జాతీయం తీస్తా అరెస్టుకు దారితీసిన సుప్రీం కోర్టు తీర్పుపై కొన్ని ప్రశ్నలు జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌

తీస్తా అరెస్టుకు దారితీసిన సుప్రీం కోర్టు తీర్పుపై కొన్ని ప్రశ్నలు జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌

తాజాగా సుప్రీం కోర్టు తీస్తా సెతల్వాడ్‌ జకియా జాఫ్రిల పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఇచ్చిన తీర్పులో చేసినంతటి తీవ్రమైన వ్యాఖ్యలు ఉన్నత న్యాయస్థానం ఎంత తరచుగా చేస్తోంది? ఈ వ్యాఖ్యల పర్యవసానంగా ఓ ప్రముఖ సామాజిక కార్యకర్తను అరెస్టు చేసి ఆమె నివాస ప్రాంతం కానిచోట ఖైదు చేశారు.

సుప్రీం కోర్టు నిజంగానే తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆ తీర్పు ఇచ్చిందా? లేక అరెస్టు చేయాలని సూచించిందా? ఈ రెండు ప్రశ్నలకీ మీ సమాధానం ఏదైనా కావచ్చు కానీ దాని పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉండనున్నాయి. ఈ చర్చ అంతా తాజాగా జకియా జాఫ్రీ కేసును తోసిపుచ్చుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గురించే.

ఒక వేళ ఈ ప్రశ్నకు అవును అన్నదే మీ సమాధానం అయితే స్వయంగా ఎవరిని అరెస్టు చేయాలి, ఎందుకు అరెసస్టు చేయాలని నిర్ణయించే అధికారాన్ని సుప్రీంకోర్టే తన చేతుల్లోకి తీసుకోవటం కాదా? ఈ పని సుప్రీం కోర్టు పరిధిలోది కాదన్నది నిస్సందేహం. కేవలం కోర్టు ధిక్కారానికి సంబంధించిన కేసుల్లోనే ధిక్కారానికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించవచ్చు. అది కూడా ధిక్కారానికి పాల్పడిన వ్యక్తి వాదన విన్న తర్వాతనే అరెస్టుకు ఆదేశాలిస్తుంది. జకియా జాఫ్రి ఫిర్యాదు విషయంలో తీస్తా సెతల్వాడ్‌ పాత్ర ఎలా ఉన్నా ఆమెను అరెస్టు చేయాలన్నది మాత్రం సుప్రీం కోర్టు ఉద్దేశం కాదని నాకనిపిస్తోంది.

మరి ఆమెను అరెస్టు చేయాలని సూచించిందా?

గౌరవ న్యాయమూర్తులు అసలు ఈ ఫిర్యాదులో భాగమే కాని వ్యక్తిని అరెస్టు చేయాలని ఆదేశించారా? అరెస్టు చేయబడిన వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేఛ్చా స్వాతంత్య్రాల విషయంలో సుప్రీం కోర్టు ఏకపక్షంగా విచక్షణారహితంగా హస్తగతం చేసుకోవటం సరైనదేనా? తాము విచారిస్తున్న ఫిర్యాదు లేదా అప్పీలులో కక్షిదారు కాని వ్యక్తిని అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు సూచించిందని చెప్పటం నమ్మశక్యంగా లేదు. తోటి కక్షిదారుని బయటి వ్యక్తిగా చేసిన విధానం గురించి తెలుసుకుందాం.
ఒకవేళ ఆమెను అరెస్టు చేయాలన్నది సుప్రీం కోర్టు ఉద్దేశ్యమో సూచనో కాదు అన్న నా అభిప్రాయం తప్పైతే ఇక ఆమెను ఆ భగవంతుడే కాపాడాలి.

ఒక వేళ నా అభిప్రాయం సరైనదే అయితే తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టు చేయాలన్నది మా ఉద్దేశ్యమో లేక సూచనో కాదని తక్షణమే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వివరణ జారీ చేయగలరా? అంతేకాదు. గౌరవ న్యాయమూర్తులు బేషరతుగా తీస్తాను విడుదల చేయాలని కూడా ఆదేశించాలి. ఆమె అరెస్టుకు, ఖైదులో ఉంచటానికి కారణమైన ఎఫ్‌ఐఆర్‌ను తక్షణమే రద్దు చేయాలి.
ఒకవేళ న్యాయమూర్తులు మౌనవ్రతం దాలిస్తే ఆమెను భగవంతుడే కాపాడాలన్న నా వ్యాఖ్య తప్పు కాబోదు.

ఒకవేళ నా ప్రశ్నకు ‘కాదు’ అన్నదే మీ సమాధానం అయితే మీ తీర్పు అనంతరం గుజరాత్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక బృందం ఆఘమేఘాల మీద ఆమెను అరెస్టు చేయటం పట్ల మీరు కానీ మీ మార్గదర్శకత్వంలో మరొకరు కానీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అహ్మదాబాద్‌లోని డిటెక్షన్‌ ఆఫ్‌ క్రైం బ్రాంచిలో పని చేస్తున్న ఇనస్పెక్టర్‌ దర్శన్‌సిన్మ్‌ బారాద్‌ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆధారం చేసుకుని యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ రంగంలోకి దిగిందన్నది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
సరే.

