కుట్ర… ఈ పదం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సుప్రీం కోర్టు తీర్పు ఆధారం చేసుకుని జూలై మొదటివారంలో మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాడ్, గుజరాత్ మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆర్ బి శ్రీకుమార్, సంజయ్ భట్లను అరెస్టు చేశారు. వీరు ముగ్గురూ కలిసి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని
అప్రదిష్టపాల్జేసేందుకు, ఉద్దేశ్యపూర్వకంగా కుట్ర పన్నారన్న ఆరోపణలతో వీరిని అరెస్టు చేశారు. గుజరాత్ ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది. 2002లో గుజరాత్లో జరిగిన నరమేధం వెనక ఉన్న కుట్ర కోణాన్ని ఛేధించలేకపోయిందని పిటిషనర్లు తమ పిటిషన్లో అభిప్రాయపడ్డారు.
సుప్రీం కోర్టు మాటల్లోనే చెప్పాలంటే ‘‘కేవలం వేరే ఉద్దేశ్యాల కోసం ఈ వివాదాన్ని గత పదహారేళ్లుగా (తీస్తా) రగులుస్తూనే ఉంది. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ.
సుప్రీం కోర్టు అంతటితో ఆగలేదు. మరో అడుగు ముందుకేసి ‘‘ఇటువంటి వారినందరినీ చట్టం ముందు నిలబెట్టాలి. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి’’ అని తన తీర్పులో వ్యాఖ్యానించింది.
ఆ వేరే ఉద్దేశ్యం ఏమిటి? అటువంటి ఉద్దేశ్యాలు ఉన్న వారినందరిపైనా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కోరింది. గుజరాత్ పోలీసులు ఈ కోరికను మన్నించారు. అందుకే ఆ ‘తెరవెనుక ఉన్న కుట్రను, వివిధ సంస్థలు, వ్యక్తులు, వ్యవస్థలు తో కలిసి కొన్ని తప్పులు చేయటానికి, ప్రేరేపించటానికిగాను పొందిన ఆర్థిక, లేదా ఇతర ప్రయోజనాలను, ’ తవ్వి తీయటానికి గుజరాత్ పోలీసులు ప్రత్యేకంగా ఓ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌ను సిద్ధం చేసింది.
మనందరికీ ఓ సత్యం తెలుసు. కుట్రలు పట్టపగలే బహిరంగంగా జరగవు. అందువలన తాము ‘తెరవెనక’ ఉన్న కుట్రను ఛేధించబోతున్నామని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వర్తమాన పరిణామాలు ఏమీ తెలియని వారికి ఈ కుట్రను ఛేధించే ప్రయత్నం గుల్బర్గా సొసైటీ నరమేధంలో చనిపోయిన జకియా జాఫ్రి భర్త ఎప్ాసాన్ జాఫ్రి మరణానికి దారి తీసిన పరిస్థితులను, కుట్రలను తవ్వి తీయటానికి ప్రయత్నం చేస్తుందేమో అన్న ఆశ కలగవచ్చు. కానీ తీస్తా లాంటి వాళ్లకు ఆ మాటలకున్న అర్థం, తీవ్రత ఏమిటో తెలుసు. కుట్ర అన్న పదాన్ని విన్నప్పడు కలిగే భావన కంటే తెరవెనక కుట్ర అన్నప్పుడు మరింత లోతైన భావన కలుగుతుంది.
భాషను ఉపయోగించి ఎంతటి ఉద్రేకాన్నైనా చూపించగల ప్రపంచంలో మనం బతుకుతున్నాము. ఉదాహరణకు ప్రాధమిక దర్యాప్తు నివేదికలు (ఎఫ్ఐఆర్లు) తీసుకోండి. భారతదేశంలో పోలీసులు దాఖలు చేసే ఎఫ్ఐఆర్లలో కానీ, ఛార్జిషీట్లలోకానీ ప్రయోగించే భాష భాషా నిపుణులను సైతం గందరగోళపర్చగలిగినదిగా ఉంటుంది. ఇప్పుడు కోర్టు తీర్పులు కూడా ఈ భాషా పోటీలో ప్రవేశిస్తున్నాయి.
