జాతీయం భారతీయతను పున:ప్రతిష్టంచుకోవాలంటే..

భారతీయతను పున:ప్రతిష్టంచుకోవాలంటే..

పుష్పరాజ్‌ దేశ్‌ పాండే

అనువాదం : కొండూరి వీరయ్య

భారతదేశం వెనుతిరిగి చూడలేనంత వేగంగా సరికొత్త పతనాలకు చేరువవుతోంది. దేశంలో మితవాద రాజకీయాలు ఏ స్థాయికి చేరాయంటే దేశ పయనం ఎటువైపు అన్న అంశంపై ఉమ్మడి అవగాహనకు తావే లేకుండా పోయింది. విద్వేషం, హింస ఏ స్థాయికి చేరాయంటే ఇదెలా సాధ్యం అని నిన్న అనుకున్న మనమే రేపు ఏదైనా సాధ్యమే అనుకునే పరిస్థితులు వచ్చిపడ్డాయి. భారతీయ ప్రజాస్వామ్యం హాకింగ్‌కు గురైందనటంలో సందేహం లేదు. రాజ్యాంగ పరిషత్‌లో చర్చోపచర్చల ద్వారా తీర్చిదిద్దిన జాతీయ రాజకీయ సంస్కృతికి రీవైరింగ్‌ జరుగుతోంది.నిరవధిక ప్రగతి దిశగాఈ పతనం కేవలం 2014లోనే మొదలైందని ఎవరన్నా వాదిస్తే అది ముమ్మాటికీ పొరపాటువాదన అవుతుంది. తెర వెనక దీర్ఘకాలంగా పని చేస్తూ వచ్చిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు, విద్వేష రాజకీయాలే పునాదులుగా ఎదిగిన భారతీయ జనతా పార్టీలు ఎన్నికలతో సంబంధం లేని రాజకీయ విషయాలపై నిరంతరాయంగా పని చేస్తూ వచ్చాయి.

అయితే రెండు కీలకమైన పరిణామాలు వారికి మరిన్ని అవకాశాలు తెచ్చి పెట్టి ఈ శక్తులు చేస్తున్న పని పరిధి స్వభావాన్ని తీవ్రంగా మార్చేశాయి. జనతా పార్టీ ప్రభుత్వం తొలిసారిగా అధికార యంత్రాంగం, మీడియా, చలనచిత్ర రంగంలో వివిధ స్థాయిలో ఉన్న వారికి ఆరెస్సెస్‌ భావజాలం పట్ల సానుకూలత కలగటానికి దోహదం చేసింది. నాడు ప్రారంభించిన పని తొలి ఎన్డీయే ప్రభుత్వం హయాంలో మరింత స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగింది. దాదాపు మూడు దశాబ్దాలుపాటు సాగిన కృషి 2010`2014 మధ్య కాలంలో విపరీత పరిణామాలకు తెరతీసింది. యుపిఎ ప్రభుత్వంలో మంత్రివర్గంలోనూ, మంత్రివర్గం బయటా భాగస్వాములుగా ఉన్న వాళ్లు భారతీయ చైతన్యాన్ని పునర్య్వాఖ్యానించేందుకు పెద్దఎత్తున కృషి చేశారు. ఇక్కడ పరస్పర సంబంధం ఉన్న మూడు పరిణామాలను ప్రస్తావించాలి. అవినీతి వ్యతిరేక భారత్‌ ఆందోళణ (బిజెపి`ఆరెస్సెస్‌ అండదండలతో సాగిన ఉద్యమం అన్న అభిప్రాయం కూడా ఉంది) ప్రభుత్వానికి వ్యతిరేకతకు ప్రజామోదం తెచ్చిపెట్టింది. ఈ పరిణామాన్ని మరింత వేగవంతం చేసిన మరో సంఘటన కూడా ఈ కాలంలోనే జరిగింది.