ఎఫ్‌ఐఆర్‌కు ప్రాతిపదిక ఏమిటి?

ప్రాథమిక దర్యాప్తు నివేదిక దాఖలు చేయటానికి ఆధారమైన సమాచారం ఏమిటి? ప్రధానంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని పేరాగ్రాఫులను ఉటంకిస్తూ, ఆయా పేరాలపై ఆధారపడే ఈ ప్రాథమిక దర్యాప్తు నివేదిక దాఖలు అయ్యిందని అందుబాటులో ఉన్న సమాచారం, వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. సుప్రీం కోర్టు చేసిన కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు కూడా ఈ ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

తీస్తా చేసిన నేరం ఏమిటి? దీనికి సంబంధించి కూడా వార్తా కథనాల సమాచారమే నాకు ఆధారం. నిర్దోషులను ముద్దాయిలుగా మార్చేందుకు కుట్రపూరితంగా వ్యవహరించిందన్నది ఆమెపై ఉన్న ఆరోపణ. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు నిర్దోషులుగా భావించబడుతున్న వారిని కేసుల్లో ఖైదు చేయటం, మరికొన్ని సందర్భాల్లో తప్పుడు ఎన్కౌంటర్లలో చంపేయటం మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి ఘోరాలతో పోల్చినప్పుడు (తీస్తా నిజంగానే ఆ పని చేసిందని అనుకున్నా) అందులో పెద్దగా గొంతు చించుకోవాల్సిందేముంది?

ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ప్రస్తావించిన భారత నేర శిక్షాస్మృతి సెక్షన్లు ప్రధానంగా ఫోర్జరీ, పోర్జరీ చేసిన పత్రాన్ని వాస్తవమైనదిగా చూపించటం, తప్పుడు సాక్ష్యం ఇవ్వటం, ప్రత్యేకించి కొందరికి సాధ్యమైనంత పెద్ద శిక్షలు పడేలా తప్పుడు సాక్ష్యాలు ఇవ్వటం, నేరపూరితమైన కుట్రతో సహా మరికొన్ని అటువంటి నేరాలకు సంబంధించినవే.

అయితే ఇందులో ఏ ఒక్కటీ ఉగ్రవాద చర్య కాదు. మరి అలాంటప్పుడు ఉగ్రవాద వ్యతిరేక బృందాలు ద్వారా ఆమెను ఎందుకు అరెస్టు చేయించాల్సి వచ్చింది? నా
ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే మీకు నూటికి నూరు మార్కులు.

ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం ఆమెను అరెస్టు చేసి 14 రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని ఆదేశించటానికి సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చాలన్నమాట. సాధారణంగానే 14 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలన్నది ఆసాధారణమైన కోర్కె. ప్రత్యేకించి ఈ కేసులో అటువంటి కోరిక మరింత ఆసాధారణమైనది.

ఈ పరిణామాలు మనకేమి చెప్తున్నాయి? అరెస్టుకు ప్రేరేపించిన సుప్రీం కోర్టు వ్యాఖ్యలు, పరిశీలన లేదా విమర్శ ఏమిటి?

ఆశ్చర్యకరమైనదేమిటంటే సుప్రీం కోర్టు తీర్పులో నేరుగా అటువంటి ప్రస్తావనలు లేవు. కానీ ప్రత్యేక దర్యాప్తు బృందం తరఫున వాదించిన న్యాయవాదులు, గుజరాత్‌ ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాదులు అటువంటి వ్యాఖ్యలు,
అన్యాపదేశపు కోరికలను వెల్లడిరచారు.

సుప్రీం కోర్టు తీర్పు

సుప్రీం కోర్టు తీర్పు ఆరు భాగాలుగా ఉంది. మొదటి భాగం పరిచయం లాంటిది. ఈ భాగంలో పిటిషన్‌ దాఖలు చేయటానికి జరిగిన ఆలస్యాన్ని మన్నించమని కోరటానికి సంబంధించిన సుప్రీం కోర్టు స్పందన. ‘‘కక్షిదారులు (ప్రత్యేక దర్యాప్తు బృందం, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం) పిటిషన్‌లోని సానుకూల అంశాలపై ఆధారపడి పిటిషన్‌ను విచారణకు చేపట్టరాదనీ, పిటిషన్‌ దాఖలు చేయటంలో జరిగిన ఆలస్యాన్ని అర్థవంతంగా వివరించే కారణాలేవీ పిటిషన్‌లో పేర్కొనలేదనీ, అందువలన ఈ పిటిషన్‌ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించా’’నీ సుప్రీం కోర్టు తెలిపింది. ఈ అభ్యంతరాలు పక్కన పెట్టి మెరిట్స్‌ ఆధారంగానే విచారణకు చేపట్టినట్లు సుప్రీం కోర్టు తెలిపింది.

