జాతీయం Karal Marx: మహామానవ స్వప్న శిల్పి - మార్క్స్

Karal Marx: మహామానవ స్వప్న శిల్పి – మార్క్స్

ONCE UPON A TIME, 204 YEARS AGO

Karal Marx: అప్పుడెప్పుడో, 1960 దశకంలో, ఏలూరులో, పచ్చగా కళకళ్ళాడుతూ పిట్టలతో, పూలతీగలతో కణ్వమహర్షి ఆశ్రమంలా వుండే మా యింట్లో ఒక మునిమాపు వేళ విన్నాను – కార్ల్ మార్క్స్ అనే పేరు. ఎర్ర రంగు కాగితంలో చుట్టి నా చిన్నారి చేతిలో పెట్టినట్టు – మా నాన్న తాడి అప్పలస్వామి యిచ్చిన బహుమతి అది.

ఎలిమెంటరీ స్కూలు పూర్తయి, ఆరో తరగతి సుబ్బమ్మాదేవీ హైస్కూలు లో చేరే వేళకి, అతను జర్మన్, గొప్ప మేధావి, చాలా పుస్తకాలు రాశాడనీ తెలిసింది. అమెరికా, రష్యా, లెనిన్, కమ్యూనిజం, కార్ల్ మార్క్స్ గురించి మానాన్న చెబుతూ వుండేవాడు. కమ్యూనిస్టు నాయకుడూ, మంచి వాగ్ధాటి గలవాడూ గనక ఎంతో ఇంటరెస్టింగ్ గా చెప్పేవాడు. మా జమ్ము ఇంటి వసారాలో పెద్దక్క సుశీలా, చిన్నక్క లత, ఆర్టిస్ట్ మోహన్, మా చెల్లి శకుంతల, నన్నూ కూర్చోబెట్టుకుని మా కళ్ళ ముందు ఒక గ్రేట్ రష్యన్ డ్రీమ్ ఆఫ్ రివల్యూషన్ ని ఆవిష్కరించేవాడు. మా నాన్నకి సంస్కృతం తెలుసు. హిందీ బాగా వచ్చు. ఇంగ్లీషులో ఈజీగా మాట్లాడేవాడు. ప్రపంచాన్ని కళ్ళ ముందు పరిచేవాడు.

సూర్యుడూ, చంద్రుడూ, మనకెంత దూరంలో వున్నారు? కాంతి సంవత్సరం అంటే ఏమిటి? మనం ఏ గెలాక్సీ లో వున్నాం? సూయజ్ కాల్వ ఎక్కడ తవ్వారు? ఎంత కాలం పట్టింది? క్యూబా అమెరికాకి ఎన్ని మైళ్ళ దూరంలో వుంది? భగవద్గీత ఏం చెబుతోంది? మేనిఫెస్టోలో మార్క్స్ ప్రతిపాదించిందేమిటి? రెండో ప్రపంచ యుద్ధకాలంలో ట్రూమన్ అమెరికా అధ్యక్షునిగా వుండడం వల్ల జరిగిన నష్టం ఏమిటి? నార్మండీ లాండింగ్ అంటే… ఏం జరిగింది? యాల్టా, పోట్స్ డామ్ చర్చల ఫలితం ఏమిటి? ‘కొమింటర్న్’ అంటే? ఎం.ఎన్. రాయ్ సప్లిమెంటరీ థీసిస్ ఎందుకు సబ్మిట్ చేశాడు. కాస్ట్రో మాట విని చేగువేరా బొలీవియా వెళ్లకుండా వుండాలి కదా! మొత్తం వియత్నాం ని ఒక్క పిడికిలిగా హోచిమిన్ ఎలా నిలబెట్టాడు? సాంస్కృతిక విప్లవం పేరు మీద చైర్మన్ మావో చేసిన అరాచకాలేమిటి? గాంధీజీ లాగా భారతీయ ఆత్మని మన కమ్యూనిస్టులు ఎందుకు పట్టుకోలేకపోయారు?
కూక్లక్స్ క్లాన్ ఏం చేస్తుంది?
ఆరెస్సెస్ ఎజెండా ఏమిటి?
మార్టిన్ లూథర్ కింగ్ ని ఎందుకు చంపారు?
మన బౌద్ధాన్ని మనమే ఎలా కోల్పోయాం?

