త్యాగశీలి జమలాపురం కేశవరావు

0
74

స్వాతంత్ర్య ఉద్యమంలో అనేకమంది ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా దేశం కోసం పోరాడారు. అటువంటి వారిలో సర్దార్ జమలాపురం కేశవరావు(Sardar Jamalapuram Kesavarao) ఒకరు. ఆయన ముక్కుసూటితనం ఆయనకు పదవులని దక్కకుండా చేసి ఉండవచ్చు. కానీ ఆ ముక్కుసూటితనమే ఆయనకు
తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టింది.

దక్కన్‌ సర్దార్‌గా, ఉక్కు మనిషిగా ప్రజలు పిలుచుకునే కేశవరావు నిజాం సంస్థానంలో తూర్పు భాగాన ఉన్న ఖమ్మం (నాటి వరంగల్ జిల్లా)లోని ఎర్రుపాలెంలో 1908, సెప్టెంబర్ 3 న జమలాపురం వెంకటరామారావు, వెంకటనరసమ్మలకు తొలి సంతానంగా జన్మించాడు. సంపన్న జమీందారీ వంశంలో పుట్టినా, నాటి దేశ రాజకీయాలు అతనిని ఎంతగానో కలవరపరచాయి. ఎర్రుపాలెం లో ప్రాథమిక విద్య అనంతరం, హైదరాబాదులోని నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. వందేమాతరం గీతాలాపనను నిషేధించినందుకు నిరసనగా, కళాశాల విద్యార్థులను కూడగట్టి, నిరసనోద్యమంలోకి దిగాడు. గీతాన్ని ఆలాపించనివ్వకపోతే తరగతులకు హాజరుకాబోమని హెచ్చరించాడు.

దీంతో చివరకు నిజాం పాలకవర్గం నిషేధాన్ని ఎత్తివేయక తప్పలేదు. ఈఘటన తర్వాత కేశవరావు ఆలోచనా పరిధిని మరింత విస్తృతం చేసి ఆయన వెళ్లాల్సిన మార్గాన్ని మరింత స్పష్టం చేసింది. ఆరడుగుల ఆజానుబాహువైన కేశవరావు, ఎత్తుకు తగ్గ దృఢమైన శరీరం, చెరగని చిరునవ్వుతో నిండుగా కనిపించేవాడు. నిజాం పాలనలో కొనసాగుతున్న వెట్టి చాకిరితో అష్టకష్టాలకు గురవుతున్న ప్రజలను చూసి కేశవరావు చలించిపోయారు.ప్రజల కష్టాలను తీర్చడం కోసం ఆయన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన సూటిగా ప్రశ్నించేవారు.

1923లో రాజమండ్రిలో మొదటిసారి మహాత్మా గాంధీ ఉపన్యాసాన్ని విన్న కేశవరావు, 1930లో విజయవాడలో జరిగిన సభలో గాంధీ పరిచయంతో మరింత ఉత్తేజితుడైనాడు. ఆంధ్రపితామహుడుగా మాడపాటి హనుమంతరావు ప్రారంభించిన గ్రంథాలయ ఉద్యమంను తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ ప్రచారం గావించాడు. వయోజన విద్యకై రాత్రి పాఠశాలలు నడపడంలో కేశవరావు ముందుండేవాడు. అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రత్యేక శ్రద్ధను కనపరిచేవాడు. ‘హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌’ స్థాపనలో కేశవరావు కీలకపాత్ర వహించి, దానికి మొదటి అధ్యక్షుడయ్యాడు.

1938లో ఆవిర్భవించిన తెలంగాణ స్టేట్ కాంగ్రెస్‌లో కేశవరావు పాత్ర నిర్వహించాడు.1938 సెప్టెంబర్‌ 24 మధ్యాహ్నం మధిరలో గోవిందరావు నానక్, జనార్దనరావు దేశాయ్, రావి నారాయణరెడ్డిలతో కలిసి సత్యాగ్రహ దీక్షకు కేశవరావు సిద్ధమయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లో సర్దార్‌ను దీక్ష చేయనివ్వొద్దని నిజాం ప్రభుత్వం అనుమతినివ్వలేదు. మధిరలో అడుగడుగునా పోలీసులను మెహరించింది. అయినా భారీ సంఖ్యలో ప్రజలు దీక్ష వేదిక దగ్గరకు చేరుకున్నారు. అప్పుడే ఎవరూ ఉహించని విధంగా రైతు వేషంలో దీక్షా స్థలానికి చేరుకొని
అందర్నీ ఆశ్చర్య చకితులను చేశారు.

1942లో కాంగ్రెస్ పిలుపు మేరకు ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని తెలంగాణలో ఊరూరా ప్రచారం చేశాడు. 1946లో మెదక్ జిల్లా కందిలో కేశవరావు అధ్యక్షతన జరిగిన 13వ ఆంధ్ర మహాసభ సందర్భంగా నిర్వహించిన బ్రహ్మాండమైన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. 1947 ఆగస్టు 7న మధిరలో స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహం మరువలేనిది. దానికి బాధ్యుడైన కేశవరావుకు ప్రభుత్వం రెండు సంవత్సరాలు కారాగార శిక్ష విధించింది. యావత్ భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న సందర్భంలో కేశవరావు వంటి నాయకులు నిర్భంధానికి గురికావడం ఒక విషాదం.
ఆయన పలు సామాజిక ఉద్యమాలు నడిపారు. అంటరానితనం నిర్మూలించేందుకు ప్రయత్నం చేశారు. ఆదివాసీల అభివృద్ధికి కూడా ఉద్యమం చేశారు. పానుగంటి పిచ్చయ్య, వనం నరసింహారావు, నారాయణరావులతో పాల్వంచలో పర్యటించి ఆదివాసీ మహాసభను ఏర్పాటు చేశారు.గిరిజనులు హక్కుల కోసం పోరాడారు. తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయాల స్థాపనను యజ్ఞంలా భావించాడు. అంతేకాక వయోజన విద్య కోసం రాత్రి బడులు నడిపారు. అణగారిన వర్గాల్లో చైతన్యం నిపండానికి ప్రత్యేక శ్రద్ధ చూపాడు.ఆయన సహచరులు ఆయనను మోసం చేశారు. నిరంతరం ఉద్యమాల్లో ఉండటం,సకాలంలో ఆహారం తీసుకోకపోవడం,నమ్మిన సహచరులే మోసం చేయడంవల్ల కేశవరావు తీవ్ర ఒత్తిడికి గురై చిన్న వయసులోనే చనిపోయారు. లేదంటే ఆయన రాజకీయాల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టేవారు. అయితే ఆయన ఏనాడు పదవుల కోసం ఆరాటపడలేదు.ఇటువంటి త్యాగమూర్తులు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని చెప్పవచ్చు.

వ్యాసకర్త: యం. రాం ప్రదీప్
తిరువూరు, 9492712836

( సెప్టెంబర్ 3-కేశవరావు జయంతి )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here