అదేసమయంలో తీస్తా సెతల్వాడ్‌ ను ఫిర్యాదుదారుగా చేర్చటం పట్ల కక్షిదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి గాను కక్షిదారులు రెండు కారణాలు ప్రస్తావించారు. 2013లో అహ్మదాబాద్‌లోని మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో దాఖలైన ప్రొటెస్టు పిటిషన్‌ కేవలం జాకియా జాఫ్రీ మాత్రమే దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తీస్తా సంతకం చేయలేదు. ఈ పిటిషన్‌ను డిశంబరు 26, 2013న మేజిస్ట్రేట్‌ డిస్మిస్‌ చేశారు.

మేజిస్ట్రేట్‌ కోర్టులో ఈ ప్రొటెస్ట్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేయటాన్ని సవాలు చేస్తూ గుజరాత్‌ హైకోర్టులో ఫిర్యాదు దాఖలు చేసినప్పుడు జకియా జాఫ్రీతో పాటు తీస్తా కూడా పిటిషన్‌పై సంతకం చేసింది. (అప్పటి వరకూ జకియాకు తీస్తా వెనకనుండి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది). అక్టోబరు 2017లో గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ పిటిషన్‌ దాఖలు చేయటానికి తీస్తాకు అర్హత లేదనీ అందువలన మేజిస్ట్రేట్‌ కోర్టు తీర్పును ఖరారు చేస్తున్నామని ప్రకటించింది. ఆ మాటకొస్తే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కూడా సంతకం చేసే అధికారం తీస్తాకు లేదు.

ఇక రెండో భాగంలో కక్షిదారులు ‘‘ తీస్తా గతం గురించిన అవగాహన కలిగి ఉండాలని గుర్తు చేశారు. పరిస్థితుల వలన అసలు నష్టపోయిన వ్యక్తి జకియా జాఫ్రీ. జకియా భావోద్వేగాలను తీస్తా తన లక్ష్యాల సాధనకు అనువుగా మల్చుకుని కక్షసాధింపు ధోరణిలో ఈ కేసులు కొనసాగిస్తూ వచ్చింది. దీని వెనక లోతైన వ్యూహం ఉన్నది.’’ అన్న వాక్యాలు. ఈ వాక్యాలకు సుప్రీం కోర్టు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. తీర్పు పాఠంలోని రెండు, మూడు పేరాల్లో ప్రస్తావించినట్లు తీస్తాకు ఫిర్యాదిదారుగా ఉండే హక్కు ఉందా లేదా అన్న అంశాన్ని చర్చకు పెట్టింది.
‘‘… ఈ విషయాన్ని తగిన కేసులో నిర్ధారించటానికి వీలుగా ప్రస్తుతానికి పక్కన పెడుతున్నాము. ప్రస్తుత విచారణలో ఫిర్యాదుదారుగా ఉండే హక్కు తీస్తాకు ఉందా లేదా అన్న అంశంపై మేము చర్చను మళ్లించదల్చుకోలేదు.
ఈ వెలుగులో పిటిషన్‌లోని బలాబలాల ఆధారంగా పిటిషన్‌దారు అయిన జకియా జాఫ్రీ కోరిక మేరకు ఈ ఫిర్యాదు విచారణకు చేపడుతున్నాము. ’’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

అంటే ప్రత్యేక దర్యాప్తు బృందం, గుజరాత్‌ ప్రభుత్వం లేవనెత్తిన తొలి రెండు అభ్యంతరాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. గౌరవ న్యాయమూర్తులు ఫిర్యాదులోని అంశాల బలాబలాలపై ఆధారపడి విచారణ చేపట్టారే తప్ప ఈ విచారణలో తీస్తాను కక్షిదారుగా గుర్తించలేదు. మొత్తం తీర్పులో పదేపదే ఫిర్యాదుదారు గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు జకియా జాఫ్రి గురించి ప్రస్తావించారు. తీస్తా పేరును పూర్తిగా పక్కకు నెట్టేశారు.

అయినప్పటికీ ఆమెను తీవ్రంగా ఖండిరచారు. అరెస్టు చేశారు.

సుప్రీం కోర్టు తీర్పులో ముందుబాట శీర్షికన ఉన్న రెండో భాగంలో కేవలం నాలుగు పేరాలు మాత్రమే ఉన్నాయి. ఈ పిటిషన్‌ సుప్రీం కోర్టు ముందు విచారణకు ఎలా వచ్చిందన్నదే ఆ వివరణ. పూర్తిగా వాస్తవిక ఘటనల నేపథ్యాన్ని ఈ ముందుమాటలో ప్రస్తావించారు.

