High Court Approves Rahul OU Meeting: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్ధులతో తలపెట్టిన సమావేశానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సభకు అనుమతి ఇవ్వాలని ఉస్మానియా యూనివర్శిటీ వైఎస్ ఛాన్సలర్ ను హైకోర్టు ఆదేశించింది. దీంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న గందరగోళానికి తెరపడినట్లు అయింది. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి చాలా ముందుగానే యూనివర్శిటీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. దీనికి కౌంటర్ గా అధికార టీఆర్ఎస్ కు చెందిన విద్యార్ధి విభాగం కూడా అనుమతి ఇవ్వవద్దని వినతిపత్రం అందజేసింది. తర్వాత యూనివర్శిటీ యాజమాన్యం రాహుల్ పర్యటనకు నో చెప్పటంతో కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ అంశాన్ని విచారించిన కోర్టు రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. గతంలో ఉస్మానియా యూనివర్శిటీలో ఎన్నో రాజకీయ , రాజకీయేతర సమావేశాలు జరిగాయి. కేవలం విద్యార్ధుల సమస్యలు వినటానికి మాత్రమే రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీకి వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే యూనివర్శిటీ అధికారులు మాత్రం పరీక్షలు జరుగుతున్నాయని..శాంతి భద్రతల సమస్యలు వస్తాయని చెప్పి అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీ ఈ నెల 6,7 తేదీల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. తొలి రోజు వరంగల్ లో రైతు సంఘర్షణ పేరుతో సభను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సభను నిర్వహించాలని తలపెట్టాలని నిర్ణయించింది. ఇందుకు భారీ ఎత్తున జనసమీకరణ చేసేలా సన్నాహాలు చేశారు. మరుసటి రోజు అంటే మే 7న హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్ధులతో సమావేశం కావటంతోపాటు..మరికొన్ని సమావేశాల్లో పాల్గొనాలని నిర్ణయించారు.
Also Read:
RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లపై కీలక ప్రకటన
Rain in Telangana: తెలంగాణ లో భారీ వర్షం.. ఈదురుగాలుల బీభత్సం..!