ఆయిల్ బాండ్ల అసలు గుట్టు ఏమిటి?

0
212

Oil Bonds: గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్ బాండ్ కు తాము చెల్లించాలి కనుక, ప్రభుత్వం పన్నులు తగ్గించలేదని, తద్వారా పెట్రోల్ ధరలు కూడా తగ్గించలేదని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అసలు ఆయిల్ బాండ్స్ అంటే ఏమిటి? పెరిగిపోతున్న పెట్రోల్ ధరలను అదుపు చేయనీయకుండా అవి ఏమేరకు ప్రభుత్వానికి చేతులు కట్టిపడేశాయి?

పెట్రోల్, డీజిల్ ధరలు, పెట్రో ఉత్పత్తుల ధరలు గత ఏడాది నుంచి విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రభుత్వంపైన విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలను కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అనేక సార్లు, ముఖ్యంగా గత వారం సమాధానం చెపుతూ.. కాంగ్రెస్ నాయకత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్ బాండ్ కు చెల్లించాల్సి రావడం వల్ల (ధరల్లో వచ్చిన పరిణామంతో) ప్రస్తుత ప్రభుత్వం పన్నులను తగ్గించలేదని స్పష్టం చేశారు.

ఆయిల్ బాండ్స్ కు చెల్లించవలసి రావడం వల్లనే ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల పైన పన్నులు తగ్గించలేకపోవడం అనేది ఎంత మటుకు వాస్తవం? పెట్రోల్ కు చెల్లించే ధరలో పన్నులెంత?

రిటైల్ ధరలను నిర్ణయించేది రెండు అంశాలు. ఒకటి ముడి చమురు అసలు ధర, దాని పైన ప్రభుత్వం విధించిన పన్నులు. ఈ రెండూ కలిపి రిలైట్ ధరగా మనం చెల్లించాల్సి వస్తోంది. పన్నుల చెల్లింపులో ఒక ఉత్పత్తికి మరొక ఉత్పత్తికి తేడా ఉంటుంది. ఉదాహరణకు మనం చెల్లించే పెట్రోల్ ధరలో 50 శాతం పన్నుగా చెల్లిస్తుంటే, డీజిల్ ధరలో 44 శాతం పన్నుగా చెల్లిస్తున్నాం.

ఆర్థిక శాఖా మంత్రి ఏం చెప్పారు?

ఆమె రెండు విషయాలు చెప్పారు. చమురు ధరలు పెరగడానికి ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం ఒక కారణం కాగా, యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్ బాండ్స్ రెండవ కారణమని ఆరోపించారు. “ఆయిల్ బాండ్స్ పేరుతో దశాబ్దం క్రితం వినియోగదారులకు పంచిపెట్టినదానికే ఇప్పుడు పన్ను చెల్లింపు దారులు మూల్యం చెల్లించుకోవలిసి వస్తోంది. ఆయిల్ బాండ్ల నుంచి విముక్తి లభించేవరకు; అంటే మరో అయిదేళ్ళవరకు, 2026 వరకూ ఇలా చెల్లించుకోవలసి వస్తుంది.” అని రాజ్యసభలో ఆమె ప్రకటించారు.

ఈ పార్లమెంటులో 2021 డిసెంబర్ లో నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ 2008లో ప్రధాని జాతి నుద్దేశించి మాట్లాడిన మాటలను ఇలా ఉటంకించారు. “ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సిన లోటును భర్తీ చేయడానికి ఆయిల్ బాండ్స్ విడుదల చేయడమనేది శాశ్వత పరిష్కారం కాదని జాతికి గుర్తు చేస్తున్నాను. ఈ లోటును పూడ్చాల్సిన భారాన్నంతా మన పిల్లల పైకి తోసేస్తున్నాం”

అసలు ఆయిల్ బాండ్స్ అంటే ఏమిటి? వాటిని ఎందుక జారీచేశారు?