తాజాగా చర్చలో ఉన్న కుట్రకేసు స్వయంగా సుప్రీం కోర్టు ద్వారానే ప్రకటించబడిన లేదా గుర్తించబడిన కుట్ర కేసు. దీన్ని ఛేధించటానికి గుజరాత్ పోలీసులు సిద్ధమయ్యారు. మోడీ హయాంలో రాజ్యంచే మోపబడిన కుట్ర కేసుల్లో ఇది మూడోది. ఇంతకు ముందు భీమా కొరెగాం కుట్ర కేసు, తర్వాత ఢల్లీి కి సంబంధించిన కుట్ర కేసులు నమోదు అయ్యాయి.
ఈ మూడిరటిలోనూ ఓ అంశం ఉమ్మడిగా కనిపిస్తుంది. నష్టపోయిన వారి తరపున, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిలబడ్డ వారే ఈ మూడు కేసుల్లోనూ ముద్దాయిలుగా మారారు. ప్రభుత్వం దృష్టిలో కుట్రదారులయ్యారు. వీరంతా రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర చేశారన్నదే ఈ ఆరోపణలో ముఖ్యాంశం. ఈ కుట్ర రాజ్యాన్ని (పాలకులను) అప్రదిష్ట పాల్చేయటానికి కావచ్చు లేదా అస్థిరపర్చటానికి కావచ్చు. ఇక్కడ రాజ్యమూ, నాయకుడూ ఒకటే అన్న అర్థంలోకి చర్చ వచ్చేసింది.
అద్భుతమైన కథనం
భీమా కోరెగావ్ కేసులో పూనే సమీపంలోని ఈ గ్రామంలో జరిగిన యుద్ధంలో దేశీ సేనలు ప్రదర్శించిన పరాక్రమాన్ని ఉత్సవంగా జరుపుకుంటున్న సమయంలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఒకరు చనిపోయారు. ఇదేదో కాకతాళీయంగా జరిగిన దాడి కాదు. ఈ దాడికి కుట్ర పన్నిన వ్యక్తులు, సంస్థలకు హిందూత్వ శక్తుల అండదండలున్నాయి. దోషులెవరో గుర్తించి వారిపై ఫిర్యాదులు కూడా దాఖలయ్యాయి. ఈ దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి కేసు నడిపించేందుకు బదులు పూనే పోలీసులు అద్భుతమైన స్క్రీన్ ప్లేతో కూడిన కథనాన్ని సృష్టించారు.
భీమా కోరెగావ్ ఘటనకు దారితీసిన ఈ ఉత్సవమే అసలు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు, దేశాన్ని అస్థిర పర్చేందుకు పన్నిన కుట్రలో భాగమన్న వాదన ముందుకొచ్చింది. ఈ ఉత్సవాన్ని ఎల్గార్ పరిషత్ ఉత్సవం అని పిలిచేవాళ్లు. ఈ ఉత్సవంలో దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చారని ఆరోపించారు. ఆ నినాదాలే హింసకు దారితీశాయన్న వాదన ముందుకొచ్చింది. ఎల్గార్ పరిషత్ ఉత్సవంపై దాడికి పాల్పడిన వాళ్లు నేటికీ రాజాల్లా తిరుగుతూనే ఉన్నారు. ఈ ఘటన, దానికి సంబంధించిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలూ మొదలు కాలేదు.
ఈ ఉత్సవాల్లో పాల్గొన్న అనేకమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కుట్ర కేసులు మొదలయ్యాయి. పోలీసుల వాదన ప్రకారం ఈ ఘర్షణ స్వయంగా ఉత్సవాల్లో పాల్గొన్న వారి స్వయంకృతాపరాధమే. అందువల్లనే ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ మొత్తం కుట్ర వెనక పెద్ద కథే ఉందనీ, ఎల్గార్ పరిషత్ ఈ కుట్రకు ఆజ్యం పోసిందని పోలీసులు కథనం అల్లారు. ఈ కుట్ర వలను మరింత విస్తరించారు. ఎల్గార్ పరిషత్‌తో ఏ మాత్రం సంబంధం లేని వాళ్లును కూడా కేసుల్లోకి లాగారు. మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యావంతులు, మేధావులు, రాజకీయ ఉద్యమకారులు ఇలా అనేక తరగతులకు చెందిన వారిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు.
