్పుడు ఈడి పాటించే పద్ధతులు, పని చేసే విధి విధానాలకు సంబంధించిన పత్రాన్ని కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఈడి మాన్యువల్‌ ఏ మాత్రం గోప్యమైన పత్రంగా ఉండకూడదు.ఈ వివరాలు గమనించినప్పుడు మనం ఓ పోలీసు రాజ్యంలోకి ప్రవేశిస్తున్నామన్న భావన కలుగుతుంది. (ప్రతాప్‌ భాను మెహతా దీన్నే కాఫ్కా న్యాయం అని పిలిచారు).

ఈ తీర్పు పర్యవసానం స్పష్టమే. న్యాయస్థానమే రాజ్య నియంత్రిత సైన్యం తరహా శక్తికి బలం చేకూరుస్తుంది. ఇటువంటి వారికి డ్యూ ప్రాసెస్‌ మరియు రూల్‌ ఆఫ్‌ లా సూత్రాలు పాటించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్తోంది. ఈ ప్రమాదకర మిశ్రమానికి గాఢత సమకూరుస్తూ న్యాయస్థానం మరో నిర్ధారణ కూడా చేసింది. ఉపా చట్టంలో బెయిల్‌ పొందటానికి ఉన్న షరతుల కంటే ప్రమాదకరమైన షరతులను న్యాయస్థానం సరైనవేనని ప్రకటించింది. నాలుగేళ్ల క్రితం సుప్రీం కోర్టు తిరస్కరించిన వాదనలకే ఇప్పుడు ఖాన్విల్కర్‌ తీర్పు పెద్ద పీట వేసింది. (నాలుగేళ్ల క్రితం మనీ లాండరింగ్‌ కింద అరెస్టయిన వారికి బెయిల్‌ మంజూరు చేసే షరతులను సులభతరం చేయటంతో పాటు సుప్రీం కోర్టు ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యతను ప్రభుత్వంపై మోపింది. కానీ ఖాన్విల్కర్‌ దీనికి భిన్నంగా ఆరోపిడుతే తాను నిర్దోషినని నిరూపించుకోవాలని బాహాటంగా ప్రకటించింది.

మనీ లాండరింగ్‌ నియంత్రణ చట్టం పరిధిని విస్తరిస్తూ ఖాన్విల్కర్‌ మరో అడుగు ముందుకేశారు. చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం చట్టవిరుద్ధంగా సంపాదించిన సొమ్ము సొత్తు చట్టబద్దమైనదేనని నమ్మజూపే క్రమంలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, తెలిసి గానీ తెలీక గానీ భాగస్వాములయిన వారందరూ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లే. అంటే మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేయాలంటే రెండు కారణాలు ఉండాలి : మొదటిది తెలిసో తెలీకో అటువంటి ప్రక్రియలో భాగస్వాములు కావాలి. రెండోది ఆ రూపంలో సంపాదించిన సొమ్ము చట్టబద్ధమైనదేనని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఖాన్విల్కర్‌ తీర్పులో ‘మరియు’ ‘లేదా’ అన్న పదాలకు అర్థం ఒకటేనని చెప్పుశారు. అంటే పగలూ రాత్రి ఒక్కటే అని చెప్పటమన్నమాట. అక్రమ సంపాదన చేతిలో ఉంటే సదరు వ్యక్తిని బేషరతుగా మనీ లాండరింగ్‌ చట్టం కింద అరెస్టు చేయవచ్చన్నమాట.

నీదైనా కాకపోయినా నీ చేతిలో ఉంటే ముద్దాయివే అన్న వాదనతో పాటు నేను ముద్దాని కాదు అనినిరూపించుకునే భారాన్ని వ్యక్తులపై మోపటం అంటే ఏ రకమైన నేరాన్ని అయినా మనీ లాండరింగ్‌ పరిధిలోకి తెచ్చేందుకు ఖాన్విల్కర్‌ తలుపులు బార్లా తెరిచారు. దీని ప్రభావం, పర్యవసానం ఎంతో ప్రమాదకరంగానూ ఆందోళనకరంగానూ ఉండనున్నాయి.

