సమైక్యత లేకపోతే దేశమే అల్లకల్లోలం: జూలూరు గౌరీశంకర్

0
69

మన దేశ జాతీయ సమైక్యతను నిలుపుకోలేక పోతే దేశం అల్లకల్లోలమవుతుందని, దేశంలో అభివృద్ధి ఆగిపోతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రగతిశీల శక్తులు, అభ్యుదయవాదులు, సామాజికంగా ఆలోచించే కవులు, రచయితలు నేడు జాతీయ సమైక్యత మతసామరస్యంపై విరివిగా రచనలు చేయాలని ఆయన కోరారు. ఆదివారం నాడు పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జాతీయస్థాయిలో జరిగిన తెలంగాణ పోయెట్రీ ఫెస్టివల్ ను జూలూరు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతాన్ని నమ్ముకున్న రాజ్యాలు ఏ రకమైన దుస్థితిని ఎదుర్కొంటున్నాయో ఈ తరానికి రచనల ద్వారా తెలియజేయాలన్నారు. జాతీయస్థాయిలో కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా స్థానికంగా కూడా యువతకు స్ఫూర్తిని కలిగించే విధంగా రచనలు విస్తృతంగా రావాలని తెలిపారు.

రవీంద్రనాథ్ ఠాగూర్ ఆనాడు దేశ విముక్తి కోసం జాతీయ గీతం రాస్తే ఈనాడు దేశ సమైక్యతను కాపాడుకోవడానికి నూతన జాతీయ గీతాలకు రూపకల్పనలు జరగాలని ఆకాంక్షించారు. దేశంలోని నాయకులకు సైతం దిశానిర్దేశం చేసే విధంగా కవుల కలాల నుంచి నూతన గీతాలు రచింపబడాలని జూలూరు తెలిపారు. ఈ తెలంగాణ పోయెట్రీ ఫెస్టివల్ లో ఉత్తరప్రదేశ్, అస్సాం, పశ్చిమబెంగాల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కవులు పాల్గొన్నారు‌. తెలంగాణలో లబ్ద ప్రతిష్టులైన కవులు డాక్టర్ దామెర రాములు, డాక్టర్ అప్పాల చక్రధారి, సుంకర రమేష్, కొండి మల్లారెడ్డి, అన్నవరం దేవేందర్, తుమ్మల దేవరావు, అంబటి నారాయణ, శ్రీరామకవచం సాగర్ తదితరులు హాజరయ్యారు.

తెలంగాణ పోయెట్రీ ఫెస్టివల్ నిర్వాహకుడు, ప్రముఖ అనువాదకుడు డాక్టర్ మంతెన దామోదరాచారి అధ్యక్షత వహించగా.. యువ కవయిత్రి మహావాసేన్, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒరియన్ కవి ప్రదీప్ బిస్వాల్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ రిజిస్టర్, ప్రముఖ కవయిత్రి డాక్టర్ పండిట్ విజయలక్ష్మి, బెనారస్ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్, కవయిత్రి బీమాసింగ్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఉత్తరప్రదేశ్ కు చెందిన కవి ఓపీ అగర్వాల్ ఓం రాసిన ది రెయిన్ బో ఆఫ్ లైఫ్ పుస్తకాన్ని, డాక్టర్ మంతెన దామోదరచారి అనువదించిన వల్లంపట్ల నాగేశ్వరరావు రచనల సంపుటి సాంగ్స్ ఆఫ్ ఎవేకింగ్ డాక్టర్ పండిట్ విజయలక్ష్మి రచన పోయెట్రీ ఈస్ మై లైఫ్ పుస్తకాలను ఆవిష్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here