జెసూట్ మతాచార్యుడు స్టాన్ స్వామి మొదలు న్యాయవాది సుధా భరధ్వాజ్, సామాజిక కార్యకర్త మహేష్ రావత్, రచయిత ఆనంద్ తేల్తుంబ్దే అందరూ ప్రధాని మోడీని హత్య చేసుకుందుకు కుట్ర పన్నారని మనం నమ్మాలని పూనే పోలీసుల కోరిక. అంతే కాదు. ఇంత పెద్ద విశాల భారతదేశంలో ఈ ఐదుగురు అరాచకాన్ని సృష్టించేందుకు పథకం పన్నారన్న పూనే పోలీసుల వాదనను కూడా మనం నమ్మాలని ఆశిస్తోంది. అరెస్టయిన వారిలో మెజారిటీ సభ్యులకు భీమా కోరెగాం గొడవే తెలీదు. కానీ పోలీసుల దృష్టిలో వీరంతా దళితులను రెచ్చగొడుతున్న మావోయిస్టులు.
ఇటువంటి స్క్రీన్ ప్లే ద్వారా పోలీసులు చెప్పొచ్చేది ఏమిటంటే దేశంలోని దళితులు అమాయకులు. మానవ హక్కుల కార్యకర్తలు ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు అని. అది కూడా మహర్ దళితుల రెజిమెంట్ 200 ఏళ్ల క్రితం సాధించిన విజయాలను గుర్తు చేసుకునేందుకు అంబేద్కర్ వాదులు ఏర్పాటు చేసుకున్న సమావేశాన్ని పోలీసులు ఈ విధంగా చిత్రీకరించబూనుకున్నారు.
ఈ విధంగా పూనే పోలీసులు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పలు కుట్ర కోణాలను ‘బట్టబయలు’ చేస్తున్న తరుణంలోనే ఢిల్లీలోని పాలకులు కొత్త కోణాలను ముందుకు తెచ్చే ప్రయత్నం జరిగింది. వివక్షపూరితమైన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో ప్రజల శాంతియుత ఉద్యమం పెల్లుబికింది. ఈ ఉద్యమం దాదాపు రెండు నెలలు కొనసాగింది. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో ప్రజలు నెలల తరబడి రహదారులు దిగ్భంధనం చేశారు. తమ డిమాండ్లు ప్రభుత్వం వినిపించుకుంటుందని ఆశించారు.
ఈ ఆందోళనలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీ పోలీసుల సమక్షంలోనే ఆందోళనకారులపై విరుచుకుపడతామని భారతీయ జనతా పార్టీ నాయకులు దూకుడుతనం ప్రదర్శించారు. కొద్దికాలం తర్వాత ఈశాన్య ఢిల్లీలో మతకలహాలు చెలరేగాయి. మైనారిటీలకు చెందిన కోట్ల విలువైన ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. నిరసన శిబిరాలపై జరిగిన భౌతిక దాడుల్లో పోలీసులు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 53 మంది ముస్లింలు చనిపోయారు. మసీదులు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ముస్లింల నివాసాలు లూటీ అయ్యాయి.
ఢిల్లీ పోలీసులు హింసను ప్రేరేపించిన కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులపై చర్యలు తీసుకోవటానికి సిద్ధం కాలేదు. కనీసం ఎఫ్ఐఆర్ దాఖలు చేయటానికి కూడా పోలీసులు సిద్ధం కాలేదు. చివరకు ఢిల్లీ హైకోర్టు మందలించిన తర్వాతనే ఆ మాత్రం ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి.
ఇక్కడ కూడా పూనే పోలీసు మాదిరిగానే ఢిల్లీ పోలీసులు కూడా ఓ కుట్ర కథనాన్ని రచించారు. సమాజంలో ప్రభుత్వం పంట్ల వ్యతిరేకత పెంచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకు, అంతర్జాతీయ సమాజం ముందు దేశానికి తలవంపులు తెచ్చేందుకు ఈ ఆందోళనకారులు కుట్ర పన్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. ఈ ‘కుట్ర’లో ప్రధానంగా ముస్లిం సమాజానికి చెందిన విద్యాధికులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు ముఖ్య పాత్రధారులని కూడా ఆరోపించింది.