తీర్పులో మూడో భాగం ఐదు పేరాలు మాత్రమే ఉన్న వాస్తవాలు అన్న శీర్షికతో ఉన్న భాగం. ఈ భాగాన్ని మరో 28 ఉపభాగాలుగా విభజించారు. స్థూలంగా ఈ వాస్తవిక ఘటనా క్రమానికి ఎటువంటి వ్యాఖ్యను జోడిరచకుండా యథాతథంగా ప్రస్తావించారు. ఒకటి రెండు సందర్భాల్లో జెనీవా కేంద్రంగా ఉన్న అంతర్జాయ మానవహక్కుల హైకమిషనర్‌ కార్యాలయానికి, ప్రత్యేక దర్యాప్తు బృందం అధ్యక్షుడికి లేఖలు రాశారు అన్న సందర్భంలో తప్ప ఈ భాగంలో కూడా ఎక్కడా తీస్తా గురించిన ప్రస్తావన, చర్చ లేదు. ఈ విషయంగా తీస్తాను వివరణ కోరితే అటువంటి పొరపాటు పునరావృతం కానీయకుండా చూసుకుంటానని తీస్తా కోర్టుకు హామీ ఇచ్చారు. దాంతో ఈ విషయాన్ని సుప్రీం కోర్టు అక్కడితో వదిలిపెట్టింది.
నాల్గో భాగంలో మూడు విభాగాలున్నాయి. పేరా 6లో జకియా జాఫ్రి వాదనలను ఎ నుండి డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు వరకూ అనేక చిన్న చిన్న భాగాలుగా విడగొట్టారు. ప్రత్యేక దర్యాప్తు బృందం వాదనలు 7(ఎ) నుండి (ఎల్‌ఎల్‌ఎల్‌) వరకూ ప్రస్తావించారు. గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వ వాదనలను ఎనిమిదో పాయింట్‌ కింద 8(ఎ) నుండి 8(ఇ) వరకూ చర్చించారు. తర్వాత తొమ్మిదో పేరా ఉంది.

ఇక్కడ కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం మరియు గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనల్లో మాత్రమే తీస్తాకు వ్యతిరేకమైన వ్యాఖ్యలు మనకు కనిపిస్తాయి.
తీస్తాకు వ్యతిరేకంగా ఉన్న వాదనలు ఏమిటి? అసలు పిటిషన్‌లో తీస్తా భాగస్వామే కానప్పుడు ఆమె గురించి కక్షిదారులు చేసిన వాదనలను సుప్రీం కోర్టు పరిగణిస్తుందా? తీస్తాకు వ్యతిరేకంగా ఆమె కక్షిదారు కాని కేసులో వాదనలు వినిపించిన ప్రత్యేక దర్యాప్తు బృందం, గుజరాత్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైనదేనా? అటువంటి పరిస్థితుల్లో ఆయా కక్షిదారుల తరఫున న్యాయవాదులను వారించటమో లేక తనపై వచ్చిన ఆరోపణలుకు సమాధానం చెప్పుకునేందుకు తీస్తాకు అవకాశం ఇవ్వటమో సుప్రీం కోర్టు చేసి ఉండాల్సింది కదా?
ప్రత్యేక దర్యాప్తు బృందం వాదనలు

తన వాదనలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం జకియా జాఫ్రీ ఫిర్యాదు నుండి 30 ఆరోపణలు, అమికస్‌ క్యురి వ్యాఖ్యలు లేదా పరిశీలనల నుండి మరో రెండు ఆరోపణలు జోడిరచి వాదించింది. ఇందులో ఒకే ఒక్క సారి మాత్రమే తీస్తా ప్రస్తావన వచ్చింది.

ఇందులో కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం చెప్పిన వివరాలేమిటి? ఆర్‌ బి శ్రీకుమార్‌ ఓ ప్రభుత్వేతర సంస్థతో కలిసి పని చేస్తున్నారు. తీస్తా కూడా ఆ సంస్థతో కలిసి పని చేస్తోంది. సారాంశం శ్రీకుమార్‌, తీస్తా ఓ ప్రభుత్వేతర సంస్థతో కలిసి పని చేస్తున్నారన్నదే ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం చేసిన ఆరోపణ. జస్టిస్‌ కృష్ణయ్యర్‌, జస్టిస్‌ పిబి సావంత్‌ (మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు)తో కూడిన ఓ ప్రైవేటు పౌర విచారణ సంస్థకు (ప్రైవేట్‌ సిటిజెన్స్‌ కమిషన్‌) కూడా తీస్తా కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిషన్‌లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన హోస్బేట్‌ సురేష్‌ కూడా సభ్యులు.

తాను నిర్వహిస్తున్న బాధ్యతలు నేపథ్యంలో తీస్తా జకియా జాఫ్రిని ప్రభావితం చేయటమే కాక జస్టిస్‌ కృష్ణయ్యర్‌, జస్టిస్‌ సావంత్‌ (జస్టిస్‌ సురేష్‌)లను కూడా ప్రభావితం చేసే (హుడ్‌వింక్‌) అవకాశాలు ఉన్నాయన్నది ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరోపణ. ప్రత్యేక దర్యాప్తు బృందం మాటల్లో ‘‘ (తీస్తా) కక్షసాధింపు స్వభావంతో న్యాయం కోసం పోరాటం పేరుతో నిరాధారవమైన ఆరోపణలో వ్యవహరించారు. ఈ కసరత్తు వెనక అసలు లక్ష్యం నేరాన్ని రాజకీయ ఘటనగా చిత్రించి సెన్సేషనలైజ్‌ చేయటం, ఉద్రిక్తతలు కొనసాగించటమే. దీనివెనక ఉన్న కారణాలేమిటన్నది ఆమెకు మాత్రమే తెలియాలి’’. అని ప్రస్తావించింది.