ఈ చట్టం కింద మరకలు పడ్డ సొమ్ముకు ఇచ్చిన నిర్వచనాన్ని ఈ తీర్పు మరింత గందరగోళపర్చింది. అంటే ఈడి ఎటాచ్‌ చేసుకున్న సొమ్ము సొత్తు అంతా మరకలుపడ్డదే అన్న నిర్ణయానికి రావాలని ఈ తీర్పు చెప్తోంది. ఈ చట్టం కింద ఎవరి మీదైనా కేసు నమోదు చేయటం అంటే సదరు ఆరోపితుడి ఆర్థిక మూలాలు దెబ్బతీయటమే. ఈ చట్టం కింద చర్యలు మొదలైన తొలి రోజు నుండే ఆరోపితుడి ఆస్తులను ఈడి స్వాధీనం చేసుకోవచ్చని ఖాన్విల్కర్‌ వ్యాఖ్యానించారు. సాధారణంగా నేర నిరూపణ జరిగిన తర్వాత చేపట్టాల్సిన పనిని నేరారోపణ దశలోనే చేపట్టవచ్చని చెప్పటం అంటే ఎంత ప్రమాదకరమైన తీర్పో అర్థం చేసుకోవచ్చు.

మూడు ముఖ్యమైన అంశాలను మనం గమనించాలి. మనీ లాండరింగ్‌ చట్టంలో మూడో సెక్షన్‌లో చేసిన సవరణలు భాషాపరంగా అర్థవంతమైనవేమీ కాదు. ఈ చట్టానికి సుప్రీం కోర్టు ఇచ్చిన వ్యాఖ్యానం క్రిమినల్‌ లాను తలక్రిందులు చేస్తుంది. క్రిమినల్‌ చట్టాలన్నీ వ్యక్తి జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసేవి కావటంతో ఆయా అధికారాలను చాలా పరిమితంగా నిక్కచ్చి అయిన క్రమశిక్షణతో ఉపయోగించాలన్నది క్రిమినల్‌ లా ఆదేశం. కానీ ఖాన్విల్కర్‌ న్యాయతాత్వికతకు నూతన దిశానిర్దేశం చేశారు. ‘‘ప్రభుత్వం ఏమి చేసినా పర్లేదు కానీ వ్యక్తులు మాత్రం చట్టాన్ని అతిక్రమించకూడదన్నదే ఈ నూతన దిశానిర్దేశం. ఏదేమైనా చట్టం, న్యాయం తల్లక్రిందులవుతున్నప్పుడు రాజ్యపు కబంధ హస్తాల నుండి ఎవ్వరూ సురక్షితంగా ఉండలేరు. చివరిగా ఈ లక్ష్యాన్ని నెరవేర్చటానికి ఖాన్విల్కర్‌ ఏకంగా పార్లమెంట్‌ ఆమోదించిన చట్టంలో ఓ సెక్షన్‌నే తిరగరాశారు. పూర్తి భిన్నమైన లక్ష్యం, అర్థం, ప్రయోజనం ఉండేలా ఈ సెక్షన్‌ను వ్యాఖ్యానించారు.

ఇటువంటి పరిస్థితిని వివరించటానికి గతంలో నేను హంప్టీ డంప్టీ న్యాయతాత్వికత అన్న పదబంధాన్ని ప్రస్తావించాను. అలైస్‌ త్రూ ది లుకింగ్‌ గ్లాస్‌ అన్న నవలలో హంప్టీ డంప్టీ ఓ న్యాయాధికారి పాత్ర. ఈ పాత్ర పదాలకు తాను అర్థం చేసుకోగల వివరణే అసలైన వివరణగా భావించి పదాలు తప్పు ఒప్పు అని నిర్ధారిస్తుంది.
‘నేను ఓ పదాన్ని ప్రస్తావించినప్పుడు నేను ఏ అర్థంతో ప్రయోగించానో అదే అర్థాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. వీసమెత్తు ఎక్కువా కాదు. తక్కువా కాదు’ అని భీకరిస్తుంది.

