శబరిమల : నిర్హేతుకతకు పరాకాష్ట

0
88
  • జస్టిస్‌ ఎ.ఎం ఖాన్విల్కర్‌ తీర్పుల విశ్లేషణ – అయిదో భాగం

Justice AM Khanwilkar: ఈ చర్చలో భాగంగా చివరి అంశాన్ని పరిశీలిద్దాం. ఇప్పటి వరకూ చర్చించుకున్న తీర్పులకంటే ఈ తీర్పు భిన్నమైనది. కానీ పైన చెప్పుకున్న తీర్పుల్లోలాగానే ఈ తీర్పుకు కూడా హేతుబద్దతకు, తర్కబద్దతకు తావులేదు. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2018లో ఇచ్చిన ఓ తీర్పులో శబరి దేవాలయంలోకి 10 నుండి 55 ఏళ్ల వయసున్న మహిళల ప్రవేశానికి అర్హులు కాదన్న వాదన రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. రాజ్యాంగ ధర్మాసనంలో వాదనలు విన్న న్యాయమూర్తుల్లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ గుప్తతో పాటు ఖాన్విల్కర్‌, చంద్రచూడ్‌, నారిమన్‌, ఇందు మల్హోత్రా ఉన్నారు. ఈ ఐదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు ఓ వైఖరి తీసుకుంటే ఇందు మల్హోత్రా భిన్నస్వరాన్ని వినిపించారు. ఈ తీర్పులో భాగంగా న్యాయమూర్తులు ఎవరి అభిప్రాయాన్ని వారు నమోదు చేశారు. ఖాన్విల్కర్‌ మాత్రం ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.

ఈ తీర్పు నేపథ్యం ఇలా ఉంది. అంతకు ముందే సుప్రీం కోర్టు ఈ విషయంపై ఓ తీర్పు ఇచ్చింది. అదే తీర్పును పున:పరిశీలించాలన్న పిటిషన్‌ దాఖలైంది. తొలి తీర్పు ఇచ్చిన ధర్మాసనం అనేక కోణాలు, వాస్తవాలు, తర్కబద్ధత వంటి విషయాల్లో ఎలా పొరపాటుపడిరదో వివరించేందుకే ఈ రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై వాదోపవాదనలు బహిరంగంగానే జరిగాయి. అప్పటికి దీపక్‌ గుప్త పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో రంజన్‌ గగోయి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ధర్మాసనంలో మిగిలిన సభ్యులు యథాతథంగా ఉన్నారు. శబరిమల కేసులో తాము ఇచ్చిన తీర్పులో కొన్ని వివాదాస్పద అంశాలను పున:పరిశీలించటానికి మరింత విస్తృతమైన రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలని ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇందులో గగోయి, ఇందుమల్హోత్రాలు ఈ తీర్పును విస్తృత రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపాలన్న ప్రతిపాదనను సమర్ధించారు. మరో ఇద్దరు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు.

నిర్ణయాత్మక ఓటు వేసిన న్యాయమూర్తి ఖాన్విల్కర్‌. ఏడాది నుండే మెజారిటీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు తాను ఏడాది క్రితం అంగీకరించిన తీర్పు తప్పు అని తానే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. అందువల్లనే ఈ తీర్పును పున:పరిశీలించాల్సిన అవసరం ఉందన్న వాదన ముందుకు తెచ్చారు. ఓ సారి ఓ న్యాయమూర్తి ఓ తీర్పు రాసి సంతకం చేసిన తర్వాత తన తీర్పు తప్పు అని మనసు మార్చుకునే అవకాశం ఉందా? బహుశా ఉండొచ్చు. కానీ ఏడాది క్రితమే ఇచ్చిన తీర్పులో ఘోరమైన తప్పిదాలు దొర్లాయని ఏడాది తర్వాత స్వయంగా న్యాయమూర్తే వాదిస్తే ఇక ఈ తీర్పులకు, తీర్పులు ఇచ్చే న్యాయస్థానానికి ప్రజల్లో ఉండే విలువ, గౌరవం ఏమిటి?