జెన్నీవాన్ వెస్ట్ ఫాలెన్ కార్ల్ మార్క్స్ నే ఎందుకు ప్రేమించింది? ఎంగెల్స్ మార్క్స్ కి ఎంత డబ్బు పంపేవాడు? మార్క్స్ రోజుకి ఎన్ని గంటలు చదివేవాడు? కులాన్నీ, అంబేద్కర్ నీ విస్మరించి కమ్యూనిస్టులు తమ గొయ్యిని బ్రిలియంట్ గా ఎలా తవ్వుకున్నారు? కమ్యూనిస్టు మేనిఫెస్టో ని స్మగుల్ చేసిందెవరు? గతితర్కం, చారిత్రక భౌతికవాదం అంటే ఏమిటి? హెగెల్ ఏమని సూత్రీకరించాడు? సర్ ప్లస్ వాల్యూ ప్రాధాన్యం ఏమిటి? దాన్ని డిస్కవర్ చేయడం ఎంత కీలకమైంది? Capital రాయడానికి ఎంత కాలం పట్టింది? మొత్తం మార్క్స్ కాంట్రిబ్యూషనే, నేను అండగా నిలిచాను అంతే .. అని చెప్పడంలో ఎంగెల్స్ నిబద్ధత ఎంత గొప్పది! త్యాగం, నిజాయితీ, ఔదార్యం కలిసిన ఎంగెల్స్ వ్యక్తిత్వం ఎలా ఉన్నతమైనది? మార్క్స్, ఎంగెల్స్ తెగువ, మొండిధైర్యం, పోరాటపటిమ వల్ల మానవాళికి జరిగిన మహోపకారం ఏమిటి? – ఇలాంటి సవాలక్ష విషయాల్ని మా నాన్న ప్రవాహంలా చెబుతూనే వుండేవాడు. ఆ నాన్ స్టాప్ ఉపన్యాసాల వల్ల, ఈ కార్ల్ మార్క్స్ అనే నాయాలు తక్కువ నాకొడుకేం కాదనిపించింది.

“మార్క్స్ లండన్ లో బ్రిటిష్ లైబ్రరీకి (దాన్ని మ్యూజియం అంటారు) పొద్దున్నే తాళాలు తీసే టైంకి వెళ్ళేవాడు. రాత్రి, అక్కడివాళ్లు లైబ్రరీ మూసే టైం అయిందని చెప్పేదాకా మార్క్స్ కదిలేవాడు కాదు. అలా పుస్తకాలు చదువుతూ ఏళ్ల తరబడి కూర్చోవడం వల్ల ఆయన నడుమూ, కాళ్లూ దాదాపు చచ్చుబడిపోయాయి. అధ్యయనం … అధ్యయనం – నోట్సు తీసుకోడం, పుస్తకాలు రాయడం – జీవితాంతమూ యిదే పని చేశాడు మార్క్స్. ఆయన భార్య జెన్నీ బహు అందగత్తె. జర్మన్ రాజ కుటుంబానికి చెందిన ‘రాణి’ లాంటిది. చేతిలో చిల్లిగవ్వ లేని మార్క్స్ ని యిష్టపడి, జీవితాంతం ఆయనతోనే వుంది. వాళ్లకి ఏడుగురు పిల్లలు. పేదరికం వల్ల ఆస్పత్రులకీ, మందులకీ డబ్బు లేక మార్క్స్ కొడుకులు ఇద్దరు చనిపోయారు.