అలైస్‌ పాత్రధారి ‘ఒకే పదానికి పలు అర్థాలు తీసుకోవచ్చా’ అని వేసిన ప్రశ్నకు హంప్టీ డంప్టీ ఈ ప్రశ్నకు సమాధానంగా ‘ ఇక్కడ యజమాని ఎవరో వారు ఇచ్చేదే అసలైన అర్థం’ అని తేల్చి చెప్పేస్తుంది.
మనీ లాండరింగ్‌ చట్టం పై ఖాన్విల్కర్‌ ఇచ్చిన తీర్పును విశ్లేషిస్తూ అభినవ్‌ సేఖ్రి ఈ చట్టంలో మూడో సెక్షన్‌ను రాసేటప్పుడు పార్లమెంట్‌ పొరపాటు చేసిందనేందుకు సాక్ష్యాధారాలున్నాయనీ, ‘లేదా’ అనే పదం ప్రయోగించాల్సిన చోట ‘మరియు’ అన్న పదాన్ని ప్రయోగించారని వివరించారు. క్రిమినల్‌ లా విషయానికి వస్తే చట్టాలు రూపొందించటంలో చేసిన తప్పుల నుండి చట్టసభలను కాపాడటం న్యాయవ్యవస్థ లక్ష్యం కాదు. క్రిమినల్‌ లాకు సంబంధించిన చట్టాలను తు చ తప్పకుండా అక్షరమక్షరం ఉన్నది ఉన్నట్లు చూడాలి. ఎందుకంటే క్రిమినల్‌ లా లో ఓ వైపు బలవంతుడైన రాజ్యం ఉంటే మరో వైపు బలహీనుడైన స్వతంత్ర వ్యక్తి ఉంటాడు. రాజ్యపు మనోభావాలను అనుగుణంగా చట్టాలను వ్యాఖ్యానించుకుంటూ వెళ్లటం అంటే బలహీనుడైన స్వతంత్రుడికి శాశ్వతంగా న్యాయాన్ని దూరం చేయటమే. అందుకే క్రిమినల్‌ లా చట్టాల్లో ఎంత వరకు రాసి ఉందో అంతవరకే అర్థం చేసుకోవాలి, వ్యాఖ్యానించాలి. కానీ చట్టంలో ఉన్నదానికంటే మించిన పరిధిని మనం విస్తరించకూడదు. ఖాన్విల్కర్‌ మనీ లాండరింగ్‌ చట్టంలో సెక్షన్‌ 3ను పూర్తిగా తిరగరాయటానికి పూర్తి స్వేఛ్చను తీసుకోవడం ద్వారా ఈ మౌలిక ప్రమాణాన్ని, పునాదిని విస్మరించారు.

ఈ తీర్పుపై చర్చను ముగిద్దాం. విస్తృతార్థంలో ఈ తీర్పును పరిశీలించినప్పుడు న్యాయమూర్తి వ్యాఖ్యానంలో కొత్తదనం ఏమీ లేదన్న సేఖ్రి అభిప్రాయంతో మనం ఏకీభవించాలి. దీర్ఘకాలంగా భారత సుప్రీం కోర్టు రాజ్యపు అధికారాలను, అవకాశాలను విస్తరింప చేసేందుకు సాగిస్తున్న ప్రయత్నాల్లో ఈ తీర్పు కూడా భాగంగానే ఉంది. ఈ క్రమంలో వ్యక్తులకు చట్టాలు కల్పిస్తున్న అనేక వెసులుబాట్లను స్వయంగా సుప్రీం కోర్టే తొలగిస్తోంది.
మనీ లాండరింగ్‌ చట్టం నేపథ్యంలో ఈ తీర్పు చట్టంలో రాజ్యానికి ఉన్న అవకాశాలను మరింత విపులీకరిస్తుంది. విస్తృతపరుస్తుంది. ఈ తీర్పుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇప్పటి వరకూ న్యాయవ్యవస్థ వ్యవహరించిన కప్పదాటు వైఖరులన్నింటినీ ఒకచోట క్రోడీకరించినట్లు ఈ తీర్పు కనిపిస్తుంది. ఈ తీర్పును అభినవ్‌ సేఖ్రి ‘అత్యధికమంది చెక్‌ చేసిన వీడియో లాంటిది’ అన్నారు.

సేఖ్రి మాటలకు మరికొంత జోడిరచి మనం దీన్ని ఇక్కడ సుప్రీం కోర్టు ద్వారా రాజ్యాంగపు హక్కులపై జరుగుతున్న దాడి అని చెప్పవచ్చు. సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే ఖాన్విల్కర్‌ మొత్తం చట్టాన్ని దాదాపు తిరగరాసినంత పని చేశారు. దాని పరిధిని అనూహ్యంగా విస్తరించారు. వ్యక్తులకు ఉన్న నియమబద్ధ, రాజ్యాంగ హక్కులను వినియోగించుకునే అవకాశం లేకుండా చేశారు. రాజ్యానికి అవధుల్లేని అధికారాన్ని కట్టబెట్టారు. కొద్దిపాటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా రాజ్యం యధేఛ్చగా వ్యవహరించేందుకు అవకాశం కల్పించారు. ఈ అంశాలన్నిటికీ క్రోడీకరించి చూసినప్పుడు కనిపించేది ఒక్కటే. రాజ్యపు అడుగులకు మడుగులొత్తే న్యాయవ్యవస్థ కనుసన్నల్లో చట్టరాహిత్యమే చట్టంగా చెలామణి అవుతుందన్న వాస్తవం ఒక్కటే.

Also Read…

ఓసారి న్యాయస్థానం గడప తొక్కాక స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు నో గారంటీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here