బహుశా ఇక్కడ ఖాన్విల్కర్‌కు మహిళా హక్కుల విషయంలో జ్ఞానోదయం అయి ఉండాలి. ఒకవేళ అదే వాస్తవం అయితే తన అభిప్రాయాన్ని ఆమాంతం మార్చుకోవటానికి గల కారణాలేమిటన్న ప్రశ్న వేసుకుని దానికి వివరణ ఇవ్వాల్సిన నైతిక భాధ్యత లేదా న్యాయమూర్తులకు? శబరిమల కేసులో తొలి తీర్పు విషయంలో కానీ మలి తీర్పు విషయంలో కానీ ఖాన్విల్కర్‌ గారి నుండి అటువంటి హేతుబద్దమైన వివరణ ఏదీ మనకు కనిపించలేదు. 2018లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి గారితో జస్టిస్‌ ఖాన్విల్కర్‌ ఎందుకు ఏకీభవించారో తెలీదు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి శబరిమల కేసు విషయంలో పొరపాటు చేశారని 2019లో ఎందుకు అభిప్రాయపడ్డారో కూడా తెలీదు.
వాల్ల్‌ వైట్‌మాన్‌ ‘‘నా మాట నేనే తిరగదోడుతున్నానా?’’ అని ప్రశ్నించుకుంటారు. ‘‘అవును. నేనే మాట మారుస్తున్నాను’’ అని సమాధానం కూడా ఇస్తారు. ఈ సమాధానాన్ని పాఠకులు అంగీకరించాలని కోరుకుంటారు. కానీ కేవలం ఓ కలం పోటుతో కోట్లాదిమంది హక్కులను తీసేయగల స్థానంలో ఉన్న సుప్రీం కోర్టు న్యాయమూర్తికి మాత్రం ఈ ప్రశ్న రానే రాదు.

ప్రభుత్వం చేతిలో పావుగా మారిన న్యాయస్థానం

రొమిలా థాపర్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా అనే ఉపా చట్టం కింద నమోదైన మరో కేసులో కూడా ఖాన్విల్కర్‌ మెజారిటీ అభిప్రాయంతో ఏకీభవిస్తారు. ఇటువంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పవచ్చు. ఈ కేసులో కూడా పోలీసులు ప్రాసిక్యూషన్‌ సందర్భంగా చేసిన అనేక తప్పుల పట్ల సుప్రీం కోర్టు శీతకన్ను వేస్తుంది. ఇప్పటికీ ఈ కేసులో నిందితులు జైల్లో ఉన్నారు. అదేవిధంగా సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు విషయంలో సుప్రీం కోర్టు వ్యవహార శైలిని కూడా పరిశీలించవచ్చు. ఈ తీర్పులోనే ఖాన్విల్కర్‌ నాయకత్వంలోని ధర్మాసనం ప్రజల భాగస్వామ్యం అంటే ఏమిటో నిర్దారిస్తుంది. ప్రమాణాలు ప్రతిపాదిస్తుంది. కానీ అదే ప్రమాణాలను తనముందున్న కేసుకు వర్తింపచేయటానికి నిరాకరిస్తుంది. మనం ఎంతైనా మాట్లాడొచ్చు. ఉపదేశించవచ్చు. కానీ ఈ ఉపదేశాలు ఆచరించాల్సిన వచ్చేసరికి మనం కనిపించం. మన మాట వినిపించదు.

