జాతీయం India: భారతదేశంలో పెట్రోలు ధరలను నడిపిస్తోంది ఏమిటి?

India: భారతదేశంలో పెట్రోలు ధరలను నడిపిస్తోంది ఏమిటి?

Petrol Prices and Reasons in India: దాదాపు సంవత్సరం తర్వాత దేశంలో చమురు ధరలతో వినియోగదారులకు ఎండకాలం మండే సూర్యుడి కంటే మించిన వేడి పుడుతోంది. నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత చమురు ధరలు 2014 మేతో పోలిస్తే దాదాపు 35 రూపాయల వరకూ పెరిగాయి. కానీ గత సంవత్సరం జరిగిన ఐదు రాష్ట్రాల ఓటమి తర్వాత ఈ ధరాఘాతం కొంత ఉపశమించింది. ఈ సంవత్సరం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాల్గింటిలో బిజెపి నెగ్గటం, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలుపుకోవటంతో బిజెపి ప్రజలను మచ్చిక చేసుకోవాల్సిన అవసరం లేదని భావించిందని పాఠకులు అనుకునేందుకు పూర్తి అవకాశాలున్నాయి.

కానీ కేవలం దేశంలో జరిగే ఎన్నికల్లో జయాపజయాలే చమురు ధరలు, ఇతర పెరుగుతున్న ధరలను నిర్ణయిస్తున్నాయా లేక ఇతర కారణాలు పని చేస్తున్నాయా అన్నది పరిశీలించాల్సి అవసరం ఉంది. వివిధ రాష్ట్రాల్లో చమురు ఉత్పత్తులపై విధించే వాల్యూ యాడెడ్‌ టాక్స్‌, కేంద్రం విధించే ఎక్సైజ్‌ సుంకంలో వచ్చే మార్పులు కారణంగా దేశవ్యాప్తం పెట్రోలు డీజిలు ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి.

అంతర్జాతీయ పరిణామాలను బట్టి ఆర్థిక వ్యవస్థలో ఊపుతాపులుంటాయని 2008 నుండీ బడ్జెట్‌ పత్రాలు పేర్కొంటున్నప్పటికీ గత ఐదు నెలలుగా చమురు ధరల్లో ఉన్న నిలకడతనం తాజా ఎన్నికల ముగిశాక ఒక్కసారిగా పేట్రేగింది. తాజాగా ఉక్రెయిన్‌ రష్యా యుద్థంతో ప్రభుత్వానికి పెద్ద సాకు దొరికినట్లయ్యింది. దేశంలో చమురు ధరల పెరుగుదలను ప్రేరేపిస్తున్న పలు కారణాలు గురించి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

యుద్ధం

ఉన్నట్టుండి చమురు ధరలు పెరగటానికి ఓ కారణం రష్యా ఉక్రెయిల్‌ వివాదం. ఈ వివాదం నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యాపై వాణిజ్య ఆంక్షలకు పాల్పడటం అనుబంధ కారణంగా ఉంటుంది. ఈ ఆంక్షల కారణంగా రష్యాలో ఉత్పత్తి అయ్యే చమురు సహజవాయువులు ఇంతకు ముందున్నంత స్వేఛ్చగా ఇతర దేశాలకు అమ్మటానికి అవకాశం కలగటం లేదు. దాంతో ప్రపంచ చమురు మార్కెట్‌లో కృత్రిమ కొరత ఏర్పడుతోంది. గత సంవత్సరం సెప్టెంబరులో బారెల్‌ 60 డాలర్లుగా ఉన్న ముడిచమురు ధర ఈ సంవత్సరం ఫిబ్రవరి నాటికి వంద డాలర్లకు పెరిగింది.

ఉక్రెయిన్‌ పై రష్యా దాడి చేసిన తర్వాత పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించటానికి ముందే అంతర్జాతీయ చమురు కంపెనీలు ధరలు పెంచేసి కూర్చున్నాయి. మార్చిలో బారెల్‌ ముడిచమురు ధర 120 డాలర్ల వరకూ వెళ్లింది. అమెరికా, సౌదీ అరేబియా తర్వాత రష్యా ప్రపంచ చమురు మార్కెట్‌లో మూడో స్థానంలో ఉంది. రోజుకు 70, 80 లక్షల బారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది.