కానీ ఈ హింసోన్మాదాన్ని రగిలించి తొలి నిప్పురవ్వ ఎక్కడిదన్న విషయంలో మాత్రం ప్రభుత్వం నిశ్శబ్దాన్ని పాటించింది. హింసకు బలైన వాళ్లే హింసకు కారకులన్న కథనాన్ని ముందుకు తెచ్చారు. అమాయకులను అరెస్టు చేశారు. ‘ఢల్లీి కుట్ర కేసు’ ఛేధించేందుకు భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం రేయింబవళ్లు పని చేస్తోంది. చివరకు ఆధారాలేమీ దొరక్క ఈ కుట్ర కేవలం హింసను ప్రేరేపించటానికి మాత్రమే కాదనీ, హింస జరగకున్నా కుట్ర కొనసాగి ఉండేదన్న వితండవాదన అందుకున్నారు.
గుజరాత్ నరమేథం
గుజరాత్ నరమేథం విషయంలో సుప్రీం కోర్టు విచారించాలన్న కుట్ర కేసు వీటన్నిటికీ మించిన ‘కుట్ర కేసు’ ఆరోపణ. 2002 నాటి గుజరాత్ నరమేథంలో చనిపోయిన వందలాదిమందిలో జకియా జాఫ్రి భర్త ఎహసాన్ జాఫ్రి ఒకరు. ఈ విషయాన్ని దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారణల పట్ల జాఫ్రి సంతృప్తి చెందలేదు. ఈ నరమేథం గురించిన దర్యాప్తు జరపమని స్వయంగా న్యాయస్థానమే ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. జరిగిన రమేథానికి ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారికీ ఏమీ సంబంధం లేదని ఈ దర్యాప్తు బృందం తేల్చేసింది. ఈ నరమేథం కేవలం అకస్మాత్తుగా కట్టలు తెంచుకున్న ఆందోళన ఫలితం కాదనీ, లోతైన ప్రణాళికతో జరిగిందని భావించటానికి జకియాకు ఉండాల్సిన కారణాలు ఆమెకున్నాయి. ఈ నరమేథానికి రాష్ట్ర ప్రభుత్వంలోని అత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్లే పథక రచన చేశారన్నది ఆమె ఆరోపణ.
న్యాయం కోసం జకియా జాఫ్రీ సాగిస్తున్న పోరాటంలో తీస్తా సెతల్వాడ్ ఆమెకు అండగా నిలిచింది. తీస్తా సెతల్వాడ్ నేతృత్వంలో నడుస్తున్న సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సంస్థ ద్వారా వేలాదిమందికి అటువంటి న్యాయపోరాటంలో సహాయపడింది. ఆమె సాగించిన పోరాటం కారణంగానే నరమేథం కేసుల్లో అనేకమందికి శిక్షలు పడ్డాయి. జకియా కేసులో తీస్తా కూడా కక్షిదారుగా చేరింది. తీస్తా, జకియాలు తాము సర్వసత్తాక రాజ్యంతో తలపడుతున్నామని తెలుసు.
20 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. ఈ పట్టుదల పట్ల సుప్రీం కోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. అయినదానికీ కానిదానికీ భయానికో, బలానికో, ధనానికో రాజీలుపడి సర్దుకుపోయే జనం ఉన్న ఈ దేశంలో ఇద్దరు మహిళలు అంత పట్టుదలతో అంతకాలం ఎలా నిలవగలిగారు? ఏదోఒక కారణం, ఉద్దేశ్యం లేకుండానే ఇంత పెద్ద పోరాటం సాగదన్నది సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన అనుమానం. ‘వివాదాన్ని రగిలించి ఉంచటానికి’, రాజ్యం పరువు తీయటానికి, సమాజంలో చెడు అభిప్రాయం కలిగించటం వంటి కుట్రల్లో వీరిరువరూ భాగస్వాములయ్యారన్నది అభియోగం. అందువలన వారిని శిక్షించాలన్నది కోర్టు అభిమతం.