సాధారణ వినియోగదారులకు పెట్రో ధరలు భారమైనప్పుడు, ధరను తగ్గించమని గత ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను కోరింది. వాటికి చెల్లించాల్సింది పూర్తిగా చెల్లించకపోతే వాటి లాభాలు తగ్గిపోతాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ధరల్లో వచ్చిన తేడాను ప్రభుత్వం చెల్లిస్తానని చెప్పింది. పెరిగిన ధరను ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించినట్టయితే దానికి అర్థం లేదు. ప్రభుత్వం కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించాలనుకుంటే, మళ్ళీ ఆ నగదును పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేయాల్సి వస్తుంది.
ఈ సమయంలో ఆయిల్ బాండ్స్ ప్రవేశించాయి.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తరువాత చెల్లిస్తామని ప్రామ్సరీ నోటు లాగా రాసివ్వడమే ఈ ఆయిల్ బాండ్స్. ఇలా కంపెనీలకు చెల్లించాల్సిన నగదుకు బదులుగా ఆయిల్ బాండ్స్ రాసివ్వడం వల్ల పెరిగిన పూర్తి ధరను వినియోగదారుడి నుంచి కంపెనీలు వసూలు చేయవు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు పదేళ్ళలో వెయ్యి కోట్ల రూపాయలను చెల్లించాలని ఆయిల్ బాండ్ చెపుతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు నేరుగా ఈ డబ్బు రాదు కనుక, బాండ్ కాలపరిమితి తీరే వరకు (మెచూర్ అయ్యే వరకు) అంటే పదేళ్ళ పాటు ప్రతి ఏడాది 8శాతం, అంటే 80 కోట్ల రూపాయలను అదనంగా చెల్లించాలి.

ఆయిల్ బాండ్ ను జారీ చేయడం ద్వారా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు లాభం లేకుండా, లోటు బడ్జెట్ లేకుండా వినియోగదారులను రక్షించగలుగుతోంది. గతంలో చాలా ప్రభుత్వాలు ఆయిల్ బాండ్ ను జారీ చేశాయి. యూపీఏ ప్రభుత్వం గతంలో ఒక సారి ఆయిల్ బాండ్స్ ను జారీ చేయడమే ఇప్పుడు ఎదురైన సమస్య.‌ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టినప్పుడు 2015, 2026 మధ్య చెల్లించవలసిన ఆయిల్ బాండ్స్ విలువ లక్ష, 34 వేల కోట్ల రూపాయలు.

యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్ బాండ్ల‌కు ఎన్డీఏ ప్రభుత్వం ఎంత చెల్లించింది?

ఇంతకు ముందు చర్చించినట్టు ఆయిల్ బాండ్స్ రెండు రకాలుగా చెల్లించాలి. మొదటిది ప్రతి ఏడాది చెల్లించే వడ్డీ రూపంలో, రెండవది బాండ్స్ కాలపరిమితి తీరాక చివరగా చెల్లించాల్సిన మొత్తం.‌ ఇలాంటి బాండ్లు జారీచేసేటప్పుడు చెల్లించాల్సిన మొత్తాన్ని ఐదేళ్ళు, పదేళ్ళు, ఇరవై ఏళ్ళకు వాయిదా వేస్తూ, ప్రతి ఏడాది వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం 2015-2021 మధ్య నాలుగు సెట్ల ఆయిల్ బాండ్ల‌కు 13,500 కోట్ల రూపాయలను పూర్తిగా చెల్లించింది. కాలపరిమితి పూర్తి కాని ఆయిల్ బాండ్ల‌కు బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏడాది వడ్డీ చెల్లించాలి. 2014-2022 మధ్య 93 వేల 686 కోట్ల రూపాయలను వడ్డీ కింద, అసలు కింద చెల్లించింది.

ఆర్థిక శాఖ పన్నులు తగ్గించలేకపోవడానికి చెల్లించిన ఈ మొత్తం చాలా ఎక్కువా?