కోవిడ్‌ ప్రభావం

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం మొదలుకాక ముందే ప్రపంచ చమురు మార్కెట్‌ కోవిడ్‌ కారణంగా కుదేలయ్యింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలటంతో ఆయా దేశాలు కనీస అవసరాల మేరకైనా చమురు దిగుమతి చేసుకోలేకపోతున్నాయి. శ్రీలంక అనుభం దీనికి ఉదాహరణ.

భారతదేశం తన చమురు అవసరాలు తీర్చుకోవటానికి 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశంలో రోజుకు 70 లక్షల బారెళ్ల చమురు ఖర్చవుతుందని అంచనా. ఇందులో ప్రధాన భాగం అమెరికా, పశ్చిమాసియా దేశాల నుండి వస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా దిగుమతులపై ఆధారపడటంం మరింత పెరిగింది. పైగా ఈ దిగుమతులు కూడా ఒకటి రెండు కేంద్రాల నుండే కావటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో గుత్తాధిపత్యం ప్రభావం భారత చమురు వినియోగం, ఆర్థికవ్యవస్థపై పడుతోంది. రష్యా నుండి దిగుమతి చేసుకునే చమురు దేశీయ చమురు వినియోగంలో కేవలం రెండు శాతం మాత్రమే.

గతంలో యుపిఎ ప్రభుత్వం ఇరాన్‌, వెనిజులా వంటి దేశాల నుండి చమురు దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నం చేసినా అంతర్జాతీయ రాజకీయ వైరుధ్యాలు, వైషమ్యాల కారణంగా అమెరికా అందుకనుమతించలేదు. పెట్రోలియం శాఖ మంత్రులుగా మణిశంకర్‌ అయ్యర్‌, దివంగత జైపాల్‌ రెడ్డి ఈ కారణంగానే ఇతర శాఖలకు మారాల్సి వచ్చిన వాస్తవం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అయితే దేశంలో చమురు ధరలు పెరగటానికి పూర్తి కారణం అంతర్జాతీయ రాజకీయాలు, చమురు మార్కెట్‌ గుత్తాధిపత్యమేనని భావిస్తే పొరపాటవుతుంది.

పార్లమెంటరీ రీసెర్చ్‌ సర్వీస్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఉన్న అంశాలివి.
‘‘2014 నుండి 2018 మధ్య కాలంలో అంతర్జాతీయ చమురు ధరలకు దేశీయ పెట్రో ఉత్పత్తుల ధరలకు మధ్య పొంతన లేకుండా పోయింది. అంతర్జాతీయ చమురు ధరలు జూలై 2014 నుండి జనవరి 2016 మధ్య కాలంలో గణనీయంగా పడిపోయాయి. తిరిగి ఫిబ్రవరి 2016 నుండి అక్టోరు 2018 మధ్యకాలంలో కాస్తంత పెరిగాయి. కానీ ఈ కాలంలో వినియోగదారులు చెల్లించే ధరలు ఏ మాత్రం తగ్గలేదు. దీనికి కారణం ప్రధానంగా ప్రభుత్వాలు పన్నుల వ్యవస్థలో తెచ్చిన మార్పులే. ఉదాహరణకు కేంద్ర ఎక్జైసు సుంకం 2014లో పెట్రోలుపై 11 రూపాయలు, డీజిలుపై 13 రూపాయలు పెంచింది. ఫిబ్రవరి 2016 అక్టోబరు 2018 మధ్య కాలంలో నాలుగు రూపాయల పన్ను తగ్గించింది.’’

ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు జనవరి 2012 నుండీ తగ్గుతూ వస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచుకుంటూ పోయింది. 2012లో లీటరు 60 రూపాయలుగా ఉన్న పెట్రోలు ధర 2021 నాటికి 110 దాటింది. అదే సమయంలో 2012లో 90 డాలర్లుగా ఉన్న బారెల్‌ ముడి చమురు ధర 2021 నాటికి 60 డాలర్లకు పడిపోయింది. కానీ అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల తగ్గుదల వినియోగదారులకు ఎటువంటి ఉపశమనాన్ని కల్పించకుండా ప్రభుత్వం మోకాలడ్డింది. డీజిల్‌ పరిస్థితి కూడా ఇంతే. 2012 నుండి 2021 మధ్య కాలంలో 30 రూపాయల నుండి డీజిలు ధర మూడు వందలరెట్లు పెరిగి 90 రూపాయలు అయ్యింది.