నాణ్యత లేని నాటకం స్క్రిప్టును పట్టుకుని పేవలంగా ప్రదర్శించే కళాకారుల్లాగా గుజరాత్ పోలీసులు ఈ సుప్రీం కోర్టు తీర్పును పట్టుకుని ఢల్లీి, పూనా పోలీసుల్లాగానే ‘కుట్ర కోణం’ కథకు తెరతీశారు. ఈ కథ, కథనం విస్తృతమైనది. కాబట్టి కావల్సినంతమంది నటీ నటులను (నిందితులుగా) ప్రవేశపెట్టేందుకు పోలీసు శాఖకు విచ్చలవిడి అవకాశం దొరికింది. ఈ కథ ఆధారంగా నడిచే నాటకానికి కావల్సినన్ని ఎపిసోడ్స్ పెంచుకుంటూ పోవచ్చు.
ఈ కథలో తీస్తా సెతల్వాడ్ ది ప్రధాన పాత్ర. ఆర్ బి శ్రీకుమార్, సంజీవ్ భట్లది సహాయక పాత్ర. ఈ ముగ్గురు రచించిన కుట్రకు బలైన వ్యక్తి జకియా జాఫ్రి. ప్రస్తుతం తెరమీదకు వచ్చిన పాత్రలు, ఎపిసోడ్లు ఇవి. ఇంకా ఏమేమి వస్తాయో చూడాలి.
తీస్తా కుట్ర కేసు పూర్తి రూపం తీసుకోకముందే ఢిల్లీ పోలీసులు మరో కుట్ర కేసును తెరకెక్కించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ కుట్ర కేసు కథానాయకుడు వాస్తవాలు వెలికి తీసే ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మొహ్మద్ జుబెయిర్. తప్పుడు వార్తల బాగోతాన్ని బట్టబయలు చేస్తూ విద్వేషపు ఉపన్యాసాల గురించి పాఠకులను అప్రమత్తం చేస్తున్న విలేకరి జుబెయిర్. ఇప్పుడు ఆయన వార్తా వ్యాసంగమే విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రగా పరిగణించబడిరది. అరెస్టయ్యాడు.
ఢిల్లీ పోలీసుల మాటల్లో ‘‘ మొహ్మద్ జుబెయిర్ ఉద్దేశ్యపూర్వకంగానే అన్యమతానికి చెందిన ప్రశ్నార్థకమైన ట్వీట్ పోస్ట్ చేశారు’’. ‘‘ ఈ ట్వీట్లు పదేపదే రీ ట్వీట్ చేయటం ద్వారా పదేపదే అన్యమతస్తుల భావనలను అవమానించేందుకు ఏకంగా సామాజిక మాధ్యమాల్లో ఓ సైన్యమే పని చేస్తోంది. దాంతో మత సామరస్యం దెబ్బతినే ప్రమాదంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగే పర్యవసానాలూ ఉన్నాయి’’ అని ఢల్లీి పోలీసులు అభిప్రాయపడ్డారు.
సామాజిక మాధ్యమాల్లో పని చేస్తున్న సైన్యం ముసుగు తొలగించే ప్రయత్నంలో ఢిల్లీ పోలీసులు మరింత కృషి చేయబోతున్నారు. ఢల్లీి పోలీసుల దృష్టిలో బహుశా జుబెయిర్ అటువంటి సైన్యానికి సైన్యాధిపతి అయి ఉండొచ్చు. పోలీసులకు మంచి రసవత్తరమైన పని. ముస్లింలను, ప్రభుత్వ విమర్శకులు అరెస్టు చేయటానికి మరో కుంటిసాకు.
భారతదేశం వేల కుట్రలకు వేదికగా మారింది. ఆశ్చర్యమేమిటంటే ఈ కుట్రలన్నీ సమాజంలోని బలహీనులు, పీడితులు, విద్వేషాగ్నికి ఆహుతి అవుతున్న వారూ, నిరంతరం హత్యలకు, వేధింపులకు గురవుతున్న వాళ్లు పాపం అమాయకులైన మన ‘పేద’ పాలకులకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు.
(ఢిల్లీ విశ్వవిద్యాలయం హిందీ ఫ్రొఫెసర్ అపూర్వానంద్ స్క్రోల్ ఇంటర్నెట్ పత్రికలో రాసిన వ్యాసానికి కొండూరి వీరయ్య స్వేఛ్చానువాదం.