పెట్రోలియం ఉత్పత్తుల పైన విధించిన అన్నిరకాల పన్నుల ద్వారా సంపాదించిన మొత్తం పెట్రోల్ కోసం ప్రజలకు చేసిన చెల్లింపులతో పోల్చుకుందాం. పన్నులు తగ్గించడానికి , పెంచకుండా ఆంక్షలు విధించడానికి ఈ మొత్తం సరిపోతుందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మూడు మార్గాలున్నాయి.
మొదటి మార్గం ఏమంటే, 2014-2015 ఆర్థిక సంవత్సరంలో చెల్లించవలసిన మొత్తంలో కేవలం 7 శాతం మాత్రమే చెల్లించిన విషయాన్ని పరిశీలించాలి. ఏళ్ళు గడుస్తున్న కొద్దీ చెల్లించాల్సిన శాతం తగ్గుతూ రావాలి. ఎందుకంటే, ఈ రంగం నుంచి వస్తున్న పన్నులు విపరీతంగా పెరుగుతున్నాయి కనుక. పెట్రోలియం రంగం నుంచి 2014-2022 మద్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో లభించిన మొత్తం ఆదాయాన్ని గమనించడం రెండవ మార్గం.

ఈ మొత్తం 43 లక్షల కోట్ల రూపాయలకంటే ఎక్కువ. ఈ రంగంలో వచ్చిన ఆదాయంలో కేవలం 2.2 శాతం మాత్రమే ఆయిల్ బాండ్స్ పైన ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించింది. గమనించాల్సిన మూడవ అంశం ఏమిటంటే, ఈ రంగం నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ రూపంలో వసూలు చేసిన ఒకే ఒక పన్ను మొత్తం 99 వేల కోట్ల రూపాయలు. ఆయిల్ బాండ్స్ కింద ఎన్డీఏ ప్రభుత్వం ఈ రంగం నుంచి పన్నుల రూపంలో సంపాదించిన మొత్తంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించాల్సిన మొత్తం పెద్దగా పోల్చదగ్గదేమీ కాదు.

ఇలా ఆయిల్ బాండ్స్ జారీ చేయడం ఇప్పటికీ తప్పుడు విధానం కాదా?

బాండ్స్ జారీ చేయడమమంటే బాధ్యతలను భవిష్యత్తు తరానికి వదిలివేయడం తప్ప మరొకటి కాదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంటారు. కానీ, చాలా ప్రభుత్వాలు బాండ్స్ రూపంలో అప్పు తెస్తున్నాయి. అందుకనే ప్రతి సంవత్సరం ద్రవ్యలోటును ( మార్కెట్ నుంచి ప్రభుత్వం అప్పుతెచ్చుకోవడం తప్పనిసరి చేస్తూ) తప్పించుకుంటోంది. భారత దేశంలాంటి పేద దేశాలన్నీ ఏదోరకంగా తప్పనిసరిగా బాండ్లను తరచూ వాడుకోవాల్సి వస్తోంది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వమే పబ్లిక్ రంగ బ్యాంకులలో తిరిగి పెట్టుబడి సమకూర్చడానికి ఆయిల్ బాండ్లకు రెంట్టింపుగా 2 లక్షల 79 వేల కోట్ల రూపాయలకు బాండ్లను జారీ చేసింది. ఈ బాండ్లకు 2036 వరకు చెల్లించాల్సి ఉంటుంది. బెంగుళూరులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వైస్ ఛాన్సలర్ ఎన్.ఆర్. భానుమతి అభిప్రాయం ప్రకారం, దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచాలనే ప్రభుత్వం ఈ బాండ్లను జారీచేయాల్సి వస్తోందట.

వ్యాసకర్త: ఉదిత్ మిశ్రా

ఆనువాదం : రాఘవ శర్మ,
(ఇండియన్ ఎక్స్ ప్రెస్ సౌజన్యంతో)

Also Read…

శతాబ్దకాలపు రామనవమి హింస చరిత్ర – నీలాంజన్‌ ముఖోపాధ్యాయ

TRS: ప్లీనరీ ఏర్పాట్లపై నేతలతో కేటీఆర్‌ సమావేశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here