అంతర్జాతీయ మార్కెట్‌తో పొంతన లేకుండా దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగటానికి ముఖ్య కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వైరుధ్యమే. ఓ లెక్క ప్రకారం చూస్తే ఢల్లీిలో పెట్రోలు ధరలు డీలర్‌ వద్దకు చేర లీటరు 44.4 రూపాయలు అవుతుంది. దానిపై అదనంగా కేంద్రం విధించే ఎక్సైజు సుంకం 32.9 రూపాయలు. ఢల్లీి రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను రేటు లీటరుపై 24.3 రూపాయలు. డీలరు కమీషన్‌ సగటున నాలుగు రూపాయలు. అంటే లీటరు పెట్రోలు ధర ఢల్లీి మార్కెట్‌లో 105 రూపాయలు ఉంటే అందులో 42 శాతం మాత్రమే చమురు దిగుమతి, శుద్ధి, సరఫరా, నిల్వ ఖర్చులు. మిగలిన 58 శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులే.

ఇందులో కూడా 42 శాతం పన్నులు కేంద్రమే విధిస్తోంది. అంటే అంతర్జాతీయ ధరల కంటే కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులవల్లనే దేశంలో పెట్రోలు ధరలు భారంగా మారుతున్నాయి. అత్యధికంగా రాజస్థాన్‌ ప్రభుత్వం 36 శాతం పన్నులు విధిస్తుంటే అత్యల్పంగా తమిళనాడు ప్రభుత్వం 12 శాతం పన్ను మాత్రమే విధిస్తోంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్సైజు పన్నులో రెండు భాగాలుంటాయి. పన్ను భాగం, అదనపు సుంకం (సర్‌ ఛార్జి) భాగం. ఇందులో పన్ను వాటాలో వచ్చిన ఆదాయంలో మాత్రమే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఇస్తుంది.

సర్‌ ఛార్జి ద్వారా వసూలు చేసిన ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం గానీ, రాజ్యాంగపరమైన బాధ్యతగానీ కేంద్ర ప్రభుత్వంపై లేదు. ప్రస్తుతం వ్యవసాయక రంగంలో మౌలిక వసతుల కల్పన సర్‌ చార్జి, రహదారి అభివృద్ధి పథకాలకో వెచ్చించే సర్‌ ఛార్జిలను కేంద్రం వసూలు చేస్తోంది. స్థూలంగా చెప్పుకోవాలంటే కేంద్రం పెట్రోలుపై వసూలు చేస్తున్న పన్నుల్లో షుమారు ఐదు రూపాయల వాటాను నేరుగా కేంద్రమే కాజేస్తోంది.

అంతే కాదు. గత నాలుగేళ్లల్లో పెట్రోలుపై కేంద్రం విధించే పన్నులో 40 శాతం, డీజిలుపై కేంద్రం విధించే 59 శాతం సర్‌ ఛార్జిగా మారింది. ప్రస్తుతం కేంద్రం పెట్రోలపై విధిస్తున్న ఎక్సైజుసుంకంలో 94 శాతం, డీజిలుపై విధిస్తున్న సుంకంలో 96 శాతం సర్‌ చార్జి రూపంలోనే ఉంది. అంటే నాలుగేళ్ల వరకూ కేంద్ర ఎక్సైజు పన్నులో రాష్ట్రాలకు వాటా వచ్చినట్లు ప్రస్తుతం వచ్చే అవకాశం లేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ ఆదాయాల కోసం గణనీయమైన మోతాదులో పన్నులు విధించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఏతావాతా వినియోగదారుడి పరిస్థితి చెంపదెబ్బ గోడ దెబ్బ అన్నట్లయ్యింది.

ఈ వాస్తవాలు గమనించినప్పుడు దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరల విషయంలో ఎవరిమమీదనో నెపం మోపేకంటే ప్రభుత్వం తీసుకోగలిగిన ఉపశమన చర్యలు ఎన్నో ఉన్నాయని స్పష్టమవుతోంది.

వ్యాసకర్త: కొండూరి వీరయ్య

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...