ఈ శీర్షికలో చర్చించన అన్ని కేసుల్లోనూ ప్రజల మౌలిక హక్కులు ముడిపడి ఉన్నాయి. వటాలి, మనీ లాండరింగ్‌ కేసుల్లో వ్యక్తి స్వేఛ్చ హక్కు కీలకమైతే విదేశీ నిధుల స్వీకరణ చట్టం కేసులో సంఘం పెట్టుకునే హక్కు కీలకం. జకియా జాఫ్రి, హిమాంషుకుమార్‌ కేసుల్లో ప్రాధమిక హక్కులను అమలు చేయాలన్న విజ్ఞప్తులు కీలకం. దాంతో పాటు ప్రాధమిక హక్కుల ఉల్లంఘనకు గురైతే వాటికి రాజ్యాంగ రక్షణ కల్పించాలన్న విజ్ఞప్తి మరింత కీలకమైనది. సారాంశంగా చెప్పాలంటే రాజ్యపు విచక్షణాధికారాల కంటే రాజ్యాంగ ఆధారిత ప్రజాస్వామ్యం ప్రకారం పరిపాలన సాగించటం కీలకం అన్న అంశాన్ని చర్చకు పెట్టే కేసులు ఇవన్నీ. ప్రతి కేసూ వ్యక్తిభద్రత, స్వేఛ్చ, ప్రాధమిక హక్కులు పై రాజ్యం సాగించే దాడిన నిలువరించే సందర్భమే. అటువంటి దాడిని నిలువరించటమే రాజ్యాంగ ధర్మాసనం మౌలిక కర్తవ్యం.

ఇప్పటి వరకూ చర్చించిన ఐదు కేసుల్లో నాలుగు కేసుల తీర్పులు స్వయంగా ఖాన్విల్కర్‌ రాసినవే. ఈ తీర్పుల్లో భావి భారతానికి సంబంధించిన ఆందోళనకరమైన పరిస్థితులు రేఖామాత్రంగానైనా వెలుగు చూస్తున్నాయి.
ఎల్లప్పుడూ రాజ్యమే గెలుస్తుంది. ప్రజలు ఓడిపోతారు అన్న సూత్రం అమలు కావల్సిన అవసరం లేదు. కానీ భారత దేశంలో రాజ్యాంగ ధర్మాసనాల విషయంలో మాత్రం ఇదే సూత్రం పదేపదే పునరావృతమవుతోంది. ఎక్కడో ఒకటో అరో మినహాయింపు ఉంటే ఉండొచ్చు. ఇక్కడ సమస్య ఏమిటంటే అసలు ఈ న్యాయపోరాటంలో రాజ్యం ఎలా గెలుస్తోంది అన్నదే కీలకమైన సమస్య. రాజ్యపు వాదనలు, రాజ్యం ముందుకు తెచ్చే వాస్తవాలు, రాజ్యపు ప్రాపంచిక దృక్ఫథం వంటి విషయాలకు వచ్చినప్పుడు న్యాయవ్యవస్థ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. లేదా రాజ్యాన్ని వెనకేసుకు వస్తోంది. వీలైతే రాజ్యాన్ని, రాజ్యపు కృషిని ఆకాశానికెత్తేందుకు కూడా ప్రయత్నం చేస్తోంది.

వ్యక్తిగత హక్కులు, అధికారాల విషయానికి వస్తే రాజు ముంజేతి సైగతో పంజా విప్పి పైకి దూకే సింహం సామెతను గుర్తు చేస్తోంది. ఈ తరహా న్యాయ తాత్వికతలో హక్కులు అంటే చెప్పులోని రాయి చెవిలోని జోరీగ వంటివని భావించబడుతున్నాయి. వ్యక్తులకు నూకలు చెల్లించటం తేలికైన పని అని మాత్రమే కాక చట్టబద్ధమే అన్న భావన వేళ్లూనుకుంటుంది. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వాళ్లే అంతిమంగా జైలుకెళ్లటం కొత్త సాంప్రదాయంగా స్థిరపడుతోంది.

శబరిమల కేసులో జస్టిస్‌ ఖాన్విల్కర్‌ వ్యవహారశైలిని గమనించినప్పుడు న్యాయస్థానం తీసుకునే ఏ నిర్ణయానికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్న భావన స్థిరపడుతోంది. ఇక్కడ ఓ తీర్పు ఇవ్వాలంటే అది హేతుబద్ధంగానూ, తర్కబద్ధంగానే ఉండాలన్న ప్రాధమిక ప్రమాణం స్థానంలో అధికారం ఎటువైపు ఉంటే అటువైపు తీర్పులు మొగ్గుతాయన్నదే ప్రమాణంగా మారుతోంది.
న్యాయస్థానం ద్వారా జారీ అయ్యే ఆదేశాలు, నిర్హేతుకమైన తీర్పులు గమనిస్తే న్యాయస్థానం ప్రభుత్వం చేతిలో పావులుగా మారినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ దిశగా భారత న్యాయస్థాన ప్రస్థానం సాగుతున్నందునే మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీకాలాన్ని విశ్లేషిస్తూ రాసిన వ్యాసంలో న్యాయస్థానం ప్రభుత్వంలో భాగంగా మారిపోయిందని నిర్ధారించాను.