బ్రిటన్ లో బట్టల మిల్లుల వ్యాపారి కొడుకైన ఫ్రెడరిక్ ఎంగెల్స్, మార్క్స్ కి అవసరమైనపుడు కొంత డబ్బు పంపేవాడు. ఒకసారి అయిదారేళ్ళ వయసున్న మార్క్స్ కొడుకు చనిపోయినపుడు అంత్యక్రియలకి డబ్బుల్లేవు. అప్పుడు ఎంగెల్స్ కి లేఖ రాస్తూ.. మళ్లీ నిన్ను డబ్బు పంపమని అడిగేకంటే యీ చేతివేళ్ళు విరగ్గొట్టుకుంటే బావుణ్ణు- అని మార్క్స్ బాధపడ్డారు. ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా, జర్మనీ, మరికొన్ని దేశాలు మార్క్స్ ని బహిష్కరించినా, ఇళ్ళు మారడానికీ, తినడానికీ డబ్బు చాలకపోయినా జెన్నీ ధైర్యంగా మార్క్స్ కి అండగా నిలబడింది. ఆమె గనక లేకపోతే మార్క్స్ మనకి లేనట్టే” అని మా నాన్న ఎన్నోసార్లు చెప్పాడు.

అలా పదో క్లాసు నాటికే పరమేశ్వరుడు, జీసస్ క్రైస్ట్, కార్ల్ మార్క్స్ అనే ముగ్గురే యీ ప్రపంచంలో గొప్పవాళ్ళని తెలుసుకోగలిగాను. మధ్యలో ఈశ్వరుడేమిటీ? మా నాన్న లయబద్ధంగా, ప్రతి పదం స్పష్టంగా అంటూ ‘ఎవ్వనిచే జనించు’ పద్యం కొన్ని డజన్ల సార్లు చెప్పి వుంటాడు.

కట్ చేస్తే, ఇంటర్మీడియెట్ – విజయవాడ. తక్కువగా మాట్లాడే మోహన్, జనంతో కళకళలాడే విశాలాంధ్ర ఆఫీస్. బుక్ హౌస్ లో మార్క్స్ జీవిత చరిత్ర పుస్తకం కొని చదివితే నిజంగానే మతిపోయింది. ఒక్క మనిషి ఒక జీవితకాలంలోనే అన్ని పనులు చేయడమా? పర్సెవరెన్స్, టెనాసిటీ … లాంటి మాటలు మార్క్స్ కృషి ముందు దూదిపింజల్లా ఎగిరిపోతాయి.

మార్క్స్ చాలా సరదా మనిషి. ఈవెనింగ్ పార్టీలు, సిగిరెట్లు, జోకులు, అప్పటి ఫిలాసఫర్లు అందర్నీ చచ్చేటట్టు తిట్టడం, వీపు పగిలేట్టు విమర్శ రాయడం, పదునైన వాదనతో చెలరేగిపోవడం… ఎంతో నిబద్ధతతో చేసేవాడు. మార్క్స్ కి కవిత్వం తెలుసు. ఆరేడు భాషలు బాగా వచ్చు. గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ వున్నవాడు. A spectre is haunting europe, the spectre of communism అని మేనిఫెస్టో ని మొదలుపెట్టాడంటే – ఎంత హాస్య దృష్టి వుండాలి! అదీ 150 సంవత్సరాల క్రితం!

మార్క్సిజం ఒక సైన్సు. అదొక ఫిలాసఫీ. Dogma కాదది. Its a guide to action. కాయకష్టం చేసే కార్మికులే పాలకులు కావాలన్నాడు మార్క్స్ …అంటూ మార్క్సిజం గురించి పెద్ద కమ్యూనిస్టులు నాయకులు చెప్పిన ఉపన్యాసాలు ఏళ్ళతరబడి విన్నాను. ఎకనమిక్స్ స్టూడెంట్ ని అవ్వడం వల్ల మార్క్స్ వీ కొన్ని పుస్తకాలే చదివినా అర్థం చేసుకోగలిగాను. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప – అనడంలోని చమత్కారమూ, దూకుడూ భలేగా అనిపించాయి. మార్క్స్ మాటల్లోని అద్భుతమైన clarity ఆశ్చర్యపరిచేది.