2011 నుండీ రాజ్యాంగ యంత్రపు కీలక వ్యవస్థలను నిర్వీర్యం చేయటానికి కొద్ది మంది ఉన్నతాధికారులు ఇతోధికంగా పని చేశారు. (తర్వాతి కాలంలో వీరంతా బిజెపిలో చేరారు). వీటన్నిటి నడుమా పార్లమెంట్‌ నిర్వహణకు పదేపదే అంతరాయం కలిగించిన బిజెపి దేశానికి అవసరమైన విధానాలు రూపొందించటంలో యుపిఎ ప్రభుత్వం విఫలమైందన్న అపోహ, భ్రమ కల్పించేందుకు శాయశక్తులా ప్రయత్నం జరిగింది. ఈ మూడు ధోరణులు లేదా పరిణామాలూ వెరసి మొత్తం దేశాన్ని నాశనం చేయటంలో కులీనవర్గం (ఖాన్‌ మార్కెట్‌ గ్యాంగ్‌ / లుటియన్‌ గాంగ్‌) వీళ్లు ప్రామాణికంగా పరిగణించే రాజ్యాంగానిదే ప్రధాన బాధ్యత అన్న అభిప్రాయాన్ని సార్వత్రికం చేయటానికి కావల్సిన పరిస్థితులు కల్పించాయి.ప్రజామోదంపై పరిణామాలు ఎన్ని జరిగినా వాటికి ప్రజామోదం లేకపోతే ఉపయోగం లేదు. అయితే 2014లో బిజెపి కి దక్కిన ప్రజామోదం ప్రజాస్వామ్యపు మూల పునాదులపై ఆధారపడి వచ్చింది కాదు. సంఘపరివారం దీర్ఘకాలంలో రాజకీయ వ్యవస్థపై సాగిస్తున్న బహుముఖ దాడిలో భాగంగా ప్రజల మధ్య సాధారణ చర్చకు వచ్చే అంశాలను మార్చేసింది. సోషల్‌ మీడియా సంఘపరివారం చేతిలో సాధనంగా మారిందన్న చర్చకూడా జరిగింది.

ప్రగతిశీల శక్తులు నేటికీ ట్విటర్‌ను వేదికగా చేసుకుంటూ ఉంటే (భారతదేశంలో 23.6 మిలియన్ల ట్విటర్‌ ఖాతాలు ఉన్నాయని ఓ అంచనా), సంఘపరివారం మాత్రం యూ ట్యూబ్‌ను (దేశంలో నెలనెలా షుమారు 26.5 కోట్లమంది ట్యూబ్‌ చూస్తారు) ఫేస్బుక్‌ (32.9 కోట్లమంది భాగస్వాములు) వాట్సప్‌ (43.9 కోట్లమంది ఉపయోగిస్తున్నారు) లపై కేంద్రీకరించింది. దేశంలో ప్రతి ముగ్గురిలోనూ ఒకరు రోజూ ఈ వేదికల ద్వారానే రాజకీయాలు తెలుసుకుంటున్నారు. అందులో సంఘపరివారం దృక్ఫధంలో ఉన్న రాజకీయాలే అత్యధికభాగం ప్రసారం ప్రచారం అవుతున్నాయి. దీంతో పాటు జనరంజక సాంస్కృతిక రంగాన్ని, (యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిష్టర్‌, యురి : ది సర్జికల్‌ స్రైక్‌, పిఎం నరేంద్ర మోడీ, తాష్కెంట్‌ ఫైల్స్‌, కాశ్మీర్‌ ఫైల్స్‌ వంటి సినిమాలు విరివిగా విడుదలయ్యాయి) మీడియా ఛానెళ్లు, పుస్తకాలు, మేధోమథన బృందాలు ఒకటేమిటి…. అనేక రంగాలు, మార్గాల ద్వారా సంఘపరివారం సందేశాలను ఓటర్లకు చేరవేసే పనిని ఓ యజ్ఞంలా చేపట్టింది.విద్యావ్యవస్థను గణనీయంగా మార్చటం ద్వారా సంఘపరివారం మన వారసత్వం గురించిన చైతన్యాన్ని కూడా (బోధనాంశాలు మార్చటం, ఆరెస్సెస్‌ కేడర్‌ను అధ్యాపక సిబ్బందిగా విశ్వవిద్యాలయాల్లో నియమించడం) మార్చేందుకు సంఘపరివారం అవిరళంగా కృషి చేస్తోంది. సంఘపరివారం ఈ పని చేసినందుకు గాను అటువంటి నియామకాల ద్వారా లబ్దిపొందిన వ్యక్తులు ఏ సామాజిక తరగతులకు చెందినవారో ఆయా సామాజిక తరగతుల్లో రాజకీయ పలుకుబడి పెంచుకోవటం, ధార్మిక సంస్థలకు క్షేత్రస్థాయి వరకూ ఉన్న నిర్మాణాన్ని దుర్వినియోగం చేయటం, చీకటి తెరలమాటున నడిచే సంస్థలు, వ్యవస్థలతో ప్రవాస భారతీయులను ప్రభావితం చేయటం, ఈ కసరత్తులో ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు కూడా భాగస్వాములయ్యాయి.