జస్టిస్‌ నానావతి, జస్టిస్‌ షా విచారణ సంఘాల ముందు వాంగ్మూలం ఇచ్చేలా జకియా జాఫ్రిని తీస్తా సెతల్వాడ్‌ సిద్ధం చేసింది. (ఈ ఆరోపణను న్యాయమూర్తులు అంగీకరించినట్లు కనిపించటం లేదు). తీస్తా రూపొందించిన రాతపూర్వకమైన వాంగ్మూలాలు సాక్ష్యాలుగా నమోదు చేయాలిన 19మంది సాక్ష్యులు పట్టుబట్టారని కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం న్యాయస్థానానికి నివేదించింది. ఇవన్నీ ఒకేలా కంప్యూటర్‌లో ముందే తయారు చేయబడి సంతకాలతో సిద్ధంగా ఉన్న వాంగ్మాలాలే తప్ప వారి స్వంత అభిప్రాయాలు కావు. మరో మాటగా చెప్పాలంటే తీస్తా ఐదుగురు గౌరవ న్యాయమూర్తులను బురిడీ కొట్టించిందన్నమాట.

ఆమెకు అభినందనలు చెప్పాలి.

ఈ విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం తీస్తాపై మోపిన ఆరోపణలు సారాంశం ఏమిటంటే జకియా జాఫ్రి తీస్తా ప్రభావంలో ఉండి ఆమె చెప్పినట్టు ‘‘నిరంతరం వెంటబడటం, వాంగ్మూలం ఇవ్వటం, పట్టు బట్టి ఫిర్యాదులు చేయటం’’ చేసింది.
సుప్రీం కోర్టు నియమించిన అమికస్‌ క్యూరికి ఒకటికన్నా ఎక్కువసార్లు తీస్తా సహాయం చేసిందని చెప్పటం ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదనలో మరో ఆసక్తికరమైన అంశం. గౌరవ అమికస్‌ క్యూరికి తీస్తా మీద ఎటుటవంటి అభ్యంతరాలు, ఆరోపణలు లేవు.

నిజానికి తీస్తా మీద పూర్తి స్థాయిలో ధ్వజమెత్తింది గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం. ‘‘మొత్తం గుజరాత్‌ రాష్ట్రాన్ని అప్రదిష్టపాల్జేయటానికి ఈ ఘటనల వెనక ఓ విస్తృతమైన రాజకీయ కుట్ర దాగి ఉందని దురుద్దేశ్యపూర్వకంగా తీస్తా నిరంతరం ప్రచారం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది అన్నారు. తీస్తా తన కథనంతా నడిపించానికి జకియా జాఫ్రి వంటి ఓ బలహీనురాలిని ఎంపిక చేసుకుని ఆమెను ప్రభావితం చేసి 2006లో ఆమే ఫిర్యాదు చేసేలా చేసిందన్నది గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ. తీస్తా వాస్తవాలు పోగు చేసి సాక్ష్యాలు సృష్టించింది. దీనికి కోసం భవిష్యత్తులో సాక్ష్యులుగా, ఫిర్యాదిదారులుగా ఉపయోగపడతారనుకున్న వాళ్ల ద్వారా తప్పుడు పత్రాలు కూడా సృష్టించింది. సాక్ష్యులను ప్రభావితం చేయటమే కాక ముందుగానే తయారు చేసిన వాంగ్మూలాలపై సంతకాలు తీసుకుని హైకోర్టు మొదలు అనేక వేదికల్లో సమర్పించేలా చేస్తుంది. ఈ విషయాన్ని గతంలో గుజరాత్‌ హైకోర్టు గుర్తించింది. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను, అధికార వర్గాన్ని, పోలీసుశాఖను మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టిందుకు గాను ప్రత్యేక దర్యాప్తు బృందం ఆమెపై కూడా విచారణ చేసి ఉండాల్సింది.’’ అని రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాదన.
సారాంశంగా చూస్తే జకియా జాఫ్రి లేవనెత్తి విషయాలు నిరాధారాలు. నిరూపించలేనివి. తీస్తా కోరిక మేరకు జకియా ఈ కేసులు పట్టుబట్టి నడిపిస్తోంది. ‘‘ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్న కారణం ఒక్కటే. సమస్యను రగులుస్తూ ఉండటమే. ఇదే విషయాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం తరఫు న్యాయవాది కూడా ప్రస్తావించారు.’’ అన్నది గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వ వాదన.

నివేదనల మధింపు

తీర్పులో ఐదో భాగం వివిధ పక్షాలు చేసిన వాదనల మధింపు, ముగింపు. ఇదంతా 10 నుండి 92 పేరాల్లో ఉంది (171 నుండి 307 పేజీలు).