రష్యన్ మహాకవి మయకోవస్కీ, లెనిన్ కావ్యంలో –

విద్యుత్ కిరణాలు ఉక్కును తినేసినట్టు
పెట్టుబడిదారీ విధానపు రోజులు నిండాయి

అప్పుడు కాలం కడుపుతో వుండి
కార్ల్ మార్క్స్ ని ప్రసవించింది (అను:శ్రీశ్రీ)

అని రాసిన మాటలు చాలాకాలం వెన్నాడాయి.

కేవలం దొంగ (thief) గురించి మార్క్స్ ఒక వ్యాసం రాశాడు. దొంగ అనేవాడి వల్ల మన సమాజానికి జరిగిన మేలేమిటో ఆయన వివరంగా చెప్పాడు. దొంగలు వుండటం వల్ల, దొంగతనం జరుగుతుందనే భయం వల్ల తాళం అవసరమయింది. అలా ఎన్నో రకాల తాళాల తయారీ మొదలైంది. గట్టిగా వుండే ఇనప షట్టర్లు వచ్చాయి. రకరకాల తలుపులూ, తాళాల ఉత్పత్తి పెరిగిపోయింది. ఇది లక్షల కోట్ల డాలర్ల వ్యాపారంగా మారింది. ఇదంతా దొంగ అనేవాడు సమాజానికి చేసిన సేవేకదా అంటాడు మార్క్స్.

అలా 19వ శతాబ్దపు గొప్ప సిద్ధాంతవేత్త నాకు 20 ఏళ్ళు వచ్చేసరికి ఒక icon గా, నిజమైన visionary గా, మానవత్వపు మహోన్నత శిఖరంగా, విశ్వమానవ విప్లవ సంగీతంగా నాలో సుడులు తిరుగుతూ ప్రవహించాడు. అలా బాల్యాన్ని విస్మయపరిచిన మొగ్గలన్నీ నా యవ్వనంలో సామ్యవాద కుసుమాలై వికసించి మానవత్వపు పరిమళంతో గుబాళించాయి.

అది 1818. జర్మనీ దేశంలో ట్రయర్ అనే చిన్న పట్టణం. ఒక మధ్యతరగతి పుణ్య దంపతుల ప్రేమ ఫలించి ఒక పిల్లవాడు పుట్టాడు, మే నెల 5వ తేదీన. ఆ బాలుడి లేత పెదవులపై విరిసింది చిరునవ్వు కాదనీ, హేళన అనీ ఆ తలిదండ్రులకు ఎలా తెలుస్తుంది?
పుట్టింది సాక్షాత్తూ శత సహస్ర బాహువుల సర్వాంతర్యామి అనీ, అది రాబోయే విప్లవ విశ్వరూప సాక్షాత్కారమనీ వాళ్లకెప్పుడు తెలియాలి! వాడికి యిష్టంగా పెట్టుకున్న ‘కార్ల్ మార్క్స్’ అనే పేరు , ఈ లోకం వున్నంతవరకూ కోటికాంతుల తేజస్సుతో విశ్వమానవ పతాకమై అజేయంగా ఎగురుతుందని వాళ్ళకెలా తెలుస్తుంది?

దేవుడు, మతం అనే 16వ శతాబ్దపు మూఢనమ్మకాల్ని తుత్తునియలు చేస్తూ, ‘అసలు సమస్యలన్నిటికీ ఆర్థికమే కీలకం’ అని మార్క్స్ చెప్పాడు. సాక్ష్యాలూ, రుజువులూ సమాజం ముందుంచాడు. పెట్టుబడి – శ్రమ, దోపిడీ – అదనపు విలువల అసలు రహస్యాన్ని విప్పిచెప్పాడు. Conditions determine the consequences అని స్పష్టంగా చెప్పాడు. కర్కశమైన, రాక్షసమైన పెట్టుబడిదారీ విధానాన్ని కూల్చివేయడం తప్ప మరోమార్గం లేదని ఆయన నమ్మాడు. కార్మికులు అంతిమ విజయం సాధించడానికి ఒక ఆర్గనైజ్డ్ పార్టీ వుండాలనీ, దానికోసం ప్రజాశ్రేణుల్ని సమీకరించాలనీ పిలుపిచ్చాడు.