ఇక్కడ సంఘపరివారం కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే పని చేయటం లేదన్న వాస్తవాన్ని ప్రగతిశీలవాదులందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. భారతదేశ రాజ్యాంగ పునాదులపై సంఘపరివారం సాగిస్తున్న పోరాటంలో ఎన్నికలు కేవలం ఓ బహిరంగ పోరాటం మాత్రమే. సోదర భారతీయుల ఆలోచనలు, అవగాహనలను గణనీయమైన మోతాదులో పునర్య్వాఖ్యానించటానికి, అవగాహనలను తారుమారు చేయటానికి సంఘపరివారం ఇతోధికంగా సాగించిన కృషి వలన ఎన్నికల ప్రకటన రాకముందే జనం తమ ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ఓ నిర్ణయానికి రావటానికి ఉపయోగపడిరది. ఈ ప్రయోగం ఎంత విజయవంతంగా సాగుతోందంటే యావత్‌ రాజకీయ తరగతిని ప్రభావితం చేస్తోంది. ఫలితంగానే తరతమ తేడాలు లేకుండా ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలన్నీ కులం, మతం, ప్రాంతం, పితృస్వామికత వంటి అనేక మితవాద లక్షణాలను పెంచిపోషిస్తూ వచ్చాయి. తమ రాజకీయ సమీకరణ వ్యూహాలకు ఈ ధోరణులను పూసల్లో దారంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ పరిస్థితి దేశపు సామాజిక మనోభావాల్లో ఎంత దారుణంగా తయారైందంటే సమూలంగా బిజెపిని వ్యతిరేకించే వారు సైతం బిజెపిని ఓడిరచటానికి, బిజెపిపై పైచేయి సాధించటానికి ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. మరికొందరు కేవలం 2029 తర్వాత మాత్రమే బిజెపిని ఓడిరచగలమని సర్దిచెప్పుకుంటున్నారు (బహుశా అప్పటికి పార్టీ, సంఘపరివారం పగ్గాలు కొత్తతరం నాయకత్వం చేతికి వస్తాయని భావిస్తున్నారు).ఈ రకమైన సైద్ధాంతిక గందరగోళం, పలాయనవాదం భారతదేశపు ప్రయోజనాలు సాధించటంలో ఏమీ ఉపయోగపడదు. ఇక్కడ భారత రాజ్యాంగ పునాదులపై బిజెపి నిరంతరం చేస్తున్న దాడి వలనే మనం ఈ పరిస్థితి తలెత్తిందని అనుకోరాదు.