దాదాపు 130 పేజీల్లో తీస్తా గురించిన ప్రస్తావన కేవలం రెండు సార్లే వచ్చింది.
మొదటిసారి 2011, సెప్టెంబరు 12న స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసిన సందర్భంలో ఈ పిటిషన్‌ తీస్తా సెతల్వాడ్‌, జకియా జాఫ్రి వేసిన పిటిషన్‌ అన్న ప్రస్తావన కనిపిస్తుంది. జకియా జాఫ్రి తన నిరసన పిటిషన్‌లో ఆరోపించినట్లు ఫిబ్రవరి 27, 2002 ‘‘ ముస్లిం నివాస ప్రాంతాల్లో కుట్రపూరితంగా హత్యాకాండ సాగించటానికి ఓ సమావేశం జరిగింది’’ అని చెప్పే సందర్భంలో తీస్తా పేరు ప్రస్తావన కనిపిస్తుంది. ఇటువంటి సమాచారం తీస్తాకున్న విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చింది. అదే విషయాన్ని తీస్తా జకియా జాఫ్రికి కూడా తెలియచేసింది. మరెక్కడా ఆమె ప్రస్తావన లేదు. తీస్తాను అసలు ఫిర్యాదుదారుగానే సుప్రీం కోర్టు గుర్తించలేదు కాబట్టి తుది తీర్పులో ఆమె పేరు ప్రస్తావన లేకపోవటం పెద్ద ఆశ్చర్యం కలిగించే అంశమేమీ కాదు. కేసులో కక్షిదారు కాని వారి గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేయటం మర్యాద కాదన్న సాంప్రదాయం పట్ల సుప్రీం కోర్టు అప్రమత్తంగానే ఉంది.

అయితే కొన్ని ప్రస్తావనలు గమనించినప్పుడు అవి తీస్తా గురించి చేసిన వ్యాఖ్యలే అని మనం అర్థం చేసుకోవచ్చు.

‘‘ఇక్కడ నిర్ధారించాల్సిన అంశాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం సుప్రీం కోర్టు ఈ ఫిర్యాదులోని అంశాలను పరిశీలించాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, మేజిస్ట్రేట్‌ను కోరటం ప్రస్తుత కేసుకు సంబంధించిన విలక్షణ వాస్తవం’’ అని సుప్రీం కోర్టు అభిప్రాయపడిరది. అందువలన సుప్రీం కోర్టు తీర్పును ఈ పరిమితికి లోబడే అధ్యయనం చేయాలి. అర్థం చేసుకోవాలి. ఇదే అంశాన్ని సుప్రీం కోర్టు

‘‘ఫిర్యాదుదారు 2006 జూన్‌ 8న దాఖలు చేసిన ఫిర్యాదులోని ఆరోపణలపై విచారణ జరపాలని సుప్రీం కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించటం ఆయా ఫిర్యాదులోని ఉన్నత స్థాయిలో కుట్ర జరిగిందనీ, ఆ కుట్ర పర్యవసానంగానే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో హింస చెలరేగిందనీ వంటి ఆరోపణల పరిమితికి లోబడే ప్రస్తుత కేసును పరిశీలించాలి.’’ అని స్పష్టం చేసింది.

ఈ పరిమితికి లోబడి వ్యవహరించే క్రమంలోనే సుప్రీం కోర్టు కొన్ని పరిశీలనాత్మక వ్యాఖ్యలు చేసింది. ఉదాహరణకు

‘‘సంజీవ్‌ భట్‌, హరీన్‌ పాండ్యా, ఆర్‌ బి శ్రీకుమార్‌ల వాంగ్మూలాలు ప్రధానంగా విషయాన్ని రాజకీయంగా ఉద్వేగపూరితమైన అంశంగా మార్చటమేనంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున వినిపించిన వాదనల్లో బలం ఉందని భావిస్తున్నాము.’’
ఇక్కడ కూడా తీస్తా గురించిన ప్రస్తావన ఏమీ లేదు.

‘‘ఫిర్యాదుదారు (జకియా) తన ఫిర్యాదులో కొద్దిమంది ముద్దాయిల పేర్లు ప్రస్తావించినా ఈ జాబితా పూర్తి జాబితా కాదనీ, ఇంకా చేర్చాల్సిన పేర్లు చాలా ఉన్నాయని చెప్పేందుకు సాహసించింది. ఈ నిరసన పిటిషన్‌లో (514 పేజీల నిడివిగల) అనేక కేసుల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా పరోక్షంగా సవాలు చేస్తున్నారు ఫిర్యాదుదారు. దానికి గల కారణాలు ఏమిటన్నది వారే వెల్లడిరచాలి. ఆమె ( ఫిర్యాదుదారు) మరెవరి ప్రోద్భలంతోనో ఈ పని చేసిందన్నది వాస్తవం. నిజానికి ఈ నిరసన పిటిషన్‌లోని గణనీయమైన అంశాలు వేర్వేరు వ్యక్తులు దాఖలు చేసిన అఫిడవిట్లలో ఉన్నాయి. ఇవన్నీ సత్యదూరమైనవని (న్యాయస్థానాలు) భావించాయి.’’