అయితే, కమ్యూనిస్టులకో హెచ్చరిక చేశాడు మార్క్స్.
“మీరు గనక తెలివి తక్కువ వాళ్లయితే మీకూ, పార్టీకీ నష్టం జరుగుతుంది. మీరు బొత్తిగా తెలివిలేని వాళ్లయితే దేశానికి నష్టం జరుగుతుంది. మీరు మరీ చచ్చుపుచ్చు దద్దమ్మలైతే… మేం చచ్చి ఎక్కడున్నా ఆ అప్రదిష్ట నాకూ, ఎంగెల్స్ కీ చుట్టుకుంటుంది”.
మార్క్స్ భయపడినంతా జరిగింది.
ప్రపంచంలోని చాలాదేశాల్లో దద్దమ్మలే గద్దెలెక్కారు.
మార్క్సిజానికి మచ్చ తెచ్చారు.

Everybody’s responsibility… ఆఖరికి nobody’s responsibility గా పరిణమించిన విషాదాన్ని మనం చూశాం.

కార్ల్ మార్క్స్ ఐడియాలజీకి కాలం చెల్లింది. విశిష్టమైన ప్రజాస్వామ్యమూ, ఆధునిక పెట్టుబడిదారీ విధానమూ పరిడవిల్లుతున్న యీ కాలంలో కార్ల్ మార్క్సూ, కమ్యూనిజమూ outdated… సోషలిజం సఫా, విప్లవం అని ఇక విసిగించకండి – అంటున్నారు.
ఓకె. మార్క్స్ తో విభేదించండి.
ఆయన సిద్ధాంతాన్ని రిజెక్ట్ చేయండి.
వర్గపోరాటమూ, ఎర్రజెండా పనికిమాలినవని అనండి. అయితే, అలా ఎగిరెగిరిపడ్డానికి ముందు మార్క్స్ ని సీరియస్ గా చదవండి. వీలయితే అధ్యయనం చేయండి. రెండే పుస్తకాలు ఈ భూమ్మీద ఎక్కువగా, అంటే కోట్ల కాపీలు అమ్ముడుపోయాయి.
1.బైబిల్ . 2 కమ్యూనిస్టు మేనిఫెస్టో.
హిట్లర్ రెచ్చిపోయిన జర్మనీలోనే చాలా ఏళ్లుగా మార్క్స్ రచనలు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి.

విలువలన్నీ, మానవ సంబంధాలన్నీ ‘కేవలం డబ్బు’ అనే bottomless pit లో పడి గాడాంధకారం లోకి జారిపోతున్నపుడు… మార్క్స్ రిలవెంట్ అనిపిస్తాడేమో!
పెట్టుబడిపై ఆయన చేసిందొక చరిత్రాత్మక యుద్ధం అని తెలిసొస్తుందేమో!

ఒక గొప్ప గాయకుణ్ణి, శాస్త్రవేత్తనీ, ఆర్టిస్టునీ, అధ్యాపకుణ్ణి, రచయితని, కవినీ, నృత్యకళాకారిణినీ, సంపాదకుణ్ణి, సంగీత విద్వాంసుణ్ణి, సాంకేతిక నిపుణుణ్ణి, రోజుకూలీగా, కేవలం నెలజీతగాడిగా మార్చి, దిగజార్చివేసిన పెట్టుబడిదారీ వ్యవస్టని ఎలా ప్రేమించగలుగుతాం?

మార్క్స్ నీ, ఎంగెల్స్ నీ ఏ మొహం పెట్టుకుని కాదనగలం?
మరికొన్ని వందల ఏళ్ళయినా మార్క్స్ నిగ్గుతేల్చిన నిజం నిలిచి వెలుగుతుంది …
అది శాస్త్ర విజ్ఞానం గనక…
అది సజీవమైన ఫిలాసఫీ గనక!

TADI PRAKASH 9704541559

Also Read:

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...