స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎలాగైతే ప్రగతిశీల శక్తులపై మొత్తం రాజ్యం తన బలాన్ని ప్రయోగించిందో నేడు కూదా అదే పరిస్థితి తలెత్తుతోంది. రోజురోజుకూ కొత్తకొత్త శతృవులు తెరమీదకు వస్తున్నారు.ప్రగతిశీల శక్తులపై పైచేయిఈ పరిస్థితులన్నింటికీ సంఘపరివారమే కారణమని చెప్పుకోవటం కూడా సరికాదు. నేడు ప్రగతిశీల శక్తులు అత్యధికులు డిజిటల్‌ ప్రపంచంలో దుర్భిణీ వేసి మరీ వెతికితేకానీ కనిపించని అరుదైన జాతిగా మిగిలిపోయారు. అవును. వారసత్వంగా వచ్చిన నిర్మాణ వ్యవస్థల పరిమితులుతో పాటు వనరుల కొరత కూడా వీరికి ప్రధాన అవరోధంగా మారింది. వీటన్నింటికీ మించి బిజెపిపై సాగించే పోరాటంలో ఈ ప్రగతిశీల శక్తులు కాలం చెల్లిన ఎత్తుగడలకు పరిమితం కావడమే వీరిపై సంఘపరివారం తేలిగ్గా పైచేయి సాధించటానికి అవకాశమిస్తోంది. సంఘపరివారంపై పోరాడాల్సిన ప్రగతిశీల శక్తులన్నీ సాంప్రదాయక నిరసన రూపాలైన అర్జీలు, ధర్నాలు, నిరసనలు, బహిరంగలేఖలు, పత్రికా సమావేశాలు, ట్విటర్‌ పోస్టులకు పరిమితం అయ్యాయి. మీడియాపై బిజెపి సాధించిన పట్టులో లేశమెత్తయినా మార్పును ఈ రూపాల్లో సాధించలేము. ఒకవేళ సాధించినా యథాతథ స్థితిని దాటి ముందుకెళ్లలేము. సామాజిక కార్యకర్తలు నిరంతరం పాలకుల లక్ష్యంగా మారుతుంటారు. ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. ప్రభుత్వాధినేతలు రాలిపోతున్నారు. ప్రభుత్వ సంస్థలు వేధింపులు సాధనాలయ్యాయి. అయితే ఈ సృజనాత్మక సుషుప్తావస్థతతో నిశ్శబ్దంగా ఉండే మెజారిటీ ప్రజల మెప్పు పొందలేదు. వారికి ఉత్సాహం కల్గించలేదు. పైగా బిజెపికి ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయం కలిగిస్తుంది. ప్రగతీశల శక్తులు ఈ దేశాన్ని ఆకర్షించే స్థాయిలో ఆసక్తికరమైన ఆకర్షణీయమైన భావిచిత్రపటాన్ని చూపించలేకపోతున్నాయి. రాజనీతి, జనరంజక రాజకీయాలు నడిపే సామర్ధ్యాన్ని కోల్పోయాయి. ఎంతో కొంత వనరులను ఈ ఎత్తుగడల కోసం వెచ్చించినా ఏదో చేశామన్న తృప్తి తప్ప పెద్దగా వీరు సాధించేదేమీ లేదు.కోలుకొనే మార్గంప్రగతిశీల శక్తులు కీలకమైన విషయాల్లో తమతమ ఆలోచనలు, అవగాహనలు, ఆచరణ రీతలను పున:సమీక్షించుకుని సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ చైతన్యాన్ని పునర్నిర్మించటం ఎలా అన్నదే మనందరి ముందున్న కీలకమైన కర్తవ్యం. కేవలం ఎన్నికల్లో గెలవటం ద్వారానో లేక మచ్చుకు చేపట్టే ఆందోళనలు, ఉద్యమాలు, ఎత్తుగడల ద్వారానో ఈ లక్ష్యాన్ని మనం సాధించలేము.

