సామాన్యుల స్వరం “రావిశాస్త్రి “

0
140

(నేడు రావిశాస్త్రి జయంతి)

రావిశాస్ర్తిగా పేరు పొందిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గొప్ప అభ్యుదయవాది.నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది. జేమస్ జాయిస్ “చైతన్య స్రవంతి” ధోరణిలో వచ్చిన మొదటి తెలుగు నవల ఇది. జేమస్ జాయిస్ రచనా పద్థతిని మొదటిసారిగా తెలుగు కథలకు అన్వయించినది కూడా రావిశాస్త్రినే. ఇది ఆయన మొట్టమొదటి నవల.

ఈ నవలను ఆయన 1952లో రచించాడు. తరువాత రాజు మహిషీ,రత్తాలు-రాంబాబు అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించిచాడు. ఈయన జీవిత చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు. అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా ఈ అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే.

ఈ నవలలో ప్రధాన కథానాయకుడు సుబ్బయ్య భయస్థుడు, పిరికివాడు. తన జీవితంలో ఎదురయ్యే అనేక ఒడిదుడూకులను తన వ్యక్తిత్వమే కారణమని తెల్సుకొని తన వ్యక్తిత్వాన్ని పెంపుదించుకుంటు ఎలా వెళ్ళాతాడో రావిశాస్త్రి చిత్రీకరించాడు.

ఆంధ్రలో మద్యపాన నిషేధ చట్టం తెచ్చి పెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ ఆయన అద్భుతంగా రాసిన ఆరుసారా కథలు తెలుగు కథా సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించి అందరిని ఆలోచింపచేసాయి. అధికార గర్వానికి ధనమదం తోడైతే పై వర్గం వారు ఎటువంటి దుర్మార్గాలు చేయగలరో ఆయన నిజం నాటకంలో వ్యక్తం చేసాడు.

1922 జూలై 30న పుట్టి, పీడిత, తాడిత ప్రజల పక్షాన న్యాయంకోసం పోరాడి, విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాల నెదిరించి నెలల తరబడి జైలుపాలై, ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి, పతితుల కోసం, భ్రష్టుల కోసం, బాధాసర్పదష్టుల కోసం దగాపడ్డ తమ్ముల కోసం, చల్లారిన సంసారల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం.. తుది శ్వాసవరకు అవిశ్రాంతంగా ఉద్యమించి 1993, నవంబర్ 10 న రావిశాస్త్రి కన్నుమూశాడు.

ఆరు సారా కధల సంపుటి  ముందు మాటలో శ్రీ శ్రీ  గారు అన్నట్టుగా ” అతడు కళా స్రష్ట. అతడు వ్రాసిన ఆరు కథానికలు ఆరు కళా ఖండాలు.  తెలుగులో ఒక్క గురజాడ మహాకవికి మాత్రమే సాధ్యమయిన పాత్ర చిత్రణ ఈ కధల్లో కనపడుతుంది. ఇవి వాస్తవికతకు ఒక నివాళి. వీటిలో  కధనం ఉంది, కావ్యం ఉంది, డ్రామా ఉంది. జీవితాన్ని  నిశితంగా పరిశీలించడం ఉంది. ఆ చూసిన దాని మీద వ్యాఖ్యానించినట్టు గా కనిపించని వ్యాఖ్యానం ఉంది”

రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడుకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను, మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను” అంటారు రావిశాస్త్రి.

యం.రాం ప్రదీప్
తిరువూరు
9492712836

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here