ఇక్కడ ఆ మరెవరో అన్న ప్రస్తావన తీస్తా గురించే అని మనం నిశ్చింతగా నిర్ధారణకు రావచ్చు.

ఇక తుది వేటు ఇక్కడ పడిరది.

‘‘అంతిమంగా గుజరాత్‌లో అసంతృప్తి చెందిన కొందరు అధికారులు అవి సత్యదూరమైన విషయాలే అని తెలిసినప్పటికీ అటువంటి విషయాలను బహిర్గతం చేయటం ద్వారా సెన్సేషన్‌ సృష్టించటానికి ఇతరులతో కలిసి ప్రయత్నం చేసినట్లుగా మాకు కనిపిస్తోంది. లోతైన దర్యాప్తు తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ ఆరోపణలు సత్యదూరమైనవని విస్పష్టంగా తేలిపోయింది. ప్రస్తుత ఫిర్యాదులోని అంశాలపై గత పదహారేళ్లుగా (8.6.2006లో 67 పేజీల ఫిర్యాదు మొదలుకుని 14.5.2013న 514 పేజీల నిరసన ఫిర్యాదు తో కలుపుకుని) ఈ కేసు కోసం వెంటపడుతున్నారు. ప్రత్యేకంగా ఈ దారి మళ్లించే వ్యవహారాన్ని బట్టబయలు చేసిన రాజ్యాంగ వ్యవస్థలోని ప్రతి సంస్థ నిజాయితీ నిబద్ధతలను, ప్రతి అధికారి నిజాయితీని బాహాటంగా శంకిస్తూ వచ్చారు. (ప్రత్యేక దర్యాప్తు బృందం తరఫు న్యాయవాది మాటలు అరువు తెచ్చుకుని చెప్పాలంటే). ఇది వివాదాన్ని తాజా పరుస్తూ ఉండటానికే అన్నది నిర్వివాదం. దాని వెనక వేరే ప్రయోజనాలున్నాయి. వాస్తవానికి అటువంటి వారినందరినీ నిలబెట్టి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి.’’ అని సుప్రీం కోర్టు అభిప్రాయపడిరది.

అయితే ఇక్కడ (ఫిర్యాదుదారులకున్న) లోపాయికారీ లక్ష్యం ఏమిటన్నది సుప్రీం కోర్టు వివరించలేకపోయింది.

ఒకవేళ తీస్తాకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శ, వ్యాఖ్యలు లేదా మందలింపు చేయాలని సుప్రీం కోర్టు భావిస్తే నేరుగానే ఆ పని చేయవచ్చు కదా. ఇటువంటి అనుచిత పరోక్ష వ్యాఖ్యలు దేనికి? తీస్తా కూడా అప్పీలు దాఖలు చేసినందున ఆమె వాదన కూడా వినిఉండాల్సింది కదా. అలా కాకుండా పూర్తిగా ఆమె ఫిర్యాదును నిర్లక్ష్యం చేసి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎందుకు?

బహుశా తీస్తా పట్ల అసమంజసంగా వ్యవహరించకూడదని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు భావించి ఉండొచ్చు. కానీ ఇటువంటి నివారించగలిగిన అనుచిత వ్యాఖ్యల ద్వారా సుప్రీం కోర్టు ఆమె పట్ల అన్యాయంగానే వ్యవహరించింది. రాష్ట్ర పోలీసులు వచ్చిన ముంబయిలో ఉన్న తీస్తాను అరెస్టు చేసి ఖైదు చేయటం దాని పర్యవవసానమే.

ఈ తీర్పులో ఆఖరి భాగం అనుబంధంగా ఇచ్చిన సమాచారం. ఇందులో అమికస్‌ క్యూరి వ్యాఖ్యలు, దానికి ప్రత్యేక దర్యాప్తు బృం సమాధానం ఉన్నాయి. ఇవి చదవదగ్గ ఆసక్తికరమైనవి.

తీర్పు అనంతర పరిణామాలు

ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించమని సుప్రీం కోర్టు 2006 మార్చిలో ఆదేశాలు జారీ చేసినప్పుడు ఆచరణసాధ్యమైనంత త్వరలో ఈ బృందాన్ని నియమించాలని, పది రోజుల్లోనే నియమించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ తాజా వివాదంలో తీస్తా తప్పు ఎంచటానికి గుజరాత్‌ ప్రభుత్వం అదే సుప్రీం కోర్టు వ్యాఖ్యల ఆధారంగా మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాత్రికిరాత్రే నియమించింది. ఇంత వేగంగా గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం స్పందించటాన్ని గమనిస్తే ఏమి అర్థమవుతుంది?