వటాలి వంటి కేసుల్లో వచ్చిన తీర్పులు సుప్రీం కోర్టులు ప్రభుత్వాల ముంజేతి గంటలుగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించేందుకు తిరుగులేని ఉదాహరణలు. అదే సమయంలో జకియా జాఫ్రి, హిమాంషుకుమార్‌, ఎఫ్‌సిఆర్‌ఎ వంటి కేసుల్లో వచ్చిన తీర్పులు ఇంకా తీవ్ర పర్యవసానాలకు దారితీసేవి. ఈ కేసుల్లో సుప్రీం కోర్టు కేవలం ప్రభుత్వానికి ముంజేతి కంకణంగా మారటంతోనే సరిపెట్టుకోలేదు. మరో అడుగు ముందుకేసి ప్రభుత్వ సైద్ధాంతిక భావజాలాన్ని భుజాన మోయటానికి సిద్ధపడిరది. ప్రభుత్వం నమ్మిన సిద్ధాంతాలు సత్యమని ధర్మాసనం వేదికగా ప్రపంచానికి చాటిచెప్పేందుకు శాయశక్తులా ప్రయత్నం చేసింది. ఎప్‌సిఆర్‌ఎ వంటి కేసుల్లో ఖాన్విల్కర్‌ ‘‘ప్రజలు కఠినమైన నిబద్ధత కలిగి ఉంటే అభివృద్ధి కోసం విదేశీ నిధులపై ఆధారపడాల్సిన అవసరం లేద’’ని చెప్పటం, జకియా జాఫ్రి కేసులో తీస్తా సెతల్వాడ్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, వీళ్లను జైల్లో పెట్టాలని తీర్పులోనే రాయటం, తదనుగుణంగానే తీర్పు వచ్చిన మరునాడే తీస్తా, శ్రీకుమార్‌లను జైల్లో పెట్టడం వంటి అంశాలు దీనికి తిరుగులేని ఉదాహరణ.

జస్టిస్‌ ఖాన్విల్కర్‌ ప్రస్తుతం పదవీ విరమణ చేశారు. రానున్న కాలంలో అనేక కేసుల సందర్భంగా నెలలు, ఏళ్లు తరబడి జైళ్లల్లో మగ్గబోతున్న వ్యక్తులు భారత న్యాయ వ్యవస్థలో ఖాన్విల్కర్‌ ప్రభావం, వారసత్వం ఏమిటో బాగా అర్థం చేసుకోగలుగుతారు. (ఇప్పటికే మనీ లాండరింగ్‌ వంటి కేసుల్లో కేవలం ఆరోగ్య కారణాలైతే తప్ప న్యాయస్థానాలు బెయిల్‌ మంజూరు చేయటానికి అవకాశం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించటం మొదలైంది). బుగ్గిపాలైన భవిష్యత్తు, చితికిపోయిన జీవితాల్లో ఖాన్విల్కర్‌ న్యాయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి అందించిన సేవలు కనిపిస్తుంటాయి. రానున్న కాలంలో సుప్రీం కోర్టును ప్రభుత్వానికి మంజేతి కంకణంగా మార్చాలన్న ఖాన్విల్కర్‌ ఆకాంక్షలను సుప్రీం కోర్టు నెరవేరుస్తుందా లేదా అని తేలనుంది.

Also Read…

తీస్తా సెతల్వాడ్‌, హిమాంషుకుమార్‌: రాజ్యాంగపరిహార హక్కుకు వెన్నుపోటు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here