ఇటువంటి తాత్కాలిక వ్యూహాలు మితవాద దిశగా సాగుతున్న ప్రయాణాన్ని నిలువరించలేవు. ప్రగతిశీల శక్తులు జాతీ మనోభావాల్లోనూ రాజకీయంగానూ ఆధిపత్య స్థానానికి చేరాలి. ఈ లక్ష్య సాధన కోసం రాజ్యాంగాన్ని సృజనాత్మక సాధనంగా ఉపయోగించుకోవాలి. ముందు భారతదేశపు సాఫ్ట్‌వేర్‌ (సంస్కృతి, విలువలు, ఆచార వ్యవహారాలు)ను, తర్వాత హార్డ్‌వేర్‌ ను (ఆర్థిక వ్యవస్థ, వ్యవస్థలు, సంస్థలు)ల్లో మౌలిక ఇంజనీరింగ్‌ చేపట్టాలి.ప్రగతిశీల శక్తులకు రాజ్యం వద్దనున్నంత సాధన సంపత్తి ఉండదు. (ఒకటి రెండు రాష్ట్రాలు మినహాయింపు కావచ్చు). కానీ వారి అమ్ములపొదిలో ఇతర బాణాలున్నాయి. పాదయాత్రలు, ప్రజలను చేరుకోవటం, రంగాలవారీగా ప్రభావం చూపే మార్గాలు, సందర్బాలు, అలవకాశాలు వెతుక్కోవడం, క్షేత్రస్థాయి ప్రచార ఆందోళనలు, జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై కార్యకలాపాలు చేపట్టడానికి క్రౌడ్‌ ఫండిరగ్‌ ద్వారా వనరులు సమకూర్చుకోవటం, బస్తీలు, పంచాయితీల స్థాయిలో సభలు నిర్వహించటం వంటి రూపాలను అనుసరించాలి. ఈ మార్గాలు, పద్ధతుల ద్వారా జనరంజకమైన ప్రత్యామ్నాయ చిత్రాన్ని ప్రజలముందుంచగలగాలి. డాటా ఎనలటిక్స్‌ను ఉపయోగించుకుని లక్షిత ప్రజానీకాన్ని చేరుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన సమాచారాన్ని చేరవేయాలి. వీటన్నిటికంటే మించి సూత్రబద్దమైన సంకీర్ణాలకు తెరతీయాలి. ఈ సంకీర్ణ భాగస్వాములు మీడియా ద్వారా, ప్రజా సాంస్కృతిక రంగం (పుస్తకాలు, సీరియల్స్‌, చలనచిత్రాలు, కామిక్‌ కథలు, నాటకాలు, జానపదాలు వంటివి) ద్వారా సామాజిక విలువలతో కూడి సందేశాలు ఇవ్వగలిగేవారై ఉండాలి. లేదా ఈ భాగస్వాములు చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజా మద్దతు సమీకరించగలిగినవారైనా అయి ఉండాలి.ఈ వ్యవస్థాగతమైన కృషి ఓ క్రమపద్ధతి ప్రకారం జరగాలి. మీడియా హంగామాతో నిమిత్తం లేకుండా రోజువారీ ఉనికికి సంబంధించిన అంశాలు, లావాదేవీల్లో మునిగిపోకుండా జరగాల్సిన పని ఇది. ఇటువంటి విశాలమైన సామాజిక మార్పు తేవడం అనేది కేవలం ఎన్నికల కసరత్తుతోనే సాధ్యమయ్యేది కాదని ప్రగతిశీల ప్రజాతంత్ర పార్టీలు గుర్తించాలి (నేడు రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల పోరాటానికి పరిమితం అయ్యాయి). భారతదేశాన్ని రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా సామాజికంగా పునర్నిర్మించే యజ్ఞానికి అంకితమై పని చేసే సంఘాలు, వ్యవస్థలను ఆయా పార్టీలు నిర్మించుకోవాలి.ఓ సందర్భంలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ‘‘శాంతిని ప్రేమించే వాళ్లు కూడా యుద్ధాన్ని ప్రేమించేవాళ్లు తమను తాము సమీకరించుకున్నట్లే సమీకరించుకోవాలి. సంఘటితమవ్వాలి.’’ అన్నారు. అందువలన గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వ్యవహరించినట్లుగానే (నేడు ఇదే వ్యూహాన్ని ఆరెస్సెస్‌ మరింత ప్రమాదకరంగా అమలు చేస్తోంది) ప్రగతిశీల శక్తులందరూ ప్రజలతో నిరంతరం సజీవ సంబంధాలు ఏర్పర్చుకోవాలి. పంచాయితీ మొదలు పార్లమెంట్‌ వరకూ ప్రజా జీవనాడితో మమేకమై ఉండాలి. అప్పుడు మాత్రమే గతానికి పూర్తిగా తిలోదకాలిచ్చి దేశాన్ని భవిష్యత్‌ వైపు నడిపించగలుగుతాము. (ఈ రకంగా గతంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికి నాజీ అనంతర జర్మనీ ప్రయత్నం చేసింది). అయితే ఈ ప్రయత్నం విజయవంతం కావాలంటే మనం ఏమిటో మనం తెల్సుకునే ఈ సైద్ధాంతిక పోరాటాన్ని మరింత ఉథృతం చేయటానికి ప్రగతిశీల శక్తులందరూ చేతులు కలపాలి. ఉమ్మడిగా కృషి చేయాలి. అప్పుడు మాత్రమే మితవాద ఛాందసుల నుండి భారతీయ ఆత్మను రక్షించగలుగుతాము.

(పుష్పరాజ్‌ దేశ్‌పాండే సమృద్ధ భారత్‌ ఫౌండేషన్‌ డెరెక్టర్‌గా పని చేస్తున్నారు. పెంగ్విన్‌ ప్రచురించే 13 సంపుటాల రీ థింకింగ్‌ ఇండియా పుస్తకమాలకు సంపాదకుడిగా ఉన్నారు. ది హిందూలు రాసిన వ్యాసానికి కొండూరి వీరయ్య అనువాదం)

RELATED

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నమ్మకద్రోహానికి వారసుడు రాజగోపాల్ రెడ్డి…

• కాంగ్రెస్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి : టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నేడు...