ఇక ఆసల్యానికి వస్తే అవును. ఈ ఫిర్యాదు కోసం ఫిర్యాదుదారులు పదహారేళ్లుగా ఎదురు చూస్తు ఉన్నారు. ఎందుకు చూడకూడదు? నేడు తీసుకున్న నిర్ణయమే పదహారేళ్ల క్రితమే తీసుకోవాల్సిన మన న్యాయ వ్యవస్థ నత్తనడక కారణంగా ఫిర్యాదుదారులు పదహారేళ్లు ఎదురు చూడాల్సి వస్తే అది ఫిర్యాదుదారుల తప్పు ఎలా అవుతుంది? 2008 మార్చి 26న ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రత్యేక దర్యాప్తు బృందం తనకు నిర్దేశించిన పనిని మూడే మూడు నెల్లల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ‘‘ దర్యాప్తు పూర్తి చేసి తుది నివేదికను సీల్డ్‌ కవర్‌లో సుప్రీం కోర్టుకు సమర్పించాలి. దీనికి గాను ప్రత్యేక దర్యాప్తు బృందానికి కేటాయించిన మూడు నెల్ల కాల వ్యవధిలోనే ఈ పని పూర్తి చేయాలి’’ అని స్వయంగా సుప్రీం కోర్టే చెప్పింది.

కానీ ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం తమ తుది నివేదికను 2011 సెప్టెంబరు 12కి గానీ సమర్పించలేకపోయింది. ఈ ఆలస్యానికి జకియా జాఫ్రి, తీస్తాలు ఎలా బాధ్యులు అవుతారు?

జకియా జాఫ్రి దాఖలు చేసిన నిరసన పిటిషన్‌పై విచారణ పూర్తి చేయటానికి మేజిస్ట్రేట్‌ కోర్టుకు దాదాపు రెండేళ్లు పట్టింది. ఈ ఆలస్యానికి కూడా తీస్తాయే కారణమా?

మేజిస్ట్రేట్‌ తీర్పుపై జకియా జాఫ్రి తీస్తాలు 2014లో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ గుజరాత్‌ హైకోర్టు ఈ రివిజన్‌ పిటిషన్‌పై 2017 సెప్టెంబరు 5న గానీ తీర్పు వెలువరించలేకపోయింది. అంటే దాదాపు మూడేళ్లు పట్టింది. ఆ జాప్యానికి జకియా జాఫ్రి మరియు తీస్తాలు కారణమా?

జకియా జాఫ్రి (తీస్తా) సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను (216 రోజుల జాప్యం తర్వాత) 2018లో దాఖలు చేశారు. కానీ సుప్రీం కోర్టు తీర్పు 2022లో ఇచ్చింది. ఈ జాప్యానికి వారిద్దరే కారణమా?

వివాదాన్ని సజీవంగా ఉంచటం మాటేమిటి? సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన మరునాడే గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆప్రదిష్ట పాల్చేయటానికి తీస్తా కుట్ర పన్నిందన్న ఆరోపణలపై ఆమెను అరెస్టు చేయటానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించటం చూస్తే వివాదాన్ని నిరంతరం సజీవంగా రగిలించి ఉంచుతోంది ఎవరు అన్న ఆశ్చర్యం కలుగుతుంది. సుప్రీం కోర్టు ఈ వివాదానికి తెర దించింది. కానీ. గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం వివాదానికి తెరదించటానికి సిద్ధంగా లేదు.
చివరిగా సుప్రీం కోర్టు ముందు పరిశీలనకు వచ్చిన సమస్య ‘‘(గుజరాత్‌) ఘటనల వెనక లోతైన కుట్ర జరిగిందన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ఏమి చెప్తోందో అంతవరకే పరిమితం’’. కానీ తీర్పులో ఈ వివాదాన్ని రగిలించి ఉంచే ప్రయత్నంలో న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని వ్యాఖ్యానించాల్సిన అవసరం సుప్రీం కోర్టుకు ఏమొచ్చిందఙ? అటువంటి తీవ్రమైన మందలింపు తుది తీర్పులో ఉన్న తర్వాత తీస్తా అరెస్టు కాకుండా ఎలా ఉంటుంది? నిరంతరం న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాలు, ప్రత్యేకించి పోలీసు విభాగాల విషయంలో సుప్రీం కోర్టు ఎప్పుడన్నా అటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయగలిగిందా?
ఏతావాతా కోర్టుకు సహాయమందించటంలో చేసిన కృషికి అమికస్‌ క్యూరికి ధన్యవాదాలు చెప్పటం సాంప్రదాయంగా జరిగే పనే. కానీ గౌరవ న్యాయమూర్తులు ఆ మాత్రం ధన్యవాదాలు కూడా చెప్పలేకపోయారు. ఎందుకో అన్న ఆశ్చర్యం నాకు కలిగింది.

ఇక మన ముందు మిగిలిన ఏకైక ప్రశ్న ఇది : తీస్తా న్యాయం పొందేందుకు అర్హురాలేనా?

(జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి. ది వైర్‌లో రాసిన వ్యాసానికి కొండూరి వీరయ్య అనువాదం).

RELATED

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నమ్మకద్రోహానికి వారసుడు రాజగోపాల్ రెడ్డి…

• కాంగ్రెస్